విభజన కారణంగా ఏపీకి రెవెన్యూ లోటు
posted on Mar 12, 2015 2:33PM

రాష్ట్ర విభజన కారణంగా ప్రణాళికేతర ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం చివరి కేటాయింపులు అందే వరకూ రాష్ట్రానికి రెవెన్యూ లోటు తప్పదని ఆయన తెలిపారు. రెవెన్యూ వ్యయాన్ని సమకూర్చుకోవడం కోసం రుణాలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. రుణాల కారణంగా ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం వుందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 1,00,213 కోట్లు, ఇతర కీలక సదుపాయాల కోసం 41,253 కోట్లు ఆర్థిక సహాయం అందించాలని 14వ ఆర్థిక సంఘాన్ని కోరినట్టు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు కింద 22,113 కోట్లు, విపత్తు నిర్వహణకు 1823 కోట్లు కేటాయించిందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల కోసం తాము ప్రతిపాదించిన 29,805 కోట్లకు 3,636 కోట్లు కేంద్ర కేటాయించిందని చెప్పారు. స్థానిక సంస్థల కోసం తాము ప్రతిపాదించిన 18,633 కోట్లకు గాను 8,654 కోట్ల కేటాయింపు మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు.