ఉద్యోగుల ఐక్యతను తొలచివేసిన రాజకీయ చీడ పురుగులు

 

దాదాపు ఐదారు లక్షల మంది వివిధ శాఖలకి చెందిన ప్రభుత్వోద్యోగులు అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి రెండున్నర నెలలుపైగా అనేక కష్టనష్టాలకు ఓర్చి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు పోరాడారు. అంత సుదీర్గ కాలంపాటు వారిని ఆవిధంగా సంఘటిత పరచిన వ్యక్తి వారి నాయకుడు అశోక్ బాబేనని అంగీకరించక తప్పదు. మొదట్లో ఉద్యోగులందరూ కూడా తమకు ఏ రాజకీయ పార్టీపట్ల అభిమానం ఉన్నపటికీ, ఉద్యమం పార్టీలకతీతంగా సాగినందున పూర్తి ఐఖ్యత ప్రదర్శించగలిగారు. అదీగాక ఆ సమయంలో అందరిలో రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తపన తప్ప మరి దేనికీ అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ఇక కేంద్రమంత్రులు, యంపీలు ఆడిన రాజీనామా డ్రామాలు, రాష్ట్ర విభజనపై కేంద్రం చేసిన హడావుడి వగైరాలు వారినందరినీ ఏక త్రాటిపై నిలిపి ఉంచాయి. సమ్మెజరుగుతునంత కాలం ఎంతో ఐక్యతగా మెలుగుతూ అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన ఉద్యోగులు, సమ్మెవిరమించిన తరువాత క్రమంగా ఒకరితో మరొకరు విభేదించడం దురదృష్టకరం. సమ్మె ముగింపు విషయంలో మొదలయిన విబేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నవారి నేతలే మాటలే స్పష్టం చేస్తున్నాయి. అయితే తమలో ఎటువంటి విభేదాలు లేవని పదేపదే వారు చెప్పవలసి రావడమే విభేదాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. బహుశః ఉద్యోగులలోకి కొన్నిరాజకీయ పార్టీలు ప్రవేశించినందునే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండవచ్చును. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి వికృత రాజకీయ క్రీడలు ఆడుతున్న రాజకీయ పార్టీలు, నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో విఫలమయినా, ఉద్యోగుల ఐఖ్యతను దెబ్బతీయడంలో సఫలమయ్యాఋ. ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చిరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమం చేస్తే వారికి బేషరతుగా అండగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వారిలో చీలికలు సృష్టించడం చాలా దురదృష్టకరం. విజ్ఞులయిన ఉద్యోగులు తమ మధ్యకి ప్రవేశించి తమ ఐక్యతను తొలచివేస్తున్న ఆ రాజకీయ చీడ పురుగులను ఏరి పడేయకపోతే అవి వారిని పూర్తిగా తొలచి గుల్ల చేసేయడం ఖాయం.