మృత్యు మార్గంలో… ధనమే ఇంధనం!
posted on May 10, 2017 2:33PM
.jpg)
మంగళవారం పడుకుని బుధవారం నిద్రలేచిన తెలుగు వారికి టీవీల్లో ఊహించని విషాదం కనిపించింది. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు, నిశిత్ మృతి చెందిన వార్త తాలూకు విజువల్స్, విభ్రాంతి కలిగించాయి. అయితే, ప్రముఖుల పిల్లలు ఇలా విషాదాంతం అవ్వటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా మనకు అనేక మంది పుత్ర శోకానికి గురైన సందర్భాలు తెలుసు. కాని, ఎందుకు ఇలాంటి దుర్ఘటనలు పదే పదే జరుగుతున్నాయి? రీజన్ ఏంటో టీడీపీ పార్టీకే చెందిన ఎంపీ దివాకర్ రెడ్డి సూటిగా చెప్పారు!
ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్ల కల్చర్ కి బాగా అలవాటు పడి తల్లిదండ్రులకి శోకాన్ని మిగులుస్తున్నారని ఆయన అన్నారు. అన్ని కేసుల్లో డ్రంక్ అండ్ డ్రైవే ప్రమాదానికి కారణమని మనం చెప్పలేం. వాహనం అంటూ ఎక్కాక యాక్సిడెంట్ ఎలాగైనా అవ్వచ్చు. తాగకుండా డ్రైవ్ చేసిన వారు కూడా చాలా సార్లు యాక్సిడెంట్లకు గురవుతుంటారు. కాని, సంపన్నుల సంతానం విషయంలో మాత్రం కొన్ని ఆందోళనకర అంశాలు దాదాపుగా అన్నికేసుల్లోనూ ఒకేలా వుంటున్నాయి! అదే వీఐపీ పేరెంట్స్ , రిచ్ పేరెంట్స్ ముందుగా గుర్తించాల్సింది!
ఇంకా పాతికేళ్లు కూడా నిండని యువకులకి మందు మాత్రమే మత్తు కాదు. ఖరీదైన బెంజ్ , బీఎండబ్ల్యూ కారో, హార్లీ డేవిడ్ సన్ బైకో కూడా మత్తే! ఒక్కసారి లక్షలు, కోట్లు విలువ చేసే వాహనాల యాక్సిలేటర్లపై కాలు పెడితే… వేగం తనంత తానుగానే పుంజుకుంటూ వుంటుంది. తాము ఎంత వేగంగా మృత్యువు దరిదాపుల్లోకి వెళుతున్నామో సదరు సంపన్న సంతానానికి తెలియదు. ఈ ట్రెండ్ ఇక్కడే కాదు… దేశ రాజధాని దిల్లీ దాకా అంతటా వుంది. దిల్లీలో ఇప్పటికే చాలా సార్లు ధనికుల పిల్లలు అతి వేగంతో కార్లు నడిపి ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రాణాలు తీశారు కూడా! కొన్ని సార్లైతే బాగా డబ్బున్న వారు కొందరు పిల్లలకి ఇంకా మైనారిటీ తీరక ముందే పెద్ద పెద్ద కార్లిచ్చి వీధుల్లోకి వదిలేస్తున్నారు. అది విధి రాతని ఎలా మార్చేస్తుందో గ్రహంచలేకపోతున్నారు!
సినిమా నటులు కోటా, బాబూ మోహన్ ఖరీదైన బైక్ ల కారణంగానే కొడుకుల్ని కోల్పోయారు. క్రికెటర్ అజారుద్దీన్ తనయుడి అంతం కూడా లక్షలు పోసి కొనుక్కున్న బైక్ వల్లే! ఇక ఖరీదైన కార్లోనే మృత్యువాత పడ్డాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు. ఇప్పుడు తాజాగా నారాయణ కుమారుడు కూడా ఖరీదైన కార్లోనే మెట్రో పిల్లర్ ని ఢీకొట్టాడు. అయితే, ఇలాంటి ప్రమాదాలు మామూలు కార్లు, బైక్ ల వల్ల జరగవా అంటే ఖచ్చితంగా చెప్పలేం. యాక్సిడెంట్ ఎలాగైనా, ఎందువల్లైనా అవ్వొచ్చు. కాని, అత్యధిక శాతం ధనికుల యాక్సిడెంట్స్ ఖరీదైన కార్లు, బైక్ లలోనే అవ్వటం అతి వేగాన్నే సూచిస్తున్నాయి. అతి వేగానికి కారణాలు బోలెడు వుండవచ్చు. తాగి నడపటం, జోష్ ఎక్కువై స్పీడ్ పెంచేయటం, నిద్ర మత్తులో నడపటం … ఇలాంటి అనేక కారణాలు వుంటాయి. కాని, అంతిమ ఫలితం మాత్రం ఒక్కటే… ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి పుత్రశోకం! జీవితాంతం తేరుకోలేని మానసిక క్షోభ!
డబ్బు సంపాదించిన వారు పిల్లలకి కార్లు, బైక్లు కొనవద్దని ఎవ్వరూ చెప్పరు. కాని, ఎంపీ దివాకర్ రెడ్డి చెప్పినట్టు పబ్ కల్చర్, బార్లలో మందు పార్టీలు, లేట్ నైట్ రేసింగ్ లు, నైట్ లైఫ్ ఎంజాయ్ మెంట్ … వీటి వల్లే ప్రమాదాలు జరిగేది. అటువంటి వాటి నుంచి వీఐపీలు, సెలబ్రిటీలు, ధనవంతులు తమ పిల్లల్ని కాపాడుకోవాలి. ఈ సమస్య డబ్బులేని వారికి, మధ్య తరగతి వారికి ఎదురయ్యేది కాదు. ప్రత్యేకంగా సూపర్ రిచ్ పేరెంట్స్ కే సవాలు విసురుతుంది. అందుకే, పిల్లల్ని మొదట్నుంచీ రిస్కీ లైఫ్ స్టైల్ కి దూరంగా వుంచటం మంచిది. అంతే కాదు, శిక్షణ, అనుభవం వున్న డ్రైవర్లకు కోట్లు పెట్టి కొన్న కార్లు అప్పగించటం మంచిది! ఎందుకంటే, పిల్లల ప్రాణాలు కోట్ల కన్నా ఖచ్చితంగా విలువైనవి! అమూల్యమైనవి!