Previous Page Next Page 
తృప్తి పేజి 5


    ఎందాకా? ఎందాకా? ఎందాకా?
    ఈ పరుగేమిటి? ఈ ఉలుకేమిటి?
    సందర్భం తప్పుకాని తన పరిస్థితికి సరిగ్గా వర్తించే పల్లవి అనుకుంది సింధు. ఆటో ప్రయాణిస్తున్నంతసేపూ ఆమె మనసు అంతకంటే వేగంగా ప్రయాణిస్తూ పిల్లలకోసం ఆరాటపడింది. ఆగీ ఆగగానే వాడికి డబ్బులిచ్చి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళింది. ఆయా ఒక్కతే ఉంది.
    "పాపకి జ్వరమెక్కువైతే ఫోన్ చేశామమ్మా మీకు. కలవలేదు. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే ఇందాకొచ్చి తీసుకెళ్ళారు. ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేశారు. స్నేహ నర్సింగ్ హోమ్ కి మీరొస్తే పంపించమని" అంటూనే వెళ్ళిపోవడానికి తాళం తీసుకుని బయల్దేరింది.
    ఉసూరుమంటూ బయటికొచ్చి నడిచే ఓపిక లేక మళ్ళీ ఆటో పట్టుకుని పక్కసందులోనే వున్న నర్సింగ్ హోమ్ కి చేరింది. తల తిరిగిపోతుంది. కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అలాగే గబగబా పరుగులాంటి నడకతో లోపలికెళ్ళింది.
    నర్సింగ్ హోమ్ చిన్నదే కావడంతో త్వరగానే కనిపించారు అరుణ్, తేజా. వాడు సింధుని చూడగానే 'అమ్మా' అంటూ వచ్చి కాళ్ళకి చుట్టేసుకున్నాడు.
    అరుణ్ నిష్టూరంగా అన్నాడు. "నీకు ప్రొద్దుటే తెలుసుగా జ్వరమొచ్చిందని, త్వరగా వస్తావనుకున్నాను. డీహైడ్రేషన్ అయింది. లోపల సెలైన్ పెట్టారు. అమ్మకు కూడా కబురు చేశాను"
    సింధు జవాబివ్వలేదు. లోపలకు నడిచింది. తోటకూర కాడలా వాడిపోయిన మొహంతో పడుకునుంది రమ్య. చేతికి సెలైన్ పెట్టారు. దగ్గరకెళ్ళి నుదుటిమీద చెయ్యేసింది. కాలిపోతోంది.
    తల్లి స్పర్శకి కళ్ళు తెరిచింది. బలహీనమైన స్వరంతో "మమ్మీ! ఫోన్ చేస్తే ఎందుకు రాలేదు?" అంది.
    సింధుకి దుఃఖం ఉబికి వచ్చింది. వంగి నుదుటిమీద ముద్దుపెట్టుకుంది. "చెడ్డ మమ్మీ" అంది రమ్య. అంతలోనే మగతలోకి జారిపోయింది.
    తేజా లోపలికొచ్చాడు. "మమ్మీ! ఇంటికెళ్దాం ఆకలి" అన్నాడు. కళ్ళు తుడుచుకుని "డాడీని పిలు" అంది. అరుణ్ రాగానే చెప్పింది. "మీరు తేజాకేదైనా తినడానికి పెట్టించి, మీరు కూడా తిని ఇంటికెళ్ళిపోండి. నేనిక్కడుంటాను."
    "నువ్వుండక్కర్లేదు. అమ్మ వస్తూనే వుంటుందీపాటికి" అతని గొంతులో కోపం తెలుస్తూనే వుంది "నేను రమ్య దగ్గరే వుంటాను" స్థిరంగా చెప్పింది సింధు. అరుణ్ వెళ్ళిపోయాడు తేజని తీసుకుని. సింధు మంచినీళ్ళు తాగొచ్చి రమ్యచేతిని తన చేతిలోకి తీసుకుని కూర్చుంది. ఖాళీ కడుపులో నీళ్ళు పడేసరికి నొప్పిగా అనిపించింది. అలాగే కళ్ళు మూసుకుని గోడకి తల ఆనించి కూర్చుంది. మాగన్నుగా నిద్రపట్టేసింది.
    పెద్ద పెద్ద గొంతులతో ఎవరో మాట్లాడ్తుండడంతో మెలకువొచ్చింది. ఎదురుగా అత్తగారూ, ఆడబిడ్డ కనిపించారు.
    "తల్లీ, ఎలా అయిపోయావమ్మా! నా తల్లి కదూ కళ్ళు తెరు" అంటోంది అత్తగారు.
    సింధు కళ్ళు తెరవడంతో చెప్పింది వసుధ. "ఫోన్ రాగానే అమ్మకి కాళ్ళూ చేతులూ ఆడలేదనుకో. ఎలా వున్నవాళ్ళం అలా బయల్దేరి వెళ్ళిపోదామంది. ఆవిడ పంచప్రాణాలూ పిల్లలమీదే అనుకో. అప్పటికీ నేనంటూనే వున్నాను. సింధూ లీవ్ పెట్టి వుంటుందిలే. పిల్లలకంటే ఎక్కువా ఏమిటి! నువ్వనవసరంగా ఖంగారు పడకు. అంత ప్రమాదమయితే వాడివాళ ఆఫీసుకెళ్ళేవాడా? అని"
    సింధూకి ఏం చెప్పాలో తెలీలేదు. "పొద్దున్న అంతగా జ్వరం లేదు" అంది తప్పుచేసినట్టు తల దించుకుంటూ.
    రమ్య కళ్ళు తెరచి వాళ్ళ బామ్మ చేయిపట్టుకుని "బామ్మా! నువ్వు మా ఇంట్లో వుండిపో" అంటోంది. దానికావిడ "వుండాలనే వుందే తల్లీ. మీ కోసమే బతుకుతున్నాను. మీకేమైనా వస్తే ఈ ముసలిగుండె ఓర్చుకోగలదుటే" అంటూ కొంగుతో ముక్కు, కళ్ళూ అడ్డుకుని దాని తల నిమిరింది. అది ఆవిడ చెయ్యి పట్టుకునే నిద్రలోకి జారిపోయింది.
    "సింధూ! నువ్విటే వచ్చినట్టున్నావ్. ఇంటికెళ్ళి స్నానం అదీ చేసి రెస్ట్ తీసుకో. అమ్మిక్కడుంటుందిలే" అంది వసుధ.  
    అత్తగారు సింధువైపు చూడలేదు. మాట కూడా మాట్లాడలేదు.
    "ఫరవాలేదు నేనిక్కడుంటాను. మీరింటికెళ్ళండి" అంది సింధు.
    దానికావిడ "నేనింటి దగ్గరేం చేస్తాను? నా బంగారు తల్లిక్కడిలా వుంటే" అంటూ మళ్ళీ కొంగు నోట్లో కుక్కుకుంది. వసుధ మరీ బలవంతం చెయ్యడంతో సింధు లేచి "మీకోసం ఆయనతో భోజనం పంపిస్తాను" అంది.
    "నేనేం తినను! ఇవాళ గురువారం" అని ముక్తసరిగా జవాబిచ్చిందావిడ.
    వసుధ ఆవిడతో "నువ్వు నాలుగురోజులుండే మాటయితే నాకు ఫోన్ చేయించు. నేను కూడా బయల్దేరి ఇంటికెళ్ళిపోతా. ఆయనొచ్చే వేళయింది" అంటూ లేచింది.
    "మీరు కూడా ఇంటికి రండి" అని పిలిచింది సింధు. తనకి కష్టమనీ, చాలా పన్లున్నాయనీ అవసరమైతే ఫోన్ చెయ్యమని చెప్పి ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయింది వసుధ.
    సింధు రమ్యతో చెప్పి ఇంటికి బయల్దేరింది. తనింటి కొచ్చేస్తుంటే రమ్య వుండమనలేదు. వాళ్ళ బామ్మ చెయ్యిపట్టుకునే తలూపింది. సింధుకి కలుక్కుమంది. కానీ చిన్నపిల్ల దానికేం తెలుసు? అన్నింటికి నేనిలా ఆలోచిస్తున్నానేంటి?' అనుకుంటూ ఇంటిదారి పట్టింది.


                             *    *    *    *


    మర్నాడు రమ్యనింటికి తీసుకొచ్చేశారు. సింధు లీవ్ పెట్టి ఇంట్లోనే వుంది. రమ్య దగ్గర అత్తగారే వుంది. అది అన్నింటికీ "బామ్మా బామ్మా" అని ఆవిడ్నే పిలుస్తోంది.
    సింధు అన్నిపన్లూ చేసి తన గదిలోకొచ్చి తన చదువు సంగతి చూసుకోసాగింది. అరుణ్ ఆఫీస్ నుంచి రెండుసార్లు ఫోన్ చేసి రమ్యకెలా వుందో తెలుసుకున్నాడు. రెండుసార్లూ అత్తగారే ఫోన్ అందుకుంది. తనని పిలిస్తే మాట్లాడదామని సింధు అనుకుని పిలవకపోయేసరికి ఊరుకుంది. వసుధ ఒక పనిమనిషిని వెంటపెట్టుకుని వచ్చింది. చిట్టెమ్మని అన్నిపనులు చేస్తూ పెట్టింది తిని వుండమని తీసుకొచ్చాను. జీతం రెండొందల యాభై అడుగుతోంది. ముఖ్యంగా పొద్దుటిపూట నీకు హడావిడిగా వున్నప్పుడు పిల్లల సంగతి చూస్తుంది" అని చెప్పింది. 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS