రాష్ట్ర విభజనపై ఎవరిది అనుమానాస్పద వైఖరి

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనపై నేటికీ ఒక స్పష్టమయిన వైఖరి అవలంబించకుండా ఇరు ప్రాంత ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్, వైకాపా, తెరాసలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీలకు లేని సమస్య ఒక్క తెదేపాకు మాత్రమే ఉన్నందునే ఆవిధంగా వ్యవహరించవలసి వస్తోందని ఆ పార్టీలకు కూడా తెలుసు. కేవలం తెలంగాణాకే పరిమితమయిన తెరాస, సీమాంధ్రకే పరిమితమయిన వైకాపాలకు రెండో ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన, అవసరం కూడా లేదు గనుక ఆ రెండు పార్టీలు విభజనపై తమకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా స్పష్టమయిన వైఖరి అవలంబించగలుగుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నకాంగ్రెస్ పార్టీ, అందుకోసం తన పార్టీని తెరాస, వైకాపాలకు తాక్కట్టుపెట్టుకోవడానికి మానసికంగా సిద్దపడింది గనుక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలందరూ అభ్యంతరాలను, అభ్యర్ధనలను కాదని విభజనపై గట్టిగా మాట్లాడగలుగుతోంది.

 

ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని ఉంటే నేడు వైకాపా పరిస్థితి ఏటికి ఎదురీదుతున్నట్లు ఉండేది. కానీ దాని అదృష్టవశాత్తు తెదేపా ఆవిధంగా చేయకపోవడంతో వైకాపాకు అది ఆయాచిత వరంగా మారింది. అదేవిధంగా ఒకవేళ వైకాపా కూడా నేటికీ రెండు ప్రాంతాలలో పోటీ చేయాలని భావించి ఉండి ఉంటే, ఆ పార్టీ నోట కూడా సమైక్యమనే మాట వినపడేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

తెదేపా రెండు ప్రాంతాలలో ఎలాగయినా పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే నేటికీ స్పష్టమయిన వైఖరి చెప్పలేకపోతోంది. కానీ, రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖపై నేటికీ తెదేపా కట్టుబడే ఉంది. కానీ సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతోనే ఆమాటను గట్టిగా చెప్పుకోలేకపోతోంది. అందువల్ల ఆపార్టీ తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతోందని తెలిసి ఉన్నప్పటికీ, మౌనం వహించక తప్పడం లేదు.

 

కానీ సమైక్యవాదం చేస్తున్న వైకాపా కేవలం సీమాంధ్ర పైనే తన దృష్టి పెట్టడం గమనిస్తే అది మనస్పూర్తిగా రాష్ట్ర విభజనను కోరుకొంటున్నసంగతి స్పష్టమవుతోంది. తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతో పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలను తమ తమ ప్రాంతాల ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడేందుకు అంగీకరించవలసి వస్తే, సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలనే తాపత్రయంతో వైకాపా భూటకపు సమైక్యవాదం చేస్తోంది.

 

నిజం చెప్పాలంటే తెదేపా వ్యవహరిస్తున్నతీరుని, అందుకు గల కారణాలను సామాన్య ప్రజలు కూడా స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కానీ సీమాంధ్రపై పట్టుకోసం సమైక్యవాదం చేస్తున్న వైకాపా వైఖరే చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పక తప్పదు.