Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 6


    గోడ కానించి ఉన్న మంచం వాల్చి దాని మీద తాము తెచ్చిన పరుపు పరిచాడు. బెడ్డింగ్ లో నుంచి దిళ్ళు, దుప్పట్లు తీసి పక్క వేశాడు. సీత అది తన ఇల్లు కానట్లే అతను చేసేదంతా నిర్లిప్తంగా చూస్తూ కూర్చుండి పోయింది.
    ఇల్లంతా ఓ కొలిక్కి వచ్చాక అతను సీత వేపు చూశాడు. ఆమె అలాగే గోడ కానుకొని తనవంకే చూస్తుండటం గమనించి ఆమె దగ్గరకు నడిచాడు. ఆమె ముఖాన్ని రెండు చేతుల్తోనూ పట్టుకొని నెమ్మదిగా ఆమె పెదాల మీద చుంబించాడు, చటుక్కున అతనికి దూరంగా జరిగింది సీత అటూ ఇటూ భయంగా చూస్తూ.
    "ఇక్కడ మనని కనిపెట్టే వాళ్ళెవ్వరు లేర్లే! ఆ భయమేం అక్కర్లేదు. అది సరేగాని ఏమిటలా "డల్" అయిపోయావ్? ఈ వాతావరణమేమీ నచ్చలేదా ఏమిటి ఖర్మ?" నవ్వుతూ అన్నాడతను.
    సీత మాట్లాడలేదు.
    అమాంతం ఆమెని రెండు చేతుల్లోనూ గాలిలోకి లేపి ఎత్తుకెళ్ళి మంచం మీద పడుకో బెట్టాడు . తనూ మంచం మీదే కూర్చుని ఆమె లేవకుండా రెండు చేతులూ అడ్డం పెట్టాడు.
    "నన్ను లేవనీండి......." బతిమాలుతున్న ధోరణిలో అందామె.
    "ఊహు! నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పేవరకూ నువ్విలా కదలకుండా పడుకొని ఉండాల్సిందే!"
    "బావుంది! నాకేం ఆలోచనలుంటాయ్! "అబద్దమాడేసింది.
    "ఏమి లేకపోతే , ఏం మాట్లాడవేం మరి?"
    "ఏముందని మాట్లాడటానికి?"
    "నువ్వేం ఆలోచిస్తున్నావో నేనే చెప్తాను! సరేనా?"
    "చెప్పండి చూద్దాం......" నవ్వపుకొంటూ అంది సీత.
    "ఈ ఇల్లేమిటి ఈ లోకమేమిటి? ఇలాంటి ఇంట్లో నేనెలా ఉండగలను/ తక్షణం ఈ ఇల్లు మారిపోవాలి అనుకొంటున్నావ్ కదూ!" నవ్వూతూనే అడిగాడు.
    సీత భయపడి పోయింది. తన మనసులోని ఆలోచనలన్నీ తెలిసినట్లే చెప్పేస్తున్నారేమిటీయన? ఇంద్రజాలం లాంటిదేమయినా వచ్చా ఏమిటి కొంపతీసి! ఈ మనిషితో తను జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తన మూలాన మనసు కష్ట పెట్టుకుంటారేమో!
    "అదేం కాదు! నేనాలోచిస్తుంది మా వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళను ఎప్పుడు చూస్తానా అని...... అబద్దం చెప్పెసిందామె.
    "ఓహో! ఇక్కడి కొచ్చి మూడు గంటలయినా కాలేదు, అప్పుడే గాలి తిరిగిందన్నమాట! బావుంది......."
    "మీరేం వెక్కిరించనక్కర్లేదు గానీ మరో బిందెడు నీళ్ళు తీసుకురండి ! నేను వంట ప్రారంభిస్తాను..."
    "వంటా ? --ఠాత్ ! ఇవాళ వంట చేయడానికి వీల్లేదు. ఈరోజంతా నీకు విశ్రాంతే! రేపు వంటకి ప్రారంభోత్సవం చెద్దాం! ఇవాళ అందుక్కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి! మరి కాసేపాగి అలా బజారు కెళ్ళి ఓ మాంచి హోటల్లో భోజనం చేసి అక్కడి నుంచీ సాయంత్రం వరకూ మనక్కావలసిన వస్తువులన్నీ షాపింగ్ చేసుకొని తిరిగి వద్దాం! ఆ తరువాత మళ్ళీ హోటల్లో భోజనం, సెకండ్ షో సినిమా.
    "ఎలా వుంది ప్రోగ్రాం?........"
    "ఏం బావుండలేదు ......" నవ్వపుకొంటూ అంది సీత.
    "బావుండలేదా?" ఆమెకు చక్కలిగిలి పెడుతూ అన్నాడు మాధవరావు.
    మధ్యాహ్నం ఆటోలో అబిడ్స్ చేరుకున్నారిద్దరూ. అక్కడ ఓ ఖరీదయిన హోటల్లో భోజనం చేశారు. అచ్చం తను సినిమాల్లో చూసిన హోటల్లా కనిపించింది సీతకది. ఆ హోటల్లో భోజనం చేస్తున్న మిగతా స్త్రీల కట్టు బొట్టులూ ఖరీదయిన చీరలు అన్నీ ఆమె దృష్టిని అమితంగా ఆకర్షించాయి . వాళ్ళతో పోల్చుకుంటే తను ఎంతో అనాకారిలా కురూపిలా అనిపించసాగింది. తనే కాదు మాధవరావు అంతే! ఇంకా పాతకాలం మనిషి లాగానే ఉన్నాయతని దుస్తులు. కనీసం కొంతయినా ఇద్దరిలోనూ వెంటనే మార్పు రావాలి. అందుకు తనే ప్రయత్నించాలి. రోడ్డు వెంబడి నడుస్తూ కూడా కనబడ్డ ప్రతి వస్తువునీ తమకున్న వాటితో పోల్చి చూసుకొని నిరాశ పడుతోందామె.
    సాయంత్రం అయిదయేసరికి షాపింగ్ ముగించుకొని ఇల్లు చేరుకున్నారిద్దరూ. ఇల్లు మారాల్సిన మాట నిజమే గాని ఆ విషయం అప్పుడే మాధవరావు నడిగితే బావుండదు.  ఒక నెల పోయాక దాని విషయం చూసుకోవచ్చు. అంతవరకూ ఎలాగోలా ఈ ఇంట్లోనే ఎడ్జస్ట్ అయిపోక తప్పదు . అనుకోని సరిపెట్టుకొందామే.

                              3

    పదిహేనురోజులు బాగానే గడిచిపోయాయి. మధ్యలో రెండు సార్లు ఆమెను తన స్నేహితుడు రెడ్డి ఇంటికి తీసుకెళ్ళాడు మాధవరావు. రెడ్డి, మాధవరావు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. రెడ్డి మాధవరావుతో పాటు ఇంటర్మీడియట్ తో చదువాపక ఇంజనీరింగ్ చదివి ఒక విదేశీ సంస్థలో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతను ఆస్థి పరుడు కావడం వల్ల హైదరాబాద్ నగరంలో జీవితం మరింత సుఖకరమాయిందతనికి. అయిదు వందల అద్దెతో ఓ అందమయిన ఇల్లు తీసుకొన్నాడు. ఇంట్లో ఖరీదయిన సామాను, రిఫ్రిజిరేటర్, రికార్డు ప్లేయరు, ఓ నౌఖరు -----అతని దర్జా, భోగం చూసి సీత ఆశ్చర్యపోయింది. మాధవరావుకి అంత ధనికులయిన స్నేహితులుంటారని ఆమె ఎప్పుడూ ఊహించుకోలేదు. రెడ్డి కున్నా ఆ అదృష్టంలో సగం తమకుంటే తనెంత సంతోషించేది? రెడ్డి భార్య కున్న నగలు చీరెలు కూడా ఆమెకు కళ్ళు మిరుమిట్లు కలిగించాయి. వెంటనే తమ పరిస్థితి గుర్తుకొచ్చి కృంగిపోయిందామె. వాళ్ళకి తమకి ఎంత తేడా? ఎక్కడికి పోవాలన్నా స్కూటరు. చేతి నిండా డబ్బు, ఏ పని చేయాలన్నా చేతి కింద నౌఖరు ---- అలా వుండాలి జీవితం! దాన్నే ఆదృష్టం అంటారు. ఏమి లేని దురదృష్ట జీవితం కొనసాగించడం కంటే, అంతం  చేసుకోవడం ఉత్తమం. ఇది తన తిరుగు లేని అభిప్రాయం. లేకపోతే కనీస సుఖాలు అనుభవించలేని బ్రతుకు బ్రతికి ఫలితం ఏముంది? చివరి కేలగూ అందరూ మృత్యుదేవతకు ఆహుతి కాక తప్పదు కదా! మరి బ్రతికుండే ఈ కొద్ది రోజులూ దరిద్రం అనుభవించలేక నానాపాట్లు పడుతూ బ్రతకడం దేనికి?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS