Previous Page Next Page 
నానీ పేజి 3


    లిప్తపాటు నానీకేసి చూసింది.

 

    క్రమంగా నీటికుండలవుతున్న నానీకళ్ళు ఆమెగుండెల్ని పిండేస్తుంటే "చూడూ... మనం ఓ పనిచేద్దామా" అంది తనకళ్ళలో నీటిని కొడుక్కి కనిపించకుండా జాగ్రత్తపడుతూ.

 

    "ఏంటీ?"

 

    అక్కడ జరిగే చర్చకాని , ఆ చర్చ సారాంశంగాని  కొడుక్కి మరింత వివరంగా తెలియడం యిష్టంలేనట్టు పెరటిలోకి లాక్కుపోయింది.

 

    అక్కడున్న మల్లెచెట్టును చూపిస్తూ" బోలెడన్ని మల్లెమొగ్గలున్నాయి కదూ" అడిగింది.

 

    తలూపాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ...

 

    "మనింట్లో మూడు దేవుడి ఫోటోలున్నాయిగా"

 

    "అవును."

 

    "మూడిటికీ మూడు మాలలు కట్టాలి."

 

    "ఓసింతేనా?" అన్నాడు.

 

    "అందుకని నువ్వు సరిగ్గా నూటయాభై మొగ్గల్ని తుంచి నావడిలో వేయాలి."

 

    "వాట్ని మూడు భాగాలు చేస్తావా?"

 

    "మరేం... నీకు మూడోఎక్కం వచ్చుగా" ఆప్యాయంగా తలనిమిరి "పైగా నువ్వు లెక్కల్లో ఫస్టుకూడాను" అంది.

 

    తన దృష్టి మరల్చటానికి అమ్మ యీ పని అప్పచెప్పిందని తెలీని నానీ "సరే... ఒడి పట్టయితే" అంటూ మొగ్గల్ని తుంచడం ప్రారంభించాడు.

 

    ఆమె ఒడి పట్టిందిగాని అన్యమనస్కంగా లోపలి సంభాషణ వింటోంది.

 

    "అదెవర్తె..."

 

    "హెల్తు అసిస్టెంటుగాచేరి ఆరునెలలయింది. అబ్బాయి వి.డి.వో. కాబట్టి బాగా సన్నిహితమైందట."

 

    "ఓసి భ్రష్ట్రురాలా... అంటే ఇవన్నీ నీకు ముందే తెలుసన్నమాట" ఉద్రేకాన్ని అణిచిపెట్టుకుంటూ ఆయన నిలదీస్తున్నా స్పష్టంగానే వినిపిస్తూందామెకి.

 

    "ఈ దేభ్యం మొహందానితో ఓ ముద్దా ముచ్చటా ... పైగా అది బాగా ఆస్తిపాస్తులున్నది కూడాను."

 

    "రా...క్ష...సీ.."

 

    పావని వణికిపోతూంది. కాదు... ఏదైతే ఇన్నాళ్ళూ మామగారికి తెలియకూడదని కోటిదేవుళ్ళకు మొక్కుకుందో అది తెలిసిపోయినందుకు ఉద్వేగపడుతూ ఆ గొడవ క్రమంగా ఎక్కడికి దారితీస్తుందో అన్న సందిగ్థతతో నలిగిపోతూంది.

 

    "వాడిమీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళం... పౌరుషం దేనికండీ?" ఖండితంగా చెప్పింది కాంతమ్మ.

 

    "అంతకంటే చావడం నయంకదే!" మూడు దశాబ్దాల తమ దాంపత్యంలో ఆమెను తనకనుగుణంగా మలుచుకోలేనందుకు బాధో లేక కాలానుగుణంగా ఆమెలో వచ్చిన మార్పుకి జుగుప్సో ఆయన కంఠం వణికిపోతూంది.

 

    పావని వెన్నులో సన్నగా మొదలైన చలి ఉధృతమౌతుంటే, క్షణం నానీని చూసింది. నానీసైతం చేవొడ్డి వింటున్నాడని గ్రహించి "డెబ్భయ్ ఆరని మళ్ళీ నలభయ్ ఏడంటా వేంట్రా" అంది మందలింపుగా.

 

    "ఆ... నువ్వు సరిగా ఒడిపట్టడం లేదుగానీ" దొరికిపోయినట్టుగా బుంగమూతి పెట్టాడు.

 

    అప్పుడు చూసిందామె.

 

    తను తొట్రుపాటులో రెండుచేతులతో చీర చెరగు ఒక అంచున పట్టుకోవడంతో అప్పటికే సగానికిపైగా మొగ్గలు నేలపై పడిపోయాయి.

 

    నొచ్చుకుంటూ మొగ్గల్ని ఆదరాబాదరాగా ఒడిలోకి ఎత్తుతుంటే మరో కంఠం వినిపించింది లోపల.

 

    "నా ఇష్టం నాన్నగారూ. మీరెవరు అడగటానికి?"

 

    తండ్రికంఠంలోని ఆ తీవ్రతకి పావనికన్నా ఎక్కువ ఉలిక్కిపడ్డాడు నానీ.

 

    అయినా అమ్మ కోపగించుకుంటుందేమో అని వణికిపోతూ లెక్కపెడుతున్నాడు.

 

    లోపల వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంటూంది.

    "రేయ్!"

 

 

    ఏదో చప్పుడు

 

    ఇక నిభాయించుకోలేని పావని ఎంత వేగంగా లోపలికి పరుగెత్తిందంటే రెప్పపాటులో విశ్వేశ్వరశాస్త్రి చెంపని తాకాల్సిన భర్తచేతిని భయంగానే పట్టుకుంది.

 

    విసురుగా పక్కకి నెట్టేసరికి గోడకి తల కొట్టుకున్న పావని నిస్త్రాణగా జారగిలబడిపోయింది.

 

    నానీ గొంతులోనుంచి ఓ ఆక్రందన లేగదూడలా.

 

    దశాబ్దాల తన సామ్రాజ్యం విచ్ఛిన్నంకాగా రాజ్య బహిష్కరణ చెందిన చక్రవర్తిలా శిథిలమై ఆశీస్సుల్ని అందించే చేయి నేలని పునీతంచేసి కాలు పక్షవాతంతో ఓడించగా కుప్పలా కూలిపోయాడు విశ్వేశ్వరశాస్త్రి.

 

                                   *    *    *

 

    అసలుకథ తెలియని వూరిలోని ప్రముఖులతోపాటు సామాన్యులు విశ్వేశ్వరశాస్త్రి శాశ్వతంగా మంచంపట్టాడని తెలిసి వారంరోజులపాటు చూసిపోతూనే వున్నారు. కూతురు సరళతోపాటు అల్లుడూ వచ్చి వెళ్ళారు.

 

    అందరిలోనూ ఆయనగురించి అతిగా దిగులుపడింది నానీ...

 

    బడికి వెళ్ళనని మారాంచేశాడు.

 

    అపరాత్రి నిద్రలోలేచి కలవరించేవాడు.

 

    తను చెప్పడంతోనే ఇదంతా జరిగిందేమో అన్న బాధ ఆ చిన్నమనసులో.

 

    "నే తప్పుచేశాను కదమ్మా" అడిగాడోరోజున తల్లిని.

 

    "జరగాల్సిందలా జరిగిపోయింది" కొడుకుని గుండెలకు హత్తుకుంది. "నీ తప్పేముంది నాన్నా?"

 

    "నీకేం తెలీదు. అసలారోజు చూపించింది నేనే"

 

    నిర్లిప్తంగా ఓ క్షణంపాటు చూసిన పావని "నీ గురించి తాతయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా ?" అంది మాట మారుస్తూ.

 

    "దేనికి?"

 

    "నువ్వు స్కూలుకెళ్ళడం లేదని."

 

    "నేను వెళ్ళనంతే."

 

    "అంటే తాతయ్య బాధపడినా ఫర్వాలేదా?"

 

    "ఆహాఁ" తల అడ్డంగా వూపాడు "వెళతాను, బాగా చదువుకుంటాను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS