కింగ్ ఈజ్ బ్యాక్‌.. 4 రోజుల హైడ్రామా.. మీసం తిప్పిన ర‌ఘురామ‌..

శుక్ర‌వారం.. సాయంత్రం.. హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ కృష్ణ‌రాజు నివాసం.. ఉన్న‌ట్టుండి ప‌దుల సంఖ్య‌లో ఏపీ సీఐడీ పోలీసులు ఎంపీని చుట్టుముట్టారు.. సీఆర్పీఎఫ్ ర‌క్ష‌ణ‌లో ఉన్న ర‌ఘురామ‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు.. ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు..

ఒక్కసారిగా షాక్‌.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ న్యూస్‌.. మీడియా మొత్తం హోరెత్తింది.. జ‌న‌మంతా ఉలిక్కిప‌డ్డారు.. ర‌ఘురామ కృష్ణ‌రాజు అరెస్ట్ వార్త.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ ద‌ద్ద‌రిల్లిపోయింది.. 

క‌ట్ చేస్తే.. సోమ‌వారం సాయంత్రం.. కారు ఎక్కుతూ.. చేతులు ఊపుతూ.. విజ‌య‌గ‌ర్వంతో క‌నిపించారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కారులో కూర్చొని మీసం మెలేస్తూ.. తాను మొన‌గాడిన‌నే మెసేజ్ ఇచ్చారు..

 

ఈ నాలుగు రోజులు తెలుగునాట‌ మునుపెన్న‌డూ చూడ‌ని హైడ్రామా న‌డిచింది.. హైకోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు, సుప్రీంకోర్టు.. ఇలా న్యాయ‌వ్య‌వ‌స్థ త‌లుపుల‌న్నీ త‌ట్టారు ర‌ఘురామ‌.. న్యాయం కోసం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాడారు.. బ‌ల‌మైన రాజ్యాన్ని ఎదుర్కోవ‌డానికి త‌న శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు.. అందులో ప్ర‌స్తుతానికి పాక్షిక విజ‌యం సాధించారు.. త్వ‌ర‌లోనే పూర్తి గెలుపు త‌న‌దేన‌నే ధీమా ఆయ‌నలో క‌నిపిస్తోంది.. 

ఇప్ప‌టికైతే బెయిల్ రాలేదు కానీ.. తాను కోరుకున్న‌ట్టే ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందే అవ‌కాశాన్ని సాధించారు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు.. గుంటూరు జైలు నుంచి.. వై కేట‌గిరి సీఆర్‌పీఎఫ్ ర‌క్ష‌ణ‌లో.. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌లో చేరారు.. త‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం పొంచి ఉన్న రాష్ట్రం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.. ఏ రాజ్య‌మైతే త‌న‌పై కేసులు క‌ట్టి.. జైలు పాలు చేసిందో.. ఆ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సుర‌క్షితంగా ఏపీ స‌రిహ‌ద్దులు దాటారు.. ద‌టీజ్ ర‌ఘురామ కృష్ణ‌రాజు అనిపించుకున్నారు...

ఈ నాలుగు రోజులు.. ర‌ఘురామ‌కు నాలుగు యుగాలుగా గ‌డిచాయి.. దేశ‌ద్రోహం కేసు పెట్టి.. పుట్టిన రోజు నాడే ఆయ‌న్ను అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ. శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ర‌ఘురామ‌ నివాసంలో అదుపులోకి తీసుకొని.. నేరుగా గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి తీసుకొచ్చారు. రాత్రంతా అక్క‌డే ఉంచి గుచ్చిగుచ్చి ప్ర‌శ్నించారు. 

తెల్లారేస‌రికి సీన్ మ‌రింత సితార్ అయింది. శ‌నివారం ర‌ఘురామ అరెస్ట్ ఎపిసోడ్ మ‌రింత కాక రేపింది. త‌న అరెస్ట్ అక్ర‌మ‌మంటూ.. బెయిల్ కోసం శ‌నివారం ఉద‌యం మొద‌ట ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. కింది కోర్టుకు వెళ్ల‌మంటూ హైకోర్టు సూచించ‌డంతో.. మేట‌ర్ మెజిస్ట్రేట్ కోర్టుకు చేరింది. అక్క‌డ‌.. అస‌లు దారుణం వెలుగులోకి వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి.. సీఐడీ ఆఫీసులో త‌న‌ను తీవ్రంగా కొట్టారంటూ ర‌ఘురామ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఐదుగురు వ్య‌క్తులు ముఖానికి క‌ర్చీఫ్‌లు ధ‌రించి.. త‌న కాళ్ల‌పై విప‌రీతంగా కొట్టారంటూ.. గాయాల‌ను జ‌డ్జికి చూపించారు. ఆ ఫోటోలూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి అంతా షాక్‌...

ర‌ఘురామ పాదాలకు తీవ్ర గాయాలు స్ప‌ష్టంగా క‌నిపించాయి. కాళ్లు వాచి ఉన్నాయి. గాయాలు చూసి.. మెజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. వెంట‌నే మెడిక‌ల్ బోర్డు ఏర్పాటు చేసి.. ర‌ఘురామ గాయాల‌ను ప‌రిశీలించాల‌ని ఆదేశించారు. తొలుత జీజీహెచ్ ఆసుప‌త్రిలో, ఆ త‌ర్వాత ర‌మేశ్ హాస్పిట‌ల్‌లో ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చారు. శ‌నివారం రాత్రంతా జీజీహెచ్‌లోనే ర‌ఘురామ‌ను ప‌రీక్షించారు వైద్యులు.. 

కోర్టు ఒక‌లా ఆదేశిస్తే.. పోలీసులు మ‌రోలా వ్య‌వ‌హ‌రించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం జీజీహెచ్ నుంచి ర‌మేశ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌కుండానే.. నేరుగా గుంటూరు జైలుకు త‌ర‌లించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి..

త‌న భ‌ర్త‌ను జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ర‌ఘురామ స‌తీమ‌ణి ర‌మాదేవి ఆరోపించ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. 

ఆదివారం హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు ర‌ఘురామ త‌ర‌ఫు లాయ‌ర్లు.. కోర్టు సైతం త‌మ ఆదేశాల‌ను ఎందుకు దిక్క‌రించారంటూ సీరియ‌స్‌గా స్పందించింది.. మ‌రోవైపు, ర‌ఘురామ మెడిక‌ల్ రిపోర్ట్ సైతం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న కాళ్లు రంగు మారాయి.. వాచి ఉన్నాయి.. కానీ, అవి కొట్ట‌డం వ‌ల్ల అయిన గాయాలు కావంటూ వైద్యులు నివేదిక ఇవ్వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

ఇక, సోమ‌వారం.. ర‌ఘురామ ఎపిసోడ్ సుప్రీం కోర్టుకు చేరింది. ఉద‌యం నుంచి ఒక‌టే ఉత్కంఠ‌. బెయిల్ పిటిష‌న్ వ‌చ్చే శుక్ర‌వారానికి వాయిదా ప‌డినా.. ర‌ఘురామ‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లు చేసే అంశంలో మాత్రం సుప్రీం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ర‌మేశ్ హాస్పిట‌ల్ అంటూ ర‌ఘురామ లాయ‌ర్లు వాదించారు. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్ చాలంటూ ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు చెప్పారు. చివ‌రాఖ‌రులో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌ను ఫిక్స్ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్త‌ర్యులు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు న్యాయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. మెడిక‌ల్ బోర్డు రిపోర్టును షీల్డ్ క‌వ‌ర్‌లో ఇవ్వాలంటూ ఆదేశించి ఏపీ స‌ర్కారుకు షాక్ ఇచ్చింది... 

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చే వ‌ర‌కూ ఆయ‌న అక్క‌డే ఉంటారు. ఏ పోలీసులైతే ర‌ఘురామ‌ను అరెస్ట్ చేసి.. కారులో కుక్కి.. హైద‌రాబాద్ నుంచి గుంటూరుకు తీసుకెళ్లారో... అదే ఏపీ పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి.. ర‌ఘురామ‌ను కారులో గౌర‌వంగా.. గుంటూరు నుంచి మ‌ళ్లీ హైద‌రాబాద్‌కు తీసుకు రావ‌డం టోట‌ల్ ఎపిసోడ్‌లోకే హైలైట్ సీన్‌...

ఇలా.. హైద‌రాబాద్‌లో మొద‌లైన ర‌ఘురామ అరెస్ట్ ఉదంతం.. ప్ర‌స్తుతానికి మ‌ళ్లీ హైద‌రాబాద్‌కే చేరింది.. ఈ గ్యాప్‌లో నాలుగు రోజుల పాటు.. ఫుల్ హైడ్రామాతో.. క్రైమ్ క‌థా చిత్ర‌మ్ న‌డిచింది.. ప్ర‌స్తుతం ఇంట‌ర్వెల్ సీన్ న‌డుస్తోంది.. ఇప్ప‌టికైతే ర‌ఘురామ కృష్ణ‌రాజే హీరోగా క‌నిపిస్తున్నారు.. విల‌న్ ఎవ‌రో త్వ‌ర‌లోనే తేలనుంది.. క్లైమాక్స్‌లోనూ అదిరిపోయే ట్విస్టులు ఉంటాయా? ర‌ఘురామా బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌స్తారా?  లేక‌, జైలుకే ప‌రిమితం అవుతారా?  లెట్స్ సీ...