ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు...



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

* ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫిట్‌మెంట్‌తో కూడిన జీతాలను మే 1వ తేదీ నుంచి  అందుకుంటారు.

* ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పరికరాలను 70 శాతం సబ్సిడీతో ఇవ్వాలని నిర్ణయించారు. కరువు పీడిత ప్రాంతల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన రైతులకు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. వేరుశనగకు హెక్టారుకు 15,000, వరి, పత్తి, చెరకు, కూరగాయల పంటలకు 15,000, మొక్కజొన్నకు 12,500, మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, ఆరెంజ్‌ పంటలకు 20,000 నష్టపరిహారం ఇస్తారు. పప్పు ధాన్యాలు, సోయాబీన్‌ పంటలకు 10,000, అరటికి 25,000 పరిహారం చెల్లిస్తారు.

* ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి కుటుంబలకు  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు చెల్లిస్తుంది. మత్స్యకారుల పడవల మరమ్మతుల కోసం 10,000, చేనేత కార్మికులకు 10,000, క్షతగాత్రులు పది రోజులకు మించి ఆస్పత్రుల్లో చికిత్స పొందితే 50,000 ఇస్తారు.

* ఉద్యానపంటలకు కేటాయించిన ఇన్‌పుట్ సబ్సిడీలో 80 శాతాన్ని అనంతపురం జిల్లాకే కేటాయించారు. ఈ జిల్లాకు 856 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని  చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలకు కేటాయించారు.

* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా మే 31వ తేదీ లోపల ప్రాజెక్టుల వంతుగా కాలువల వెంట పర్యటిస్తారు.

* ఇసుక రీచ్‌లలో జీపీఎస్ విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

* అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల జీతాలను పెంచడానికి కేబినెట్ ఉపసంఘాన్ని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.

* నీటి యాజమాన్య పనుల కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు 50 కోట్ల చొప్పున, తూర్పు గోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు 20 కోట్ల రూపాయల చొప్పున ఉపాధి హామీ పథకం కింద నిధులను కేటాయించారు. ఇకపై గ్రామాల్లో పనుల ఆమోదానికి సర్పంచ్‌లతోపాటు జన్మభూమి కమిటీలకు కూడా అధికారం వుంటుంది.