"కుక్కలు చింపిన విస్తరి'లో కాంగ్రెస్


- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

ABK Prasad, ABK Prasad biography, ABK Prasad profile,ABK Prasad jounalist, ABK Prasad Political Articles, ABK Prasad Exclusive Notes

 

 

"కుక్కలూ కుక్కలూ కొట్లాడుకుని, కూట్లో దుమ్ముపోసుకున్నాయ''ని మన పెద్దవాళ్ళు ఎందరి జీవితాలనో, లేదా ఎన్ని కుటుంబాల, రాజకీయపక్షాల నాయకుల ప్రవర్తన కాచివడపోసిన తరువాత అల్లుకున్న సామెత ఇది! అందుకే "కూట్లో దుమ్ముపోసుకున్న'' పరిణామాన్నే వారు "కుక్కలు చింపిన విస్తరి''గా నామకరణం చేసుకున్నారు! అలాంటి పరిణామం ఇప్పుడు 150 ఏళ్ళ చరిత్రగల జాతీయ కాంగ్రెస్ ను కేంద్రం స్థాయిలోనూ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనూ ఎదుర్కొంటోంది! తెలుగుజాతిని చీల్చే విద్రోహపథకానికి "బొబ్బిలి దొర'' (కేరాఫ్ విజయనగరం-శ్రీకాకుళం) కె.చంద్రశేఖరరావు "తెలంగాణా రాష్ట్ర సమితి'' పేరిట, కాంగ్రెస్ లో పాతపుణ్యం తాలూకు తనకు సరైన స్థానం దొరక్క పదవీనిరుద్యోగంతో తీసుకుంటున్న కె.కేశవరావు [మచిలీపట్నం కనెక్షన్] కొత్తగా టి.ఆర్.ఎస్. తీర్థం పుచ్చుకుని "తెలంగాణా'' పేరిటా ఆడుతున్న నాటకాన్ని కేంద్రకాంగ్రెస్ అధిష్ఠానం కనిపెడుతూ ఉంది; కేశవరావుతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ఎం.పి.లు గా ఉన్న వివేక, మందా జగన్నాథం 2014 ఎన్నికల్లో తిరిగి తామూ, తమ కుటుంబసభ్యులూ అటు పార్లమెంటులోనూ, ఇటు రాష్ట్ర శాసనసభలోనూ సీట్లు "టి.ఆర్.ఎస్.''లో చేరితేనే దక్కుతాయేమోనన్న భ్రమతో ఉన్నారు.



అయితే కె.సి.ఆర్. పన్నిన రాజకీయ పన్నుగడలో [తెలుగుజాతిని చీల్చడం కోసం బూతులను, విషప్రచారాన్ని ఆశ్రయించిన కెసిఆర్ వలలో] వీళ్ళు ఇరుక్కుపోయి, వారూ తెలుగువారే అయిన తోటి రెండుప్రాంతాల (కోస్తా, రాయలసీమ) ఆంధ్రులపైన ప్రచార దాడిలో ముమ్మరంగా పాల్గొనడంతో వీరిపైన వేటు వేయడానికి అధిష్ఠానం సిద్ధం కావలసి వచ్చింది. ఇంతకూ వీళ్ళు ప్రధాన ప్రతిపాదన ఏవిటి? తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతినిపోయే పరిస్థితులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అవతరణతోనూ, "తెలుగుదేశం'' పార్టీకి తెలంగాణలో ఇంకా బలంగానే ఉన్నందున - తెలంగాణా వేర్పాటు సమస్యను కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చిచెప్పనందున, తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటుంది; కాబట్టి ఈ ప్రాంతీయ కాంగ్రెస్ ను దక్కించుకోవాలంటే కాంగ్రెస్ కూడా మిగతా చిల్లరపార్టీల మాదిరిగా "తెలంగాణా ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదు, సిద్ధమే''నన్న ఓ మబ్బుతెరను కాంగ్రెస్ పార్టీ తగిలించుకోవాలని భావించారు.


అయితే ఈలోగా విదూషక పాత్రను శ్రద్ధగా పోషిస్తున్న "బొబ్బిలిదొర'' ఏం చేశాడు. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఢిల్లీలో నెలరోజుల మకాంలో మంతనాలు నడిపి తెలంగాణారాష్ట్రానికి తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను విలీనం చేయడానికి సిద్ధమని లాలూచీ బేరం సాగించి వచ్చాడని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ ను బతికించుకోవాలంటే, "బొబ్బిలి'' పైరవీకారుణ్ణి "బుట్టలో'' వేసుకోగలిగితే, కాంగ్రెస్ ను తెలంగాణలో గెలిపించి, తానూ లబ్ధిపొందవచ్చునని టి.ఆర్.ఎస్. నాయకుడి తాపత్రయం!

 


అయితే ఈ పైరవీ రాజకీయం ఫలిస్తుందన్న ఆశ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేదు. అయినా, కాంగ్రెస్ నుంచి వలసల్ని తప్పించడంకోసం తాజాగా అధిష్ఠానం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు కన్పిస్తోంది. కాంగ్రెస్ సంస్థను వీడిపోయి తెలంగాణాలోని ఒక "టుమ్రీ'' పార్టీలోకి ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఉడాయించినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టంలేదని అధిష్ఠానం స్పష్టం చేయడంతో టి.ఆర్.ఎస్.లోకి వలసలకు "బ్రేక్'' పడిపోయినట్టే. పైగా కెసిఆర్ తో జరిగే "బేరసారాల''లో గుట్టు అధిష్ఠానానికి ఎలాగూ తెలిసి ఉన్నందున, కెసిఆర్ ను ఏ పద్ధతుల్లో లొంగదీసుకోవాలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పటికే ఒక అవగాహన ఉన్నందుననే - ఇంతకుముందు తెలంగాణా కాంగ్రెస్ నుంచి సుమారు ఏ 15-20మంది నాయకులో కెసిఆర్ వైపు దూకుతారని భావించినప్పటికీ చివరికి టి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకుల సంఖ్య ముగ్గురు, నలుగురితో ముగిసిపోయింది.

 


తాజాగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలూ చూసే కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ప్రతినిధి ఆజాద్ సహితం "కెసిఆర్ పైరవీల'' గురించి, అతనితో అటువైపునకు దూకిన పార్టీ విభీషణాదుల గురించి బట్టబయలు చేస్తూ బహిరంగ ప్రకటన చేయడంతో కెసిఆర్ సహా అతని పార్టీలోకి దూకిన కాంగ్రెస్ అవకాశవాదనాయకులు కలగుండు పడిపోతున్నారు. తెలంగాణా సమస్య తెలుగువారి భవితవ్యానికి సంబంధించిన సమస్య కాబట్టి, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని మిగతా ప్రాంతాలవారి అభిప్రాయాలతో కూడా ముడిపడిన సమస్య కాబట్టి, వెంటనే తేల్చి చెప్పగల అంశం కాదని ఆజాద్ ప్రభృతులు కాంగ్రెస్ అధిష్ఠానం తరపున స్పష్టం చేశారు.


జాతీయ సమైక్యత, దేశ సమగ్రత దృష్ట్యా గతంలో (1969లో 1972లో) నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి నాటి పైరవీకారుల "తెలంగాణా సమస్య''పై ఏమీ తేల్చిచెప్పిందో అవగాహన ఉన్న ప్రస్తుతపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టు స్పష్టమైన సమాచారం. కాగా ఈలోగా రాష్ట్ర కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి వై.యస్. మరణానంతరం తలెత్తిన సమస్యలు, పార్టీలో వచ్చిన చీలికలూ రాష్ట్ర కాంగ్రెస్ ను చిన్నా భిన్నం చేయడంతో ఆ పార్టీ పునరుజ్జీవనం పెద్ద సమస్యగా మారి, నాయకులు తలో దారిపట్టే స్థితి ఏర్పడింది.




