Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 5


    రైలు కదిలింది.
    సంజీవయ్య పై పంచతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు. అది గమనించి మాధవరావు కూడా కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్. సీత గమనించకుండా వెంటనే రుమాలుతో కళ్ళు తుడిచేసుకొన్నాడు.
    రైలు ఆ ఊరు వదిలేసి చీకట్లోకి జొరబడింది.
    మాధవరావు కింద బెర్తుల మీద ఇద్దరకూ పక్కలు పరిచాడు. సీత పడుకోకుండా కిటికీలోనుంచి చీకట్లోకి చూస్తూ కూర్చుంది.
    "నిద్ర రావటం లేదా సీతా!" నెమ్మదిగా అడిగాడతను.
    "ఊహు, నేనిలా రాత్రుళ్ళు రైలు ప్రయాణం ఎప్పుడూ చేయలేదు. అంచేత కొత్తగా ఉంది" నవ్వుతూ అందామె.
    "మరేం ఫరవాలేదు. పడుకో! నీకు తేలికుండానే నిద్ర పట్టేస్తుంది ......" పడుకొంటూ అన్నాడతను.
    చిన్నగా నవ్వి తనూ పక్కమీదకు ఒరిగిందామే.
    రాత్రి రెండు గంటల వరకూ నిద్ర పట్టలేదామెకు. లేచి కూర్చుందామనుకొంది గాని పై బెర్తుల మీద ఎవరో నిద్ర పొతుండడంతో లేవడం కుదర్లేదు.
    ఒకటి రెండుసార్లు మాధవరావు లేచి "ఏమిటి, ఇంకా నిద్ర పోలేదా?" అనేసి తను మళ్ళీ నిద్రలో మునిగిపోయాడు.
    చివరకు తెల్లవారుజామున నిద్ర పెట్టిందామెకు. మెలకువ వచ్చేసరికి పూర్తిగా తెల్లారిపోయింది. బయట "కాఫీ, టీ వాళ్ళ కేకలు వినబడుతున్నాయి. ఎదురుగ్గా మాధవరావు అప్పటికే లేచి కూర్చుని పేపరు చదువుతూ కనిపించాడు . తను సిగ్గుతో లేచి అతని పక్కనే కూర్చుందామె.
    "నిద్రయిపోయిందా?" నవ్వుతూ అడిగాడతను.
    "తెల్లారి పోయినా నన్ను లేపలేధెం?" చిరుకోపంతో అడిగింది.
    "హైదారాబాద్ చేరుకోనేసరికి ఇంకో అరగంట పడుతుందెలాగు! ఇప్పుడే లేపడమెందుకని ఊరుకున్నాను....."
    "ఇదేమి స్టేషను?" బయటకు చూస్తూ అడిగిందామె.
    "సికింద్రాబాద్.....అందుకే మన పెట్టంతా ఖాళీ అయిపొయింది....."
    సీత పక్క బట్టలన్నీ సర్ది బెడ్డింగ్ చుట్టేసింది.
    సామానంతా మరోసారి లెక్క వేశాడు మాధవరావు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. బండి హైదరాబాద్ చేరుకొనేసరికి  టైము ఎడయిపోయింది.
    సామానంతా ఇద్దరూ కూలీల కిచ్చి బయటకు వచ్చారిద్దరూ. టాక్సీ మాట్లాడి అందులో కూర్చున్నారు. విశాలమయిన వీధుల్లోంచి టాక్సీ వెళ్తోంటే ఆనందంతో ఉప్పొంగిపోయింది సీత. తనిప్పుడు హైదరాబాద్ నివాసిని. టాక్సీ కొద్ది నిమిషాలకి ఓ ఇరుకు సందులోకి ప్రవేశించింది. సీత  కొద్దిగా నిరుత్సాహపడింది. అంతకుముందు రోడ్ల కిరువైపులా చూసిన అందమైన భవనాలన్నీ ఆమె తాము ఉండబోయే భవంతులు గానే వూహించుకొంటోంది. అందమైన భవనం చుట్టూ విశాలమయిన ఆవరణ, పూలమోక్కలూ ---- తమదీ అలాంటి ఇల్లే అయి వుంటుందని అనుకొంది. తీరా సందులో అన్నీ పెంకిటిళ్ళూ, పాత మేడలూ అవడంతో ఆమెలో అసంతృప్తి చోటు చేసుకుంది. రోడ్డుకి ఓ పక్కగా సన్నని మురికి కాలువ.
    "ఇక్కడ అపు ....' టాక్సీ అతనితో చెప్పాడు మాధవరావు పక్కనే వున్న పెంకుటిల్లు చూపుతూ.
    ఆ ఇల్లు చూస్తూనే సీత పూర్తిగా నిరుత్సాహపడిపోయింది. ఆమె ఊహలకూ ఆ యింటికీ మరీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా వుంది. వరుసగా కోళ్ళ గూడుల్లా నాలుగయిదు ఇళ్ళున్నాయి ఆవరణలో.
    టాక్సీ దిగి తలుపు తెరిచి పట్టుకున్నాడు మాధవరావు. దిగి నుంచుంది సీత. టాక్సీ ఆగటం చూసి మిగతా పిల్లలంతా పరుగున వచ్చి టాక్సీ చుట్టూ మూగారు.
    కాంపౌండులోకి నడిచి మూసి వున్న పెంకుటింటి తాళం తీసి సామానంతా, ఇంట్లోకి చేర్చాడు మాధవరావు. సీత లోపలికి నడిచి అయోమయంగా దిక్కులు చూడసాగింది.
    ఒకే ఒక్క గది - వెనక బొమ్మరిల్లు లాంటి వంటిల్లు! అంతే! ఇది ఇల్లా? ఈ దిక్కుమాలిన ఇంట్లో తను జీవితం గడిపెయాలా? ఇంత కంటే నరకం ఇంకేమయినా ఉంటుందా? తన భర్త మరీ ఇంత అధ్వాన్నపు కొంప ఎందుకు తీసుకున్నట్లు? బహుశా కారు చవకయి వుంటుంది. ఏదిఏమయినా వీలయినంత త్వరలో ఈ ఇల్లు వదిలేయాలి. తాముండబోయే ఇల్లు తానూహించు కొన్నంత అందంగా లేకపోయినా కనీస తన ఊహలకు దగ్గరగా నయినా వుండాలి.
    "ఎలా వుంది సీతా ఇల్లు" నవ్వుతూ అడిగాడు మాధవరావు.
    జవాబు చెప్పకుండా నవ్వి ఊరుకుంది సీత.
    "పైపు ఆ చివరి ఇంటి ముందుంది. ఈ ఆవరణలో అయిదు కుటుంబాలకూ అదొక్కటే పంపు ...అది సరేగానీ నువ్వు త్వరగా రెడీ అయితే అలా హోటల్ కెళ్ళి ముందు కాఫీ, టిఫినూ కానిచ్చి వద్దాం! వంట సంగతి తర్వాత చూసుకోవచ్చు......' తను రెడీ అవుతూ అన్నాడు మాధవరావు.
    అయిష్టంగానే బట్టలు మార్చుకుంది సీత. ఈలోగా మాధవరావే ఓ బిందెతో నీళ్ళు తీసుకొచ్చి వంటింట్లో ఉంచాడు. దాని కానుకొని ఉన్నబాత్ రూమ్ లో ఇద్దరూ మొఖం కడుక్కొన్నారు. త్వరగా తల దువ్వుకొని చీర మార్చుకుంది సీత.
    ఇద్దరూ ఇల్లు తాళం వేసి రోడ్డు మీద కొచ్చారు. ఆ సందులో నుంచి ఫర్లాంగు దూరం నడిస్తే గాని మెయిన్ రోడ్డు చేరుకోలేకపోయారు. టాక్సీలో రావడం మూలాన అంత దూరం కనిపించలేదు పొద్దున. మెయిన్ రోడ్ లో పక్కనే వున్న ఓ హోటల్లోకి నడిచి ఫామిలీ రూమ్ లో కూర్చున్నారు. కాఫీ, టిఫినూ ముగించి మళ్ళీ ఇల్లు చేరుకునే సరికి టైం తొమ్మిదిన్నరయి పోయింది.
    సామాన్లన్నీ త్వర త్వరగా సర్దేశాడు మాధవరావు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS