నేరాల అదుపునకు డ్రోన్ టెక్నాలజీ.. ఏపీలో సమర్ధంగా వినియోగం

ఆంధ్రప్రదేశ్ లో నేరాల అదుపునకు, నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తున్నది  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ లో నేరాలను అదుపు చేయడమే కాక, నియంత్రించవచ్చని పదే పదే చెబుతూ వస్తున్నారు. దీంతో పోలీసు శాఖ ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేస్తున్నది.

గంజాయి సాగును గుర్తించడంలో ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇప్పుడు.. పేకాటరాయుళ్లను అదుపు చేయడానికి కూడా డ్రోన్లను ఉపయోగిస్తోంది. అత్యంత రహస్యంగా చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు అదుపులోనికి తీసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ఈ  వీడియోను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం (మార్చి 27) సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.

లక్షలాది మంది వీక్షించారు. పోలీసు శాఖ డ్రోన్ లను నేరాల అదుపులో వినియోగించుకుంటున్న తీరును ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ప్రకారం విజయనగరంలోని ఓ మారుమూల ప్రాంతంలోవాహనాల గ్యారేజీని వేదికగా చేసుకుని ఓ లారీలో కూర్చుని పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సహాయంతో గుర్తించిన పోలీసులు అతి తేలికగా వారున్న ప్రదేశానికి చేరుకుని లారీ ఎక్కి మరీ పేకాట రాయుళ్లను అదుపులోనికి తీసుకున్నారు.  సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాల అదుపు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందనడానికి ఇదే తార్కాణంగా నెటిజనులు అంటున్నారు.