Previous Page Next Page 
విషవలయం పేజి 3

    సత్యమూర్తికి జాలేసింది. కాని ఏమని సానునయ వాక్యాలు పలకాలో తెలీలేదు కాని అతని నుంచి నిట్టూర్పు వెలువడింది.

    "ఇది అద్దెయిల్లు యాభయిరూపాయలు యిస్తున్నాం. అప్పటికీ కరంటు లేదు. మీ రెక్కడ వుంటున్నారు?"
    సత్యమూర్తి చెప్పాడు.

    తర్వాత వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఓ అరగంట దొర్లించారు. కాని వర్షము తగ్గే సూచనలు మాత్రము ఏమీ కానరావటము లేదు. అతనికి మనసులో అస్థిమితంగా, యాతనగా వుంది. పాపం ఆ అమ్మాయి లోపలే కూర్చుండిపోయింది- తను వున్నాడని. అక్కడా కూడా బుల్లిదీపం కూడా వెలుగుతోన్నట్లుంది. అక్కడ అలా ఎంతసేపు జపంచేస్తూ కూర్చుంటుంధో!

    "కిటికీ తెరిచి తెరిపి యిచ్చిందేమో చూద్దామా?" అన్నాడు సత్యమూర్తి.

    "అబ్బే. అలాంటి లక్షణా లేమీ లేవు. ఆ చప్పుడు తేలియటల్లేదూ? పాపం మీకు భోజనానికి ఆలస్య మవుతుందేమో!"

    "ఆలస్యమే లేదు. నావల్ల మీకే యిబ్బంది. అయినా యివాళ భోజన సమాచారము ఏమీ లేదులెండి. శనివారం కదూ!"

    ప్రసాదరావు ఏదో ఆసరా దొరికినట్లు "అయితే ఇంకేం? మాకు శనివారమే. మీకా పట్టింపు లేదేమోనని యిందాకటినుంచీ సంకోచిస్తున్నాను" ఆ, "ఉషా! ఫలహారం తయారయిందా?" అని కేకేశాడు.

    "అయిందన్నయ్యా" అని లోపలినుండి ఆ అమ్మాయి కంఠం వినవచ్చింది.

    "అబ్బే, అలాంటి దేమీ పెట్టబోకండి, ప్లీజ్" అంటూ సత్యమూర్తి వారిస్తూనే వున్నాడు ప్రసాదరావు వినిపించుకోకుండా "రెండు ప్లేట్లలో యిద్దరికీ తీసుకురామ్మా" అని కేకేశాడు.

    సత్యమూర్తి గుండె గబగబ కొట్టుకుంది. వళ్ళంతా ఏదోగా అయినట్లయింది. ఇలాంటి పరిస్థితి అతను ఊహించనూ లేదు, ఎదుర్కోను లేదు.

    "మీరు చాలాయిబ్బంది...నాకు" అంటూ ఏదో అంటూనే వున్నాడు ప్రసాదరావు ఏమీ వినిపించుకున్నాడో...! ఆ అమ్మాయి నెమ్మదిగా ఫలహారాల పళ్ళేలతో వచ్చేసింది. బల్లమీద అతనికి దగ్గరగా ఒక పళ్ళెం పెట్టి, రెండోది తన అన్న చేతికిచ్చింది.

    "మా చెల్లెలండీ, పేరు ఉష."

    ఆమె వినయపూర్వకంగా నమస్కారం చేసింది.

    అతను తడబడుతూ ప్రతి నమస్కారముచేసి నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు.

    "తీసుకోండి" అన్నాడు ప్రసాదరావు.

    అతని చేయి యాంత్రికంగా వెళ్ళి చపాతీని ఏదో తుంచుతోంది. గాని, సిగ్గుతో చచ్చిన చావుగా వుంది. ఉష అతని పరిస్థితి గమనించినట్లుగా మెల్లిగా లోపలకు వెళ్ళిపోయింది.

    మొత్తానికి ఆ రాత్రి తొమ్మిది దాటితేనేగాని వర్షము తిరుగుముఖం పట్టలేదు. చివరికి "తప్పకుండా తరచూ వస్తూండండి." అన్న మాట పదే పదే అనిపించుకుని అక్కడ్నుంచి బయటపడ్డాడు సత్యమూర్తి. ఆ రాత్రి చాలాసేపు వాళ్ళని గురించే ఆలోచిస్తూ గడిపాడు. అతనికి తన యీడు వుంటుంది. తనలాగే సన్నగా, బక్కపలుచాగా వున్నాడు. ఈ వయస్సులో అతని కప్పుడే కుటుంబ బాధ్యత ఏమిటి! తనయితే అట్లాంటి స్థితికి తట్టుకోలేడు. ఆ అమ్మాయికీ పదహారు, పదిహేడు ఏళ్లకంటే ఎక్కువవుండవు. ఎంత అమాయికంగా, లేతగా వుంది! ఆ అన్నా చెల్లెలిద్దరూ తమ కెవ్వరూ లేకుండా కష్టాలు పడుతూ ఆ జీవితం...అతనికి చిత్రంగా, బాధగా తోచింది.

    అతన్ది స్నేహితుల్నిగాని అమిత స్నేహాన్నిగాని అంతగా అభిలషించే మనస్తత్వముకాదు. కాని ఆ అన్నా చెల్లెళ్ళిద్దరివైపూ అతని మనస్సు ఆకర్షించే మనస్తత్వముకాదు. కాని ఆ అన్నా చెల్లెళ్ళిద్దరివైపూ అతని మనస్సు ఆకర్షితమై అటుగా వెళ్ళమని రోజూ వేధించసాగింది. మొహమాటము అడ్డువచ్చేది. పెరిగే కాంక్షను అణుచుకుంటూ అలా కొన్ని రోజులు గడిపాడు. చివరకు ప్రసాదరావే అతన్ని వెదుక్కుంటూ ఓ ఆదివారము వచ్చి "మాయింటి వైపు బొత్తిగారానేలేదేం మళ్ళీ?" అని అడిగాడు.

    ఒక వైపు సంతోషం, మరోవైపు తొట్రుపాటు కలవర పరచగా "వద్దామనుకుంటూనే వున్నానండీ. క్లాస్ వర్క్ కొంచెం ఎక్కువగావుండి వీలుపడలేదు." అని బొంకాడు సత్యమూర్తి.

    "అయితే యిప్పుడు పదండి. సెలవురోజే కదా" అని ప్రసాదరావు బలవంతము చేశాడు.

    "ఎందుకు?" అని అడగలేక పోయాడు. మౌనముగా అనుసరించి వెళ్ళాడు.

    వాళ్ళ పరిచయము అట్లా వృద్దిపొంది వారానికి రెండు మూడుసార్ల వరకూ కలుసుకుంటూ వుండేవాళ్ళు. మొదట్లో అతనికి ఉష కనిపించేది కాదు కాని ఒకరోజు అతను వెళ్లేసరికి ప్రసాదరావు యింట్లోలేడు. ఉష అతన్ని పలకరించాల్సి వచ్చింది. అతను తడబాటుపడుతూ కుర్చీలో కూర్చున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS