చంద్రబాబు టార్చర్.. భువనేశ్వరికి అధికారుల మొర....

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని రాక్షసుడు అని అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోక ముందు సంగతేమో కానీ.. రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం.. రాష్ట్రాభివృద్ది కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. టెలీకాన్పరెన్స్ లు, పలు కార్యక్రమాల్లో పాల్గొనడాలు, సమీక్షలు, పరిశ్రమలు రప్పిండానికి విదేశీ పర్యటనలు.. వాళ్లతో సమావేశాలు ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగారు కష్టపడటమే కాదు.. ఆయనతో పాటు అధికారులను కూడా ఉరుకులు పెట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. రివ్యూలంటూ వారిని రాత్రి 11 గంటలైనా వదిలిపెట్టడం లేదు. దీంతో అధికారులు కక్కలేక మింగలేక అన్నసామెత ప్రకారం.. చంద్రబాబుతో చెప్పలేక.. ఇటు ఏం చేయలో తెలియక.. పులుసు కారిపోతుంది.

 

అయితే ఈ విషయాన్ని ఎలాగూ చంద్రబాబు దగ్గర చెప్పే ధైర్యం అధికారులకు లేదు... అందుకే ఆయన సతీమణి భువనేశ్వరి దగ్గర మొర పెట్టుకున్నారట. డిసెంబర్ 31న ఐఏఎస్ లతో, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఆయన భార్య, నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొంతమంది అధికారులు....ఆమె దగ్గరకు వచ్చి... మీరు ప్రతి శనివారం అమరావతికి రావాలని అడిగారట.  హెరిటేజ్ ఛైర్మన్ గా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె, ప్రతి ఆదివారం మాత్రమే చంద్రబాబు వద్దకు వస్తారు. అయితే ఇప్పుడు శనివారం కూడా అమరావతికి రావాలని విజ్ఞప్తి చేశారట. మేడమ్ నిత్యమూ సమీక్షలు, సమావేశాలు అని సీఎం చాలా బిజీగా ఉంటున్నారు. మీరేమో ఆదివారం మాత్రమే వస్తున్నారు. ఆ ఒక్కరోజే ఆయనకు కాస్తంత విశ్రాంతి దొరుకుతోంది. మీరు శనివారమే అమరావతికి వస్తే, ఆయనకు కొంత ఉపశమనం ఉంటుంది. మీరు అలా చేస్తే, మేము కనీసం రెండు రోజులైనా సమయానికి ఇంట్లో కుటుంబంతో కలసి డిన్నర్ చేయగలుగుతాం" అని వేడుకున్నారట.  24గంటలూ పనిచేసినా ఆయన హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం ఎలాగూ విశ్రాంతి కదా... అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి శనివారం రాత్రి పొద్దుపోయే వరకు సమావేశాలు పెట్టేస్తున్నారు.  మీరు శనివారం కూడా వస్తే మాకు కొంత ఉపశమనంగా ఉంటుందని అన్నారట. అయితే ఇదంతా జరిగింది సీరియస్ గా కాదులెండి.. అధికారులు.. సరదాగా.. భువనేశ్వరి దగ్గర జోక్ చేస్తూనే.. తమ బాధను వెల్లడించారట.

 

మరి భువనేశ్వరి గారు ఈ విషయాన్ని బాబుగారికి చెబుతారో లేదో.. అధికారులు కోరినట్టు శనివారం కూడా ఆమె వస్తారో లేదో.. చూద్దాం. అసలు ఆదివారం కూడా వేస్ట్ అయిపోతుంది అని బాధపడుతూ ఉండే బాబు, శనివారం వదులుతారా.. మేడం మాట వింటారా..? చూద్దాం..