150 సంవత్సరాల చరిత్ర అయితే ఆ పార్టీకి ఉందిగాని, అత్యంత క్రమశిక్షణారాహిత్యానికి 'పెద్దబిడ్డ'గా కాంగ్రెస్ తయారయింది. అదేమంటే, కాంగ్రెస్ "ప్రజాస్వామిక సంస్థ'' కాబట్టి భిన్నాభిప్రాయాలుంటాయని నాయకత్వం అనేకసార్లు సమర్ధించుకోడానికి ప్రయత్నించింది. సమస్యలపై చర్చలు, తద్వారా సమిష్టిగా నిర్ణయాలకు రావడాన్ని ప్రజాస్వామ్య సంప్రదాయంగా భావించకుండా బజారుకెక్కి కొట్లాటలు, కుమ్ములాటలు, ఏర్పడడం తిట్టిపోతలు, చీలికలనే "ప్రజాస్వామ్యం''గా కాంగ్రెస్ చలామణీ చేసుకుంటూ వచ్చింది. దాని ఫలితమే ఎవడూ క్రమశిక్షణకు బద్ధమై పార్టీ సమైక్యతావాణికి దోహదం చేయడంలేదు. కనుకనే, కాంగ్రెస్ రాజకీయాల్లో వంశపారంపర్యంగా నాయకులు తమ కుటుంబీకులనే తమకు వారసులుగా సిగ్గువిడిచి ప్రకటించుకుంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇది పైనుంచి కిందిస్థాయి దాకా పాకిపోయి ఘనీభవిస్తున్న సంస్కృతి!



ఒకనాడు కాంగ్రెస్ నిర్మాణంలో అగ్రనాయకులలో ఒకరైన తోలిప్రదానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ ఛోటా మోటా నాయకులకు హెచ్చరికగా యిలా సలహా యిచ్చారు : "కాంగ్రెస్ ను వీడిపోవడమంటే జాతీయతా స్రవంతినుంచి తనకుతాను దూరమైపోవటమేనని నా అభిప్రాయం; దేశ రాజకీయాలను మలచగల ఆయుధం జాతీయ కాంగ్రెస్. అలాంటి ఆయుధాన్ని తుప్పుపట్టించడమే అవుతుంది, పార్టీనుంచి విడిపోతే'' అంతేగాదు, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే "సోషలిస్టు సమాజం నిర్మాణమావుతుందన్న'' ఆశ పెట్టుకున్న నెహ్రూ తనకు తానై ఒక ప్రశ్న కూడా ఆనాడే వేసుకున్నారు :


 

"ఎన్నటికైనా కాంగ్రెస్ మౌలిక మార్పులకు దోహదం చేయగల అభిప్రాయకర సామాజిక పరిష్కారాన్ని  దేశప్రజలకు ఇవ్వగల్గుతుందా కాంగ్రెస్?'' అని! అంతేగాదు, భావిభారతదేశంలో ఒకవేళ "సోషలిజం ఆవిష్కరించుకునే పక్షంలో, మానవ జీవితం గురించి, జీవిత సమస్యల గురించి ఆలోచించగల దృక్కోణంలో కాంగ్రెస్ వారిలో అవసరమైన మార్పు రాగల్గుతుంది'' అని కూడా నెహ్రూ ఆశించారు. ఎందుకని అలా ఆశించారు? ఆయన మాటల్లోనే చెప్పాలంటే "ఇప్పటిదాకా కాంగ్రెస్ వారి దృష్టిఅంతా వంశపారంపర్య ధోరణులపైన, గతానుగతికంగా వస్తున్నా అజ్ఞాత పలుకుబడులపైన, అలాంటి వాతావరణంపైన ఆధారపడుతూ వచ్చింది. జీవితం నేర్పే చేదునిజాలే కాంగ్రెస్ వారిలో నూతన దృష్టికి నాంది పలకగలగాలి'' అన్నారు! కాని పాతవరవడి నుంచి కాంగ్రెస్ వారిలో చాలామంది విముక్తి పొందినట్లు కన్పించదు. కనుకనే ఎవరికివారే యమునాతీరేగా ఈ రోజుకీ వ్యవహరిచటం!