Previous Page Next Page 
కొత్తనీరు పేజి 5


    భార్య ఏం అనకుండా వూరుకుంటే రామం తెలుగు, తమిళం అంటూ అంత పట్టించుకోక పోయివుండును. కాని మీనాక్షి తన జాతిని, తన దేశాన్ని తక్కువచేసి మాట్లాడడంతో అభిమానం దెబ్బతింది. పౌరుషం వచ్చింది.
    అంతేకాక చూసిన రెండు మూడు సంబంధాలు తన భాషాంతర వివాహం వల్ల కుదరకపోవడంతో కాస్త భయం వేసింది. తన కూతురికైనా యిలాంటి సమస్య ఎదురవకూడదని నిశ్చయించి, తెలుగు సంబంధమే చూసి లక్షణంగా పెళ్ళిచెయ్యాలని నిశ్చయించి తండ్రికి ఉత్తరం రాసేశాడు రామం.
    
                                           2

    సబ్ జడ్జి జగన్నాధంగారంటే ఆరోజుల్లో ఎంతో హోదా, పరపతి, గౌరవం. ఆ కుటుంబం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు ముచ్చటగా వుండేది.
    పెళ్ళయిన తర్వాత పదిహేనో ఏట కాపురానికి వచ్చిన పార్వతమ్మ సహధర్మచారిణి అన్న మాటను సార్ధకం చేసుకొంది. పది హేడో ఏట సుపుత్రుడిని అందించినపుడు జగన్నాథంగారికి పార్వతమ్మ మీద ప్రేమానురాగాలు ఒక పిసరు ఎక్కువయ్యాయి. తరవాత వరసగా ఐదుగురు పిల్లల్ని కని, ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు కావాలనుకున్న భర్త కోరికను తు.చ. తప్పకుండా తీర్చింది.
    త్రిమూర్తులలాంటి తన కొడుకులకి రామారావు, కృష్ణమూర్తి, శంకరరావు అని పేర్లు పెట్టుకున్నారు ఆయన. కూతుళ్ళు శకుంతల, అన్నపూర్ణ, విజయ అని ముద్దుగా, కాస్త ఆధునికంగా పేర్లు పెట్టారు.
    జగన్నాథంగారు ఆ రోజుల్లోనే కాస్త ఆధునికంగా వుండేవారు. పిల్లలని ఆదర్శంగా మంచి పద్దతులలో పెంచేవారు. పిల్లల్ని తిట్టి కొట్టి భయపెడితే తల్లిదండ్రుల మీద ప్రేమ వుండదు. వాళ్ళకి తెలియచెప్పి, నచ్చచెప్పి, మంచి క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు మన మాట కాదనరు. చిన్నపిల్లలు స్వతహాగా మంచివాళ్ళు. వాళ్ళు పాడయ్యారంటే మనమే కారణం. పుట్టిందగ్గిర నించీ చెప్పిన మాట వినకుండా, చెడ్డగా పుట్టరు ఎవరూ! అలాంటి పరిస్థితులు మనమే కల్పించి వాళ్ళని మొండి వాళ్ళుగా, చెడ్డవాళ్ళుగా తయారుచేస్తాం. పిల్లల్ని కొడితే వాళ్ళు భయపడి దారికి వస్తారనుకోవడం పొరపాటు. అంటూ పాతకాలపు పార్వతమ్మకి వీలయినప్పుడల్లా బోధించేవారు. పార్వతమ్మ పిల్లల్ని తిట్టినా, కొట్టినా ఆయన వూరుకునే వారు కారు.
    అందుచేత మొదటినించీ పిల్లలకి తండ్రిదగ్గిర చేరిక. చనువు వుండేవి. పిల్లల్ని స్వేచ్చగా అన్ని విషయాలలో వాళ్ళ అభిప్రాయాలని చెప్పమనేవారు. వాళ్ళ యిష్టాన్ని ప్రోత్సహించి, వాళ్ళ అభిరుచులని పెంపొందించేవారు. పిల్లలని ఆదర్శప్రాయంగా పెంచుతున్నా నని గర్వపడేవారు.
    ఆయనికి ఎన్నో కోరికలు వుండేవి. కొడుకుల్ని ముగ్గుర్ని పెద్ద పెద్ద చదువులు చదివించాలని, కూతుళ్ళకి కూడా డిగ్రీ చదువులు చెప్పించి పెద్ద పెద్ద సంబంధాలు చెయ్యాలని కలలుకనేవారు. పిల్లలు పలకా. పుస్తకం పట్టుకోకముందే వాళ్ళ చదువులు నిర్ణయం చేసి, వాళ్ళ భవిష్యత్తు గురించి రంగు రంగుల కలలు చిత్రించుకునే భర్తని చూపి, మధ్య మధ్య పార్వతమ్మ నవ్వుతూనే వారించేది. "పిల్లల మీద మరీ అంతేసి ఆశలుపెట్టుకోవడం మంచిది కాదు. ఏమో! ఎవరు ఎలా తయారవుతారో, ఎవరిఅదృష్టం ఎలా వుందో" అనేది.
    "ఛా....వూరుకో, అశుభం పలక్కు. చూడు, నేనుచెప్పినట్లు అక్షరాలాచేస్తాను. పెద్దవాడిని డాక్టర్ని చేస్తాను. కృష్ణుడిని ఇంజనీరు, శంకర్ ని కలెక్టరు చేస్తాను. శకుంతలకి, అన్నపూర్ణకి, విజయకి వాళ్ళెంతవరకు చదువుతామంటే అంతవరకు చదువు చెప్పిస్తాను. తర్వాత వాళ్ళకి అబ్బాయిల లాంటి ఉద్యోగస్థుల నిచ్చి పెళ్ళిచేస్తాను" అంటూ పిల్లల్ని ముద్దాడుతూ సందర్భం వచ్చినప్పుడల్లా అంటూండేవారు గర్వంగా.
    ఆయన గర్వానికి తగ్గట్టే పిల్లలు చిన్నప్పటినించీ అన్నింటిలో చురుగ్గా వుండేవారు. చదువులో అందరూ ఫస్టుగా వుండేవారు.
    తన కలలు, ఆశయాలు అన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతూంటే ఆనందంతో తబ్బిబ్బు అయిపోతూ భార్యవైపు గర్వంగా చూసేవాడు ఆయన. భర్తలా పైకి అనకపోయినా ఆమెకి మాత్రం కడుపున పుట్టిన పిల్లలు వృద్ధిలోకి రావడం యిష్టం కాదూ!
    జగన్నాధంగారి గర్వానికి, సంతోషానికి మొదటిసారిగా ఆటంకం రామం ఇంటర్ చదువుకి వెళ్ళేముందు వచ్చింది. స్కూల్ ఫైనల్ ఫస్టుగా ప్యాసయిన రామాన్ని డాక్టరు పరీక్షకి చదివించాలని మొదటినుంచీ ఆయనకున్న అభిలాషని రామం కాదన్నాడు. తనకి ఆ కోర్సు యిష్టం లేదన్నాడు. ఆ రోగాలు, కురుపులు, అవీ అసహ్యమన్నాడు. తనకి లెక్కలు బాగా వచ్చు కనక ఎమ్.పి.సి. గ్రూప్ తీసుకుని ఇంజనీరింగు చదువుతా నన్నాడు. జగన్నాధంగారు నిరుత్సాహపడ్డా, ఎవరి అభిలాషనీ కాదనడం తన మతం కాదని ఆయన, ఇంకా యిద్దరున్నారు కనక అందులో ఒకరిని తను అనుకున్నట్టు చదివించవచ్చని సరిపెట్టుకున్నారు.
    ఏ ముహూర్తాన రామం ఆయన మాట త్రోసి పుచ్చాడోగాని అప్పటినించీ ఆయన అనుకున్నవి అన్నీ ఒక్కటీ జరగలేదు. ఆయన ఆశలు, కోరికలు అన్నీ తలక్రిందులయిపోయాయి.
    రామం చదువులోనేకాక, పెళ్ళివిషయంలోనూ ఆయన మాట త్రోసిపుచ్చాడు.
    డాక్టరు పరీక్షకి చదివించాలన్న ఆయన అభిలాషని కృష్ణమూర్తి అయినా నెరవేర్చలేదు. తనూ ఆ కోర్సులో తనకి ఆసక్తి లేదనేశాడు. విజ్ఞాన శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ తీసుకుని, పరిశోధనలు చేసి, ఫారెన్ వెళ్ళి డాక్టరేట్ తెచ్చుకోవడం తన అభిమతం అన్నాడు. ఇప్పుడూ ఆయన కొడుకుమాట