జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు ఇక లాంఛనమేనా?

మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినే నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అక్ర‌మ ఆస్తుల కేసులు గత కొన్నేళ్లుగా విచారణకు నోచుకోవడం లేదు.  గ‌డిచిన ఐదేళ్లు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న జ‌గ‌న్.. విచార‌ణ‌ల‌కు సైతం ఎగ‌నామం పెట్టేశారు. సీఎం హోదాలో త‌న‌కున్న వెసులుబాటును వినియోగించుకుని కేసుల విచారణ నత్తనడకతో పోటీ పడేలా చేసుకోగలిగారు.  అయితే  తాజాగా జ‌గ‌న్ జైలుకు వెళ్లాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆయ‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసుల‌ విచార‌ణ‌ వేగంగా జరిగేందుకు రంగం సిద్ధమైంది.  రాబోయే రెండు వారాల్లో ఈ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. రెండు వారాల్లో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కావొచ్చు... కేసుల విచార‌ణ మ‌రింత వేగ‌వంతం  కావొచ్చు అనే చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే అప్ప‌టి వైసీపీ ఎంపీ, ప్ర‌స్తుత ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రావు జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌ను వేరే రాష్ట్రంకు బ‌దిలీ చేయాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు.   సోమ‌వారం (డిసెంబర్ 2) ఈ పిటిష‌న్ పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం జగన్ పై కేసుల నత్తనడకపై ఓ  వైపుఆశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తూనే.. మ‌రోవైపు ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసింది. ఇన్ని సంవ‌త్స‌రాల‌పైబ‌డి సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీఐ కోర్టులో విచార‌ణ ఎలా సాగుతుంది..? తెలంగాణ హైకోర్టు రోజువారి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసినా సీబీఐ కోర్టు ఎందుకు విచార‌ణ చేయ‌డం లేదని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది.   


వైఎస్ జగన్ అక్ర‌మ ఆస్తుల‌ కేసులపై రఘురామకృష్ణ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ కేసుల‌పై విచారణ ఆలస్యం అవుతోందని.. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సోమ‌వారం ఈ పిటీషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం విచారణ చేయగా.. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే ఆదేశాలున్నాయని ఇరుపక్షాల లాయర్లు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు కోర్టుకు తెలిపారు. అయితే, జగన్ ఆస్తుల కేసు విచారణ ఇన్నేళ్లపాటు ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్ర‌శ్నించింది. డిశ్చార్జ్‌, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగే కారణమని లాయర్లు కోర్టుకు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాల వల్లే ఆలస్యమని.. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీం కోర్టు ధర్మానం చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్‌ కోర్టు, పెండింగ్‌ కేసుల వివరాలు ఇవ్వాలని   సుప్రీం కోర్టు  స్పష్టంగా ఆదేశించింది. అదే స‌మ‌యంలో జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని, అలాగే కింది కోర్టులలో ఉన్న డిశ్చార్జ్‌ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. 

కీల‌క‌మైన సీబీఐ, ఈడీ కేసుల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌దేళ్ల‌కు పైబ‌డి బెయిల్ పై ఉన్నారు.. ఐదేళ్ల‌కుపైబ‌డి క‌నీసం కోర్టుల‌కు కూడా హాజ‌రు కాలేదు. భార‌త‌దేశంలో బ‌హుశా ఏ నాయ‌కుడికి ఇలాంటి వెసులుబాటు దక్కి ఉండదు. భార‌త న్యాయ వ్య‌వ‌స్థ‌కే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసులు ఒక స‌వాలుగా పరిణమించాయని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.  సామాన్యుడికి సంబంధించి ఏదైనా కేసు విచార‌ణ ఉందంటే.. అత‌ను కేసు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క‌పోయినా, విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోయినా కోర్టులు వెంట‌నే స్పందిస్తాయి. అత‌నికి వారెంట్  జారీ చేస్తాయి.  త‌రువాత దాన్ని నాన్ బెయిల్ బుల్ వారెంట్ గా మారుస్తారు. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాని అడ్డుపెట్టుకొని గ‌త ఐదేళ్లుగా కోర్టుకు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు పొందారు. కానీ, ఆరు నెల‌లుగా ఆయ‌న ముఖ్య‌మంత్రి కాదు. అయినా స‌రే వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఎందుకిస్తున్నారు అనేది సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్ధంకాని ప్ర‌శ్న‌గా మారింది. 

వేల‌ కోట్ల రూపాయ‌ల‌ ప్ర‌జాధ‌నం దుర్వినియోగం జ‌రిగింద‌ని సీబీఐ  చార్జిషిట్ల ద్వారా కోర్టుకు స‌బ్మిట్ చేసిన ఉన్న‌ కేసుల్లో, మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగింద‌ని ఈడీ న‌మోదు చేసిన కేసుల్లో.. త‌న తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని కార్పొరేట్ సంస్థ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చ‌డం ద్వారా త‌న సొంత సంస్థ‌ల్లోకి నిధులు మ‌ళ్లించార‌ని సీబీఐ నిర్దార‌ణ చేస్తూ చార్జిషిట్ దాఖ‌లు చేసిన కేసుల్లో ప‌న్నెండు సంవ‌త్స‌రాల‌కు పైగా విచార‌ణ కొలిక్కి రాలేదు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసులు విచార‌ణ ఎందుకు ముందుకు సాగ‌డంలేద‌న్న ప్ర‌శ్న ప్ర‌తీఒక్క‌రి నుంచి వినిపిస్తోంది. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్ కేసుల‌ను త్వ‌రిత గ‌తిన విచార‌ణ పూర్తిచేసి తీర్పునివ్వ‌డం ద్వారా.. సామాన్యుడు, రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తులు అంద‌రూ కోర్టు ముందు స‌మానులే అని కోర్టులు మ‌రోసారి స్ప‌ష్టం చేసిన‌ట్లు అవుతుంది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు జ‌గ‌న్ ఆక్ర‌మాస్తుల కేసుల‌పై సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని బ‌ట్టిచూస్తుంటే త్వ‌ర‌లోనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కాబోతున్నద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేసింది.