అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా... చంద్రబాబు
posted on Jun 2, 2015 12:18PM

రాష్ట్రాన్ని విభజించినవారే అసూయపడేలా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముందున్న ఒకే ఒక సంకల్పం నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణమని, దీనికోసం మేము అహర్నిశలు శ్రమిస్తామని ప్రజలు కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు. అంతేకాక నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషిచేస్తామని దీక్షకు వచ్చిన ఉద్యోగులు, ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ కోరుకునేదని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరైనా తెలుగుప్రజలంతా ఒక్కటేనని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు.