శాసనసభకు అందుకే వస్తున్నారు..అందుకే బహిష్కరిస్తున్నరేమో?
posted on Dec 22, 2015 3:06PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగియబోతున్నాయి. అనేక ప్రజా సమస్యలపై చర్చించవలసి ఉన్నప్పుడు కేవలం ఐదు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించడాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా తప్పు పట్టింది. కానీ కనీసం ఆ ఐదు రోజులు కూడా సభకు హాజరుకాలేకపోయింది. శాసనసభలో ఆరు ముఖ్యమయిన బిల్లులపై చర్చించాల్సి ఉందని తెలిసి ఉన్నప్పటికీ, వైకాపా ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి నిరాకరించినందుకు, కాల్ మనీపై చర్చకు స్పీకర్ అనుమతించనందుకు నిరసనగా సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. ఆయనతో బాటే వైకాపా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు.
ప్రజా సమస్యలపై సభలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టిన వ్యక్తి ఆ అవకాశం ఉన్నా కూడా సభను బహిష్కరించి వెళ్ళిపోవడంతో ఆయనకు వాటిపై చర్చించే ఆసక్తి లేదని, కేవలం తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి అవకాశం ఉన్నంతవరకే ఆయన సభలో ఉంటారని స్వయంగా చాటుకొన్నట్లయింది. అంతే కాదు సభలో తెదేపా అమలుచేసిన వ్యూహానికి ప్రతివ్యూహం అమలుచేయడంలో విఫలమయ్యినట్లు స్వయంగా అంగీకరించినట్లయింది. శాసనసభ సమావేశాలు జరిగిన ప్రతీసారి జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు ఇదే విధానం అవలంభిస్తున్నారు. సభలో ముఖ్యమంత్రిని విమర్శించడం పూర్తవగానే ప్రభుత్వం గురించి తను చెప్పదలచుకొన్నదేదో నాలుగు ముక్కలు చెప్పేసి, ఏదో ఒక సాకుతో సభను బహిష్కరించి బయటకి వెళ్లిపోవడం ఆనవాయితీగా పాటిస్తున్నట్లున్నారు.
ఆయనకు సభలో ఉండే ఆసక్తి, ఓపిక లేకపోతే కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలనయినా సభలో ఉండనిచ్చి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ బిల్లులపై జరిగే చర్చలో పాల్గొనేందుకు అనుమతించి ఉంటే బాగుండేది. కానీ వైకాపా తరపున సభలో మాట్లాడితే తను ఒక్కడు మాత్రమే మాట్లాడాలి మరెవరూ మాట్లాడకూడదనే ధోరణి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది. అది మంచి పద్ధతి కాదు. ఆయన ఒక్కడి కోసం మిగిలిన వైకాపా సభ్యులు అందరూ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా సభను బహిష్కరించి బయటకి రావలసి వస్తోంది. దాని వలన వారికీ తమ నాయకుడు వైఖరి పట్ల అసంతృప్తి కలగవచ్చును. జగన్ అనుసరిస్తున్న ఈ వైఖరి వలన అంతిమంగా నష్టపోయేది వైకాపాయే తప్ప తెదేపా కాదని గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.