మహాత్మాగాంధీ జాతిపిత కాదు: అరుంధతీ రాయ్

 

కాంట్రవర్సరీకి కేరాఫ్ అడ్రస్ అయిన అరుంధతీరాయ్ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ఈసారి వీళ్ళనీ వాళ్ళనీ కాకుండా ఏకంగా జాతిపిత మహాత్మాగాంధీనే టార్గెట్ చేసింది. మహాత్మాగాంధీ అసలు జాతిపితే కాదని, ఆయన కులతత్వం ప్రదర్శించారని అరుంధతీరాయ్ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కులతత్వాన్ని ప్రదర్శించిన గాంధీ జాతిపిత హోదాకి అనర్హుడని, ఆ హోదాకు మరొకరిని ఎంచుకోవాలని ఆమె అన్నారు. గాంధీ పేరుతో వున్న యూనివర్సిటీలకు, సంస్థలకు పేర్లు అర్జెంటుగా మార్చేయాలని డిమాండ్ చేశారు. కేరళ యూనివర్సిటీలో ప్రసంగించడానికి వెళ్ళిన అరుంధతీరాయ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీజీ 1936లో రచించిన 'ద ఐడియల్ భంగీ' వ్యాసంలో ఆయన మలమూత్రాదులను పారవేయకుండా, ఎరువుగా మార్చుకోవాలని పాకీ పనివారికి సూచించారని అరుంధతి అన్నారు. గాంధీకి హరిజనులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు.