విశాఖలో కేపిటల్ లేనట్టేనా? అమరావతి ఊపిరి పీల్చుకో..
posted on Feb 23, 2021 4:50PM
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు 3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయ పడింది.
జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.
అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.
ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో. సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు.