నెల్లూరు సిటీ బరిలో నటుడు అలీ!

ఔను నిజమే.. నటుడు అలీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఐదేళ్లుగా ఊరించి ఊరించి ఊసూరు మనిపించిన జగన్ ఈ సారి మాత్రం ఆయనకు పార్టీ టికెట్ కేటాయించి అసెంబ్లీ బరిలో  నిలబెడుతున్నారు. ఔను నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అలీని వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపడానికి జగన్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  
అయితే ఇప్పటికే ఆ స్థానాన్ని నగర డిప్యూటీ మేయర్ ఖలీల్‌కు కేటాయించడంతో తనకు చెప్పకుండా సీటు విషయంలో నిర్ణయం తీసుకున్నారంటూ.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. పార్టీతోపాటు జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. దాంతో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలీని బరిలో దింపాలని వైయస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం. 

మరోవైపు గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది స్థానాలకు పది స్థానాలు జగన్ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అయితే నేడు ఆ పరిస్థితి లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నెల్లూరు జిల్లా నుంచి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీ గెలుచుకుంటుందని నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో... అంటే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలపై  తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయానికి  సహకరించారన్న ఆరోపణలపై వేటు వేశారు.  ఆ ఒక్క ఘటనచాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి అని అంటున్నారు.

అలాంటి వేళ నెల్లూరు జిల్లాలో మళ్లీ మొత్తం ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకొనేందుకు జగన్  శతధా ప్రయత్నిస్తున్నారనీ,  ఆ క్రమంలో నే జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కూడా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే ప్రకటించిన మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని.. అందులోభాగంగానే నెల్లూరు సిటీ నుంచి ఇప్పటికే ప్రకటించిన ఖలీల్‌ను కాదని ఆలీని రంగంలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు. 


మరోవైపు జగన్ పార్టీలో ఆలీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సైతం ఇదే ఆలీ.. తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆ క్రమంలో త్వరలో మీకు గుడ్ న్యూస్ వస్తుందంటూ.. ప్యాలెస్‌లోని వర్గాలు స్పష్టం చేయడం.. దాంతో ఆలీకి రాజ్యసీటు ఒకే అయిదంటూ..  అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ప్రచారం కావడం తెలిసిందే. అయితే  అదేమీ జరగలేదు కానీ కంటితుడుపు అన్నట్లుగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించి అప్పట్లో చేతులు దులిపేసుకున్న జగన్ ఇప్పుడు గుంటూరు సిటీ  నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని అంటున్నారు. 


ఇంకోవైపు కర్నూలు ఎమ్మెల్యేగా ఆలీని బరిలో నిలిపే అవకాశాలు సైతం ఉన్నాయనే ఓ ప్రచారం సైతం కొన.. సాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే హపీజ్ ఖాన్‌ను మార్చాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించారని.. దాంతో ఆ స్థానాన్ని ఆలీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ఊహగానాలు ఉపందుకొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఎంపీగా ఆలీని ఎంపిక చేసే అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయని.. అది నంద్యాల లేదా గుంటూరు లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి ఆయన్ని బరిలో దింపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  

గతంలోనే ఆలీ ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ.. ఓ ప్రచారం అయితే గట్టిగానే జరిగిందని.. కానీ ఆ సమయంలో ఆయనకు ఎందుకో కానీ ఆ అవకాశం అయితే రాలేదని.. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం ఆయన పోటి చేయడం మాత్రం పక్కా అని.. ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసే టాలీవుడ్ నటీనటులు దాదాపుగా ఎవరు లేరని.. అలాంటి వేళ.. ఆలీకి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇవ్వడం ద్వారా ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకొనే అవకాశాలు మాత్రం చాలా అధికంగా ఉన్నాయనే ఓ చర్చ అయితే పార్టీలో హల్‌చల్ చేస్తోంది.