Previous Page Next Page 
తృప్తి పేజి 4


    "చిన్నపిల్లాడిమీద నేరాలు చెప్తావేమిటమ్మా?" అంటాడు శంకర్.
    అందుకే తులశమ్మ కొడుక్కికానీ, కోడలికి కానీ వాడిమీద ఏమీ చెప్పదు. అది వాడికలుసయిపోయింది. అస్తమానం అక్కల్ని కొట్టడం, వాళ్ళ వస్తువులు లాక్కోవడం, వాళ్ళేమైనా అంటే కాళ్ళు బాదుతూ ప్రాణాలు పోయినట్లు శోకాలు పెట్టడం లాంటి అఘాయిత్యాలు చేస్తాడు. వాడేడిస్తే నర్మద సహించదు. అత్తగారినెంతమాటైనా అనేస్తుంది. అసలు నర్మద మొదట్నించీ అహంభావురాలు. తను చాలా తెలివిగలదాన్ననీ, అందుకే ఉద్యోగమొచ్చిందనీ అందర్తో చెబుతుంటుంది. అటు పుట్టింట్లో గానీ, ఇటు అత్తవారింట్లోగానీ ఎవరూ ఉద్యోగస్తురాళ్ళు లేకపోవడంతో ఆమె గర్వం మరింత పెరిగింది.
    కాని ఈ మధ్యనే పక్కవాటాలోకి కావేరి వాళ్ళు దిగారు. కావేరి అందరితో మంచి కలుపుగోలుగా ఉంటుంది. ఇంట్లో వున్నంతసేపూ ఏదో ఓ పని చేస్తూ కనిపిస్తుంది. ఆదివారమొస్తే అత్తగార్ని కూర్చోబెట్టి మొత్తం పనంతా తనే చేస్తుంది.
    వాళ్ళత్తగారు వర్ధనమ్మగారూ, తులశమ్మగారూ త్వరలోనే స్నేహితులైపోయారు. మాటల్లో ఎప్పుడో తులశమ్మ "కావేరి చాలా మంచిపిల్ల్ల, నిదానస్తురాలు" అంది.
    అంతే! ఆరోజు ఇంట్లో జరిగిన గొడవ అంతా ఇంతా కాదు. "మీ కళ్ళకి నేను రాక్షసినీ, వూళ్ళోవాళ్ళు దేవతలూ అన్నమాట. నాలా వేలకివేలు సంపాదించేవాళ్ళు ఇంట్లో పనిమనుషుల్లా చాకిరీ చెయ్యనవసరం లేదు. మీరు నన్నెవ్వరితో పోల్చనవసరం లేదు. మీ కొడుక్కంటే నా జీతమెక్కువ తెలుసా? నా సొమ్ము తింటూ నన్నంటే పడేదిలేదు. మీకు మధ్యాహ్నంపూట అమ్మలక్కలతో చేరి నా గురించి చెప్పడం తప్ప వేరే పనిలేదని నాకు తెలుసు. ఇంకోసారి ఇలాంటిదేదైనా జరిగితే సహించను" అంటూ వార్నింగిచ్చేసింది.
    అప్పటినుండి తులశమ్మ పక్కింటివాళ్ళతో మాట్లాడటం తగ్గించేసింది.
    గట్టిగా అరుస్తూ లోపలికొచ్చింది నర్మద "ఆ ముసలావిడేది? పిల్లాడిలా బురదకొట్టుకుపోతుంటే చూడకుండా ఏం చేస్తోంది? ఒసే వల్లిముండా! ఎక్కడ చచ్చావ్?" అంటూ.
    తులశమ్మగారు కూర తరుగుతున్నదల్లా గబుక్కున లేచి "ఏమైందమ్మా?" అంది భయంగా.
    "ఏమీ కాలేదండీ, నేనూ నా పిల్లలూ ఇంకా బతికే వున్నాము. హాయిగా మీపని మీరు చూసుకోండి. ఇంకో జన్మంటూ వుంటే నేను కూడా ఈ ఉద్యోగాలవీ చెయ్యకుండా హాయిగా నీడ పట్టున కూర్చుని తిని బలుస్తాను" అంటూ వాడ్ని రెక్కుచ్చుకుని బాత్రూంకీడ్చుకెళ్ళి ఒళ్ళంతా కడిగింది. కడుగుతున్నంతసేపూ గొణుగుతూనే వుంది.
    తులశమ్మకి కళ్ళనీళ్ళు తిరిగాయి. 'ఛీ పాడుజన్మ, ఇంకోచోటన్నా లేకపోయింది వెళ్ళడానికి' అనుకుంటూ వంటింట్లోకి నడిచింది కోడలుకి కాఫీ కలపడానికి.
    "చూడా పిల్లనోరు! పెద్దావిడ చచ్చేంత చాకిరీ చేస్తుంది కదా! ఎన్నిమాటలంటోందో విన్నావా?" అంది గొంతు తగ్గించి వర్ధనమ్మ.
    చపాతీకి పిండి కలుపుతున్న కావేరి పక్కింటి భాగోతమంతా వింటూనే వుంది. "మనకెందుకులెండి. విందంటే మళ్ళీ ఆ ముసలావిడ్ని వుతికిపారేస్తుంది. అయినా ఆ గోపీగాడి అల్లరి అంతా ఇంతా కాదు. మధుని వాడితో ఆడనియ్యకండి" అంది.
    "మధుకి వాడితో పడదులే. ఎప్పుడూ కొడ్తాడు నానమ్మా నేను వాడితో ఆడను' అంటాడు. అయినా ఈ పెడసరమెందుకో వాళ్ళమ్మకి. చాలా పెద్ద ఉద్యోగమటగా"
    నవ్వింది కావేరి. "నాకో బస్ మేట్ వుంది సింధు అని. ఆవిడ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. జీతమెంతో తెలుసా? దగ్గరదగ్గర ఏడువేలు. అస్సలు గర్వం లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడుతుంది. మనకులాగే కష్టంసుఖం చెప్పుకుంటుంది. మిమ్మల్ని చూడాలని చాలాసార్లంది.ఓసారి తీసుకొస్తాను. కానీ పాపం టైముండదావిడకి" అంది.
    "అలాగా! తప్పకుండా తీసుకురా. నేనూ చూస్తాను. అంత చదువుకుని, అంత పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా గర్వం లేకుండా వుండేవాళ్ళుంటారని మన పక్కింటావిడకీ చూపిద్దాము" అంది కోపంగా.
    "అమ్మా, అమ్మా" అంటూ ప్రభ లోపలికొచ్చేసింది. "చపాతీలు చేస్తున్నావా వదినా? పిండెక్కువ కలపకపోయావా, మావారికి ఇవాళ వారం. టిఫిన్ చెయ్యాలంటే బోరుగా వుంది. ఒక్కమనిషి కోసం ఏం చేస్తాం చెప్పు?" అంది పిండి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ.
    ఇంకొంచెం పిండి కలపటానికి లేచి డబ్బా దగ్గరకెళ్ళింది వర్ధనమ్మగారు.


                             *    *    *    *


    సింధు టైం చూసుకుంది. ఆరున్నర దాటిపోయింది. పిల్లల్ని క్రష్ నుండి అరుణ్ తెచ్చాడో లేదో! పొద్దుట రమ్యకి కొంచెం ఒళ్ళువేడిగా అనిపించింది. అయినా ఇంట్లో అట్టిపెట్టడానికి లేదు. మందేసి స్కూల్లో దిగబెట్టి ఫీవర్ ఎక్కువైతే తనకు ఫోన్ చెయ్యమని చెప్పింది. కానీ తను పొద్దుటినుండీ డిపార్ట్ మెంట్ లో లేదు. కాన్ఫరెన్స్ లో వుంది. ఫోన్ వచ్చిందో ఏమో! ఆటోవాడు స్కూల్ నుంచి తీసుకెళ్ళి క్రష్ లో దిగబెట్టేసుంటాడు. వాళ్ళు ఆరుదాటితే మొహం ముడుస్తారు. అరుణ్ కి ఫోన్ లో చెప్దామని తెగ ట్రైచేసింది. లైను కలవలేదు. ప్రతి ఆటోలో ఎవరో ఒకరుంటున్నారు. తనని దాటి వెళ్ళిపోతోంది. వెహికల్ మీదొద్దామంటే డ్రైవింగ్ కి భయపడ్తోందీ మధ్య. కాస్త లోబిపి అయిందేమో ట్రాఫిక్ లోంచెళ్ళేటప్పుడు కళ్ళు చీకట్లవుతున్నాయి. కడుపులో అదోమాదిరిగా వికారంగా వుంది. లంచ్ టైమ్ లో స్నాక్స్ కాఫీ తప్ప కడుపులో ఏం లేదు.
    సింధు పెదవుల మీద ఓ రకమైన నవ్వొచ్చింది. పర్స్ లో వెయ్యికి తక్కువ కాకుండా డబ్బుంది. కానీ తినడానికి వ్యవధి లేదు. ఇంటికి టైంకి చేరే శక్తిలేదు. తన పిల్లలు దిక్కులేనివాళ్ళలా ఎవరిమీదో ఆధారపడి తనకోసం ఏడుస్తూ....
    ఇంకా పైన ఊహించలేకపోయింది.
    ఈ టెన్షనంతా తనకేలా లేక అరుణ్ కి కూడానా? దూరంగా ఆటో ఆగివుంది. ఒక్క ఉదుటున పరుగుపెట్టింది సింధు. ఏరియా పేరు చెప్పగానే వాడో నిమిషం ఆలోచించాడు. ఆ నిమిషం ఓ గంటలా అనిపించింది సింధుకి. చివరకు వాడు వరమిచ్చే దేవుడి ఫోజులో ఎక్కమన్నట్లు తలూపాడు. సింధు గబుక్కున ఎక్కి కూర్చుంది. పాన్ షాప్ లోని ట్రాన్సిష్టర్ లోంచి పాట వినిపించింది.
    ఎందాకా? ఎందాకా? ఎందాకా పరుగులు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS