నిశిత్ మృతి పట్ల రాజకీయ నాయకుల స్పందనలు...

 

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌  రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో నిశిత్‌ నారాయణతో పాటు అతని స్నేహితుడు  రాజా రవివర్మ కూడా మృతి చెందాడు. వీరి మృతిపట్ల పలువురు రాజకీయనేతలు స్పందించారు. వారి స్పందనలు..

హరికృష్ణ..

టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని అన్నారు. కాగా మూడేళ్ల క్రితం హరికృష్ణ కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.

చిరంజీవి...

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి... మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియగానే ఆసుపత్రికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ కుటుంబ సభ్యలను ఆయన ఓదార్చారు. ఎంతో భవిష్యత్ చూడాల్సిన పిల్లాడ్ని ఇలా చూడాల్సి రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను చూసి విలపించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. నారాయణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం పోలీసులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురు చూస్తుంటారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
 
కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిషిత్ నారాయణ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిషిత్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. చిన్న వయసులోనే నిషిత్ ప్రాణాలు కోల్పోవడం ఆవేదనను కలిగిస్తోందని తెలిపారు.

కేటీఆర్...

ఏపీ మంత్రి నారాయణకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నిశిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu