మొన్న కే-టాక్స్.. నిన్న అసెంబ్లీ ఫర్నీచర్.. నేడు మరో కక్కుర్తి?

 

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం.. కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కోడెల కొడుకు, కూతురు మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ని సొంత ఫర్నీచర్ లా ఇంటికి తీసుకెళ్లడంపై కూడా కోడెల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే కోడెల ఇంకా అనేక అక్రమాలు చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల తన మార్కు చూపించారని తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి తరలించారు. ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనే నిర్ణయించారట. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ.. తొలుత వీటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే. ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదట.
 
ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారట. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారట. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదట. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది.

కనీసం 200 మంది ఉద్యోగులు ఈ కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కార్యాలయంలో సరిపోయే కారు పార్కింగు, సరైన మరుగుదొడ్ల వసతులు లేవట. అధికారుల చాంబర్లు కూడా ఇరుకుగా ఉంటాయట. అన్నింటికీ మించి అక్కడకు పనుల మీద వెళ్లే సామాన్యులు గుంటూరు బస్టాండు నుంచి ఆటోకు వెళ్లిరావాలంటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ బాధితులు ఇలా ఒకరనేమిటి నిత్యం వెళ్లే ఈ కార్యాలయం అంత దూరంలో ఏర్పాటు చేయడమేంటని వాపోతున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కోడెల ఎలా స్పందిస్తారో చూడాలి.