Previous Page Next Page 
విషవలయం పేజి 2

    "మరి ఎలాగు ఉషా! భయంగా వుందిగాని వెళ్ళాలనిలేదు. ఏమి చెయ్యను?" అన్నాడు దీనంగా.

    "మీరు వెళ్ళండి వెంటనే" అంది ఉష.

    అతను తలయెత్తి బాధగా చూచాడు.

    "కాని వెంటనే వచ్చేయండి."

    అతను చంటిపిల్లాడిలాంటివాడు. దేన్నిగురించీ నిర్దుష్టమైన ఆలోచన్లూ, అభిప్రాయాలూ వుండవు. ఎవరో ఒకరి నీడ అతనిమీద ప్రసరిస్తూవుండాలి.

    ఒకరకంగా చూస్తే సత్యమూర్తి అమాయకుడు. తెలివి తక్కువవాడు.

    ఆన్సర్కని విశాఖపట్నం వచ్చిన తొలిరోజుల్లో అతనెవరితోనూ మాట్టాడేవాడు కాదు. మొదట కొంతకాలం హాస్టల్లో వున్నాడు. కాని మనుషులతో కలువలేని అతని సహజగుణం హాస్టల్ వాతావరణానికి యిమడలేదు. ఎప్పుడూ హడావుడి, మెస్సులో రద్దీ, గడబడ ఒకరితో ఒకరికి చనువు అతన్ని ఉక్కిరి, బిక్కిరి చేశాయి. అక్కడ వుండలేకపోయాడు. మెల్లిగా ఊళ్ళోకి వచ్చి మకాం పెట్టాడు. తెల్లవారుఝామునే లేవటం, బస్ లో యూనివర్సిటీకి పోవడం, అలసిపోయిన శరీరంలో సాయంత్రం తిరిగి రావటం_ యిబ్బందిగా వున్నా మొత్తంమీద అతని ప్రాణానికి యిదే సుఖమనిపించింది. అతను వుంటోన్న ఇంటి వాళ్ళుకూడా హడావుడి మనుషులుకారు. ఒక భర్తా, భార్యా, ఓ ముసలామే అంతే.

    ఒక ప్రక్క చదువు, మరోప్రక్క అర్ధం అయీ అవని ప్రశాంతతా రోజులు యిట్లా గడిచిపోతూంటే ఓ సాయంత్రం చిత్రమైన సంఘటన జరిగింది.

    అతను షికారుగా పార్కు దాగా వెళ్ళి తిరిగి వస్తూంటే మేఘావృత్తమైవున్న ఆకాశం ఉన్నట్లుండి గ్రుమ్మరించినట్లుగా కురవసాగింది.

    అతని గది యింకా నాలుగయిదు ఫర్లాంగుల దూరందాకా వుంది. సమీపంలో ఎక్కడా రిక్షాకాని ఏమీ కనిపించలేదు. అతని కేమిచెయ్యటానికీ తోచక అటూయిటూ చూచి చటుక్కున అక్కడున్న పెంకుటింటి పంచలోకి పోయి తలదాచుకొన్నాడు. కాని అక్కడ నిల్చోవటం లాంఛనప్రాయంగానే పరిణమించిందిగాని, ఆ చాలీచాలని పంచలో చూరునుంచి పడుతోన్న నీళ్ళు అతన్ని ఏమాత్రం సురక్షితంగా వుంచలేకపోయినవ్.

    చీకటికూడా పడుతోంది.

    ఇంతలో ప్రక్కన కిటికీ తలుపు తెరుచుకున్నట్లయింది. సన్నని దీపకాంతి.

    "పాపం యిక్కెడెవరో తడిసిపోతూ నిల్చున్నా రన్నయ్యా" అంటోంది జాలిగా ఓ మృదుకంఠం.

    "అలాగా! లోపలకు రమ్మందాం వుండు" పురుషవ్యక్తి సమాధానం   

    సత్యమూర్తి వెనక గుమ్మం తలుపులు తెరచుకున్నాయి. అతను తప్పనిసరిగా వెనక్కి తిరిగి చూశాడు.

    "పాపం అక్కడవుంటే తడిసిపోతున్నారు. లోపలకు వచ్చి కూర్చోండి" అంటున్నాడు గుమ్మంలో నిలబడ్డ యువకుడు ఆదర పూర్వకంగా.

    "ఫర్వాలేదు లెండి, ఇక్కడ నిలబడతాను" అన్నాడు సత్యమూర్తి మొహమాటపడుతూ.

    "వర్షం ఇప్పుడప్పుడే వెలిసేటట్లుగా లేదు. ఇంకాసేపుంటే చప్పగా తడిసిపోతారు, రండి, ఫర్వాలేదు" అని ఆ యువకుడు బలవంతం చేశాడు.

    సత్యమూర్తి యిహ కాదనలేక మెల్లిగా లోపలకు అడుగుపెట్టాడు. అది చాలా చినభాగం. అంతా కలిసి రెండు మూడు గదులుంటాయేమో. ఇతను లోపలకు వచ్చీరాకముందే ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిపోయింది. యింట్లో ఎలక్ట్రిసిటీ లేనట్లుంది. బల్లమీద హరికేన్ లాంతరు వెలుగుతోంది.

    తన పరిస్థితికి సిగ్గిలుతూ, కించపడుతూ సత్యమూర్తి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. లోపలకు జల్లు వస్తూందని ఆ యువకుడు తలుపులు వేసి వచ్చి అతని కెదురుగా కిటికీలో చారగిలపడ్డాడు.

    "మీకు చాలా ట్రబుల్..." అంటూ సత్యమూర్తి అతనివైపు చూసి, అతన్ని గుర్తుపట్టి మీరు... మీరు..." అని అతని పేరు ఆలోచించుకుంటున్నాడు.

    "అవును, నేను ప్రసాదరావుని" అన్నాడా యువకుడు మందహాసం చేసి.

    "ఒక ఏడాదంతా మనం క్లాసుమేట్సుగా గడిపినా ఎప్పుడు ఒకరినొకరు పలకరించుకోలేదు. ఈ ఏడు మీరు క్లాసు నుండి అదృశ్యమైపోయిన కారణం నేను ఊహించుకోలేక పోయాను. ఒక సంవత్సరము చదివి, తరువాత మానెయ్యటం.." అన్నాడు సత్యమూర్తి.

    "మా పరిస్థితి అట్లా చేసింది" అన్నాడు ప్రసాదరావు.

    "అంటే?"

    "మా నాన్నగారు ఓ ఆఫీస్ లో హెడ్ క్లర్క్ గా పనిచేస్తూ నన్ను కష్టపడి చదివిస్తూ వుండేవారు ఈ వేసవిలో హఠాత్తుగా గుండెజబ్బుతో నాన్నగారు మరణించారు. చేతిలో చిల్లిగవ్వ లేదు కుటుంబ బాధ్యత నామీద పడింది కుటుంబమంటే నేనూ, చెల్లి మాత్రమే. అయినా మా పొట్ట మేము పోషించుకోవల్సిన అవసరం వచ్చింది. చదువుకు స్వస్తి చెప్పి ఉద్యోగంలో పడ్డాను. చిన్నదే అనుకోండి. అంతా కలిపి రెండు వందల దాకా వస్తాయి."
   


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS