హస్తినలో గాలి విషం!
posted on Nov 18, 2024 9:22AM
దేశరాజధాని నగరం హస్తినలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రోజురోజుకూ ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ప్రజా క్షేమం కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరిన్ని ఆంక్షలు అమలు చేయడానికి నిర్ణయించింది. ఢిల్లీ – ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) 4 కింద మరిన్ని నిబంధనలను సోమవారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
*ఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశాన్ని నిలిపివేయనుంది. ఈ ఆదేశాలు సోమవారం (నవంబర్ 18) నుంచే అమలులోకి వచ్చాయి. అవికూడా ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ – 4 డీజిల్ ట్రక్కులను మాత్రమే అనుమతిస్తుంది. ఇంకా ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపైనా, ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతక న్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాలపైనా నిషేధం విధించింది. అంతే కాకుండా అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చే సింది. ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలు అన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని పేర్కొంది.
*రాష్ట్ర ప్రభుత్వ కళాశాలలను మూసివేయడంతో పాటు సరి బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ సిఫారసుపై ఒకటి రెండు రోజులలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.