సలహాదారు పదవులకే వన్నె తెచ్చిన నియామకాలు.. దటీజ్ చంద్రబాబు
posted on Mar 20, 2025 10:53AM

ఏపీలో గత వైసీపీ గత పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. పాలన అంటే దోచుకో, దాచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలూ, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయం సాగింది. జగన్ హయాంలో జనం నిత్యం భయంభయంగా బతికే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాలలో నెలకొంది. ఐదేళ్ల పాటు జగన్ అరాచక పాలనకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. తెలుగుదేశం కూటమి కొలువుదీరి తొమ్మిది నెలలు అయ్యింది. ఈ తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో జనం స్వేచ్ఛగా ఉంటున్నారు. అక్రమ కేసుల భయం లేకుండా బతుకుతున్నారు. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయగలుగుతున్నారు.
ఇక ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని నియమిస్తోంది. అదే జగన్ హయాంలో సలహాదారుల నియామకం అన్నది ఒక వైసీపీ క్యాడర్ కు ఉద్యోగ కల్పన కోసమే అన్నట్లుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జగన్ హయాంలో భారీగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉండేవారు. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారు నియామకాలన్నీ.. అర్హత, యోగ్యతతో సంబంధం లేకుండా వైసీపీ అనుకూలురైతే చాలు అన్నట్లుగా జరిగాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుల పదవులలో నియమితులయ్యే వారంతా.. తమ సేవల ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసే వారు, చేయగలిగే వారే ఉంటున్నారు.
తాజాగా వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ అడ్వైజర్లుగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్ గా డీఆర్ఢీఓ మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి, ఫోరెన్సిక్ సైన్స్ కు కేపీసీ గాంధీ, హ్యాండ్ లూమ్స్ హబ్ కు సుచిత్రా ఎల్లాలను సలహాదారులుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నియామకాలే రాష్ట్ర పురోభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డిలను సలహాదారులుగా నియమించడం ద్వారా ద్వారా వారి అనుభవాన్ని, నైపుణ్యాన్నిరాష్ట్ర పురోభివృద్ధికి వినియోగించుకోవడానికి వీలవుతుంది.
ఇక సుచిత్రా ఎల్లా.. కరోనా కల్లోల సమయంలో కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్. టీటీడీ బోర్డు సభ్యురాలు కూడా. ఆమెను హ్యాండ్ లూమ్స్ హబ్ సలహాదారుగా నియమించారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ గా సుదీర్గ కాలం పాటు పనిచేసిన గాంధీని.. ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా నియమించారు. ఈ నియమకాలు వీరి నైపుణ్యాన్ని, ప్రతిభను ఆయా రంగాలను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా సలహాదారు పదవికే గౌరవం వచ్చిందని ప్రశంసిస్తున్నారు.