అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు. అతడు చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. అతడి చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. అదే విధంగా అగ్నిప్రమాదం కారణంగా వచ్చిన దట్టమైన పొగ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో ఉక్కిరిబిక్కిరై ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో పాఠశాల సిబ్బంది మార్క్ శంకర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కోలుకుంటున్నారు. 

అగ్నిప్రమాదంలో తన చిన్న కుమారుడు గాయపడిన సంగతి  అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్  తెలిసింది. పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ బయలుదేరి వెళ్లాల్సిందిగా పవన్ కు అధికారులు, పార్టీ నేతలూ సూచించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శించి, వారి సమస్యలు తెలుసుకున్న తరువాత వెడతానని తెలిపారు.

అలాగే కురిడి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉందనీ వాటిని కూడా పూర్తి చేసిన తరువాత విశాఖ చేరుకుని అక్కడ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.