రోడ్లపై రేసింగ్‌లు చేస్తే చిప్పకూడే..!!

రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడితే ఇక నుంచి జైలు శిక్ష తప్పదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. సైబరాబాద్‌లో జరుగుతున్న రేసింగ్, బెట్టింగ్‌లపై కమిషనర్ స్పందిస్తూ రేసింగ్‌ల వల్ల యువకులతో పాటు ఇతర వాహనదారులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కొందరు యువకులు ద్విచక్రవాహనాలతో రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడడమే కాకుండా పోకిరీ చేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, నార్సింగిలో 80మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ వివరించారు. ప్రస్తుతానికి యువకుల తల్లిదండ్రుల పూచీకత్తుపై వారిని వదిలిపెడుతున్నట్లు సీపీ తెలిపారు. ఇక నుంచి రేసింగ్‌లకు పాల్పడే యువకులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.