స్మార్ట్ ఫోన్ పిచ్చి జంతువులకూ పట్టుకుందా...!
posted on Jul 5, 2017 5:56PM

ఈ మధ్య మనుషులు, మనుషులతో మాట్లాడకంటే.. ఫోన్ లతో ఉండటం.. ఫోన్లతో మాట్లాడటమే ఎక్కువైపోయింది. ఈ పిచ్చి మనుషులతో పాటు ఇప్పుడు జంతువులకు కూడా ఎక్కిందా అనిపిస్తుంది అప్పుడప్పుడు అవి చేసే పనులను చూస్తుంటే. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని ఓ కోతి సెల్ఫీ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని జూకి రెబెక్కా అనే యువతి వెళ్లగా... అక్కడ కాపుచిన్ జాతికి చెందిన రొమాని అనే కోతిని రెబెక్కా ఫొటో తీయాలనుకుంది. కానీ ఇంతలో రొమాని ఫెన్సింగ్ వద్దకు వచ్చి రెబెక్కా ఫోన్‌లాక్కొని చక్కగా సెల్ఫీ దిగింది. ఇక ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని లూయిస్‌విల్లేలో ఉన్న కెంటకీ జూలో ఓ గొరిల్లా.. ఓ యువతితో కలిసి వీడియోలు చూస్తూ ఉంది. కెంటకీ జూలో విహారం కోసం వెళ్లిన లిండ్సే కోస్టేలో గొరిల్లా ఎన్‌క్లోజర్ ముందు దానికి వీడియోలు చూపిస్తూ దిగిన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇంతకీ వాళ్లు చూస్తున్న వీడియో ఏంటో తెలుసా? బేబి గొరిల్లాలు ముద్దుముద్దుగా చేసే అల్లరి పనుల వీడియో. మొత్తానికి మనుషుల్లా వాటికి కూడా స్మార్ట్ ఫోన్లు ఇస్తే అవి కూడా వీడియోలు చూస్తూ, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తాయేమో.