మరో నాలుగేళ్ళు హైదరాబాద్ నుండి పరిపాలన మంచిదేనా?

 

ఆంద్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మరో నాలుగేళ్ళు పట్టవచ్చును. అంతవరకు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయవలసి ఉంటుంది. కానీ ఇటీవల జరిగిన పరిణామాలు గమనించినట్లయితే హైదరాబాద్ నుండి పరిపాలన చేయడంలో మున్ముందు కూడా ఇటువంటి ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అర్ధమవుతోంది. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్స్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నప్పుడు, ఇక ప్రభుత్వ వ్యవహారాలలో గోప్యత పాటించడం అసంభవమేనని స్పష్టం అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజమయితే ఇక ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఉన్నతాధికారులు ఎవరూ కూడా ప్రభుత్వ వ్యవహారాల గురించి ఫోన్స్ ద్వారా మాట్లాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాని వలన పరిపాలన మీద తీవ్ర ప్రభావం పడుతుంది.

 

ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం తలెత్తిన వివాదాలు నేడు కాకపోతే రేపయినా ఏదో విధంగా సద్దుమణగవచ్చు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజమయితే, మున్ముందు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ జరగదనే భరోసా ఏమీ లేదు. అటువంటప్పుడు మరో నాలుగేళ్లపాటు హైదరాబాద్ కేంద్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగించడం మంచిదా కాదా? అక్కడే కొనసాగదలిస్తే ఇటువంటి సమస్యలు మళ్ళీ తలెత్తకుండా ఏవిధంగా నివారించాలనే విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వం చాలా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం ఒక హెచ్చరికగా భావించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.