రేపే పీఎస్‌ఎల్‌వీ సీ61 ప్రయోగం...ఇస్రో 101వ ప్రయోగానికి సర్వం సిద్ధం
posted on May 17, 2025 3:21PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో శ్రీహరికోట నుంచి ఇప్పటివరకు 100 రాకెట్లను ప్రయోగించింది. 101వ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. విజయం పరంపరంలో కొనసాగుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం అయ్యేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట -షార్ నుంచి ఈనెల 18వ తేదీ ఉదయం 5.59 నిమిషాలకు పి ఎస్ ఎల్ వి సి61 రాకెట్ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లను ఇస్రో సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి...1696.24 కేజీల బరువు కలిగిన ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ 44.5 మీటర్ల పొడవు 321 టన్నుల బరువు కలిగి ఉంటుంది. పిఎస్ఎల్వి సి 61 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం 7.59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానున్నది.
కౌంట్ డౌన్ ప్రక్రియ 22 గంటలు కొనసాగిన అనంతరం ఆదివారం ఉదయం 5.59 నిమిషాలకు రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో నిర్ణయించింది. భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రవేశపెట్టి భారత భూభాగం పైన నిశితంగా పరిశీలించే నిఘా ఉపగ్రహముగా పనిచేయునున్నది. భారత దేశ భూభాగాన్ని మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా నిగా పెట్టడమే ఈవో ఎస్ -09 సాటిలైట్ ముఖ్య ఉద్దేశం. గతంలో దేశ రక్షణ కోసం ప్రయోగించిన ప్రయోగాల కన్నా.. ఈవో ఎస్ -09 ఉపగ్రహాన్ని కొత్త సాంకేతికంగా శాస్త్రవేత్తలు రూపుదిద్దారు. భారత్- పాక్ సరిహద్దుల వద్ద ఉద్రుక్తత పరిస్థితులు నెలకొనడంతో... శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పిఎస్ఎల్వి సి 61 రాకెట్ ప్రయోగానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణ శ్రీహరికోటకు చేరుకొని.. ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.