Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 4


    "ఏమున్నాయనీ...." సిగ్గుపడుతూ అందామె.
    "ఏమీ లేకపోవటమేమిటి? ప్రతి ఇంటికి ఒక కధ ఉంటుంది మనదేశంలో. మీ ఇంట్లో మీకు ఎలాంటి సమస్యలూ లేవా?"
    సీత కొద్ది క్షణాలు ఆలోచించింది.
    "ప్రత్యేకంగా ఏమి లేవు. చిన్న చిన్న వేమయినా ఉన్నా అవన్నీ డబ్బు లేక పోవడం వల్ల తలెత్తినవే. ఆర్ధికంగా చితికి పోయిన కుటుంబం మాది. పిల్ల లెక్కువ. నాన్నగారి ఆదాయం తక్కువ. అంతే! అందుకే ఇద్దరు తమ్ముళ్ళూ , చెల్లాయ్ చదువూ సంధ్యలూ సరిగ్గా లేవు....."
    "వాళ్ళకి కొద్దో గొప్పో సహాయం చేయాలని నీకు లేదా?" సందేహంగా ఆమె వంక చూస్తూ అడిగాడతను.
    "పుట్టింటికి సహాయం చేయాలని ఏ స్త్రీ కుండదు? కాని అవన్నీ ఎలా సాధ్యమవుతాయ్? ముందు మన సంగతి , తరువాత మీ మామయ్యగారి పిల్లలను చూడాల్సిన బాధ్యత ఒకటి మీ మీద ఉంది కదా?" ఆమె ఆలోచనా విధానం మాధవరావుకి లోలోపల అనందం కలిగించింది. ఇదే ఇలాంటి అర్ధం చేసుకొనే భార్యే కావాలని కోరుకుంటూ వచ్చాడు  తను. అందం, మనసూ రెండు సాధారణంగా ఒకచోట ఉండవని తన నమ్మకం. కాని తన భార్య విషయంలోనే తన నమ్మకం తప్పని ఋజువయిపోయింది.
    "ఫరవాలేదు సీతా! మన చుట్టూ వున్న వాళ్ళందరకూ మనకు చేతనయినంత సహాయం చేద్దాం! అందులో "నీ' నా అనే తేడాలు నాకు లేవు. సరేనా?"
    తలూపిందామే.
    సంతృప్తిగా ఆమె నుదుటి మీద చుంబించి మరింత గాడంగా తనకేసి ఆమెను హత్తుకున్నాడతను.
    ఆ పదిరోజులు పది క్షణాల్లా గడిచిపోయాయి. వారికి.

                                 2

    ఆ రాత్రే హైదరాబాద్ ప్రయాణం. సీత తల్లి దండ్రులు కూడా రైల్వే స్టేషన్ కొచ్చారు ఆమెను సాగనంపడానికి. సీత వెళ్లిపోతుందన్న బాధ వారి కంతగా లేదు. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె అక్క గారింటి దగ్గరే ఉండి చదువు కోవడం మూలాన ఆ ఎడబాటు అలవాటయిపోయింది. అదీ గాక గుండెల మీద కుంపటిలా ఎదిగిన కూతురికి అడిగినంత కట్నం ఇచ్చి వివాహం చేయగలమో, లేదోనన్న భయం ఆమె మీద అనురాగాన్ని చాలావరకు తగ్గింప జేసింది.
    సీత క్కూడా తన తల్లిదండ్రుల్ని వదిలి వెళ్తున్నానన్న బాధ అంతగా లేదు. ఆమె ఆలోచనలన్నీ హైదరాబాద్ మీద ఉన్నాయి. అక్కడ ఓ అందమయిన ఇంట్లో తనూ, అతనూ -- షికర్లూ, సినిమాలు, హోటళ్ళు - ఒకటేమిటి , తను కలలు కన్న జీవితంలోకి అడుగిడబోతోంది. అంతవరకూ తను అనుభవించిన బీద తనానికి గుడ్ బై చెప్పేస్తోంది. తనకు నచ్చిన చీరలూ, తినాలనుకొన్న వంటకాలూ, చూడదల్చుకొన్న ప్రదేశాలూ అన్నిటినీ అనుభవించబోతోంది.
    "సామాన్లన్నీ ఓసారి లెక్క పెట్టుకోండి. హైదరాబాద్ లో దిగేప్పుడు సరి చూసుకొందురు గాని ..." అన్నాడు సంజీవయ్య.
    మాధవరావ్ స్వయంగా అన్నీ లెక్కించడం ప్రారంభించాడు.
    ఒక కావిడ పెట్టె, రెండు సూట్ కేసులు, రెండు పచ్చడి జాడీలు, ఇంకేవేవో సామాన్లున్న అట్ట పెట్టెలు , బిందెలు మొత్తం పదిహేనున్నాయ్.
    అసలు వాళ్లతో పాటు అతని మేనమామ వాళ్ళు కూడా బయల్దేరాలను కొన్నారు. కాని వాళ్ళందరికీ చార్జీలు అనవసరపు ఖర్చు అని అలోచించి ఆ ఆలోచన విరమించుకొన్నారు. అందుకు మాధవరావు కూడా మద్దతు ఇచ్చాడు.
    గంట ఆలస్యంగా రైలు వచ్చి ఆగింది. ప్లాట్ ఫారం మీద.
    "అదిగో అదే హైదరాబాద్ కారేజ్ ....' ఎదురుగా ఆగిన స్లీపర్ కోచ్ వంక చూపుతూ అన్నాడు సీత తండ్రి. అందులోనే రిజర్వేషన్ చేయించాడు మాధవరావు. మరుక్షణంలో సామాన్లన్నీ పెట్లో తమకు కేటాయించిన బెర్తుల కింద సర్దేశారు. సీత మాధవరావులు కిటికీ దగ్గిర ఎదురెదురుగా కూర్చున్నారు.
    "వెళ్ళగానే ఉత్తరం రాయి!' అన్నాడు సంజీవయ్య."
    'అలాగే ......అన్నాడు మాధవరావ్.
    "డబ్బు కిబ్బంది కలుగుతే ఉత్తరం రాయి! అంతేగానీ అమ్మాయిని ముందే కష్టాలు పెట్టకు" తిరిగి అన్నాడతను.
    మాధవరావుకి మేనమామ మీద అభిమానం పొంగి పొరలింది. కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    ఇప్పుడే కాదు . ఎప్పుడూ ఇదే మాట! తను ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మేనల్లుడు మాత్రం సుఖంగా ఉండాలి. ఎంతమందికి దొరుకుతారు ఇంతటి మంచి మనసున్న మామయ్యలు?
    "అలాగే మామయ్యా......."
    రైలు కూత వేసింది. అంతవరకూ గంభీరంగా ఉన్న సంజీవయ్య ఇక తట్టుకోలేకపోయాడు. తన కొడుకు కాకపోయినా కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాడు మాధవరావుని. ఎన్నో కష్ట నిష్టురాలు భరించి అతనికి ఎలోటూ లేకుండా చదువు సంధ్యలు చెప్పించాడు. ఉద్యోగస్తుడిని చేశాడు. ఇప్పుడు ఓ ఇంటి వాడిని చేశాడు. ఇక్కడితో తను తీసుకున్న బాధ్యత ముగిసింది. తన చెల్లెలు కొడుకు కాబట్టి అంతటి బాధ్యత తీసుకోక తప్పింది కాదు. తన భార్య మీనాక్షి కది ససేమిరా నచ్చలేదు." మన పరిస్థితే అంతంతమాత్రంగా ఉంది. ఇంక ఇదో గొడవెందుకు" అంటూ తన వ్యతిరేకతను తెలియజేసింది గాని తను ఆమె మాటలు ఖాతరు చెయ్యలేదు. కొన్నిరోజులు ఇంట్లో ఘర్షణలూ, వివాదాలు చెలరేగినాయ్. చివరకూ ఆమె తలొగ్గక తప్పింది కాదు. ఈ విషయాలన్నీ మాధవరావు కూడా తెలుసు. తన మామయ్య తీసుకొన్న బాధ్యత వృధా కాకూడదన్న పట్టుదలతో చదివాడు, ఉద్యోగం సంపాదించుకొన్నాడు. తన శక్తి నంతా ధారపోసి మామయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆవిధంగా తన కృతజ్ఞత తెలియజేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన కోసం అత్తయ్యను కూడా నొప్పించిన మామయ్య గర్వంగా తలెత్తుకు తిరిగేలా ఆ కుటుంబానికి సహాయం చేసే బాధ్యత తనకుందని నమ్మాడు. ఇంతవరకూ అలాగే చేస్తూ వచ్చాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS