ఆంధ్రా ‘అంకుశం’ ఏబివి రాజకీయ అరంగేట్రం

అమలాపురం వేదికగా ఆదివారం ప్రకటన

నీతి నిజాయితీలకు మారు పేరు, డిపార్ట్‌మెంట్‌లో అంకుశం అనిపించుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 13) అమలాపురం వేదికగా ఆయన తన రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయబోతున్నారన్న విషయం ఇటు రాజకీయవర్గాల్లో, అటు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

పోలీసు డిపార్టుమెంట్లో ఏబీవీ ఎదుర్కొన్నన్ని కక్ష సాధింపు చర్యలు ఎవరూ ఎదుర్కోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ సీఎం పీఠం ఎక్కగానే ఏబీవీని టార్గెట్ చేశారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏవీబీ అభియోగాలు, సస్పెన్షన్లతో ఇబ్బందిపడ్డారు. వెంకటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 8 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. మళ్లీ 2022 జూన్‌ 28 నుంచి 2024 మే 30 వరకు నాలుగేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్నారు.  తర్వాత ఆ కాలాన్ని కూటమి ప్రభుత్వం సర్వీస్ పీరియడ్‌గా క్రమబద్ధీకరించింది. ఏబీ వెంకటేశ్వరరావు నాలుగేళ్ల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులకు సంబంధించి బకాయిలు మొత్తం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌‌గా పని చేశారు. 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏబీవీని పోస్టింగ్‌ నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన ఏరోస్టాట్, యూఏవీ భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌పై ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. తాను ఎలాంటి అక్రమాలు చేయలేదని కోర్టుకు వివరించారు. 2022లో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు ఆదేశించగా.. ఆయన్ను ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా నియమించారు.

మళ్లీ 2022 జూన్‌ 28న రెండోసారి కూడా సస్పెండ్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ వెంటనే ఆయన తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ క్యాట్‌ను ఆశ్రయించగా.. అక్కడ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన పదవీ విరమణకు ముందు రోజు జగన్‌ ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్ కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. కొన్ని గంటలోనే ఆయన రిటైర్ అయ్యారు. 

గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేల్చింది. ఆయనపై ఆరోపణలు వచ్చినట్లుగా.. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత పరికరాల కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని గుర్తించారు. ఆ మేరకు ఆయనపై అభియోగాలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తర్వాత ఆయన సస్పెన్షన్‌ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆ క్రమంలో ఏపీ సర్కారు అధికారంలోకి రాగానే రిటైర్ట్ ఐపీస్ ఏబీవీని ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించింది. అయితే గత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రగిలిపోతున్న ఏవీబీ ఇంతవరకు ఆ బాధ్యతలు స్వీకరించలేదు. వైసీపీ అక్రమాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్ విభాగాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఆయన అభిమానులుభావించారు. రిటైర్ అయ్యాక ఆయన జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. జగన్ కరోనాని ‘కమ్మ’రోనా అంటూ అన్నిటికీ కులాలను ఆపాదించారని ఆరోపణలు గుప్పించారు. సీఎం కూర్చీ కోడుకి కూడా సరితూగని  తుచ్ఛుడు ఆ సీటులో కూర్చున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జగన్ ప్రభుత్వ హాయాంలో సర్వీసు పరంగా విపరీతమైన వేధింపులు, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ఏబీవీ తన రాజకీయ ప్రస్థానంలో జగన్ భాధితులను పరామర్శించడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. అమలాపురం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ఆయన అక్కడ జగన్ కారణంగా తీవ్ర వేధింపులకు గురై దీర్ఘకాలం జైలు జీవితం అనుభవించిన కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. క‌ృష్ణాజిల్లా నూజివీడుకి చెందిన ఈ కమ్మ సామాజిక వర్గం సీనియర్ కులం కారణంగానే జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురయ్యారు. 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన పొలిటీషియన్ అవతారమెత్తితే తన సీనియార్టీతో ఇక జగన్‌కు చుక్కలు చూపించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.