ఏపీ నిట్ డైరెక్టర్ వీడియో లీక్.. బయటపడిన బాగోతం!

ఆంధ్రప్రదేశ్ లో నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు బాగోతాలు తాజాగా వెలుగు చూశాయి. విద్యార్థునులపై లైంగిక వేధింపుల ఆరోపణ ఎదుర్కొంటున్న రమణారావుకు సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. తాను ఓ ఉమనైజర్ నని దొరికితే ఎవర్నీ వదలను అంటూ రమణారావు చెబుతున్న మాటలు అందులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. పైగా తన లైంగిక వేధింపుల విషయాలు తన భార్యకు కూడా తెలుసు అంటూ రమణరావు గర్వంగా చెప్పుకోవడం చర్చనీయాంశమైంది.

నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు వ్యవహారంపై అధికారులు అన్నీశాఖల డీన్ లతో చర్చించారు. అకడమిక్ సెక్షన్లను, కంప్యూటర్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమార్కుల నిగ్గు తేల్చడానికి కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి ఒకటి లోగా కమిటీ నివేదిక ఇవ్వాలి అంటూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ఇప్పటికే మాజీ మంత్రి మాణిక్యాల రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రెండుమూడ్రోజుల్లో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అలాగే.. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వారు విద్యార్థులను వేధించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మానవ వనరులు శాఖకు ఫిర్యాదు చేశామని కూడా వెల్లడించారు. కాగా నిట్ డైరక్టర్ సీఎస్పీ రావు వేధింపులు కొత్తేమీ కాదని... చాలా కాలం నుంచి ఆయన తీరు ఇలాగే ఉందని, బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో మరింత చెలరేగిపోతున్నారని అంటున్నారు విద్యార్థులు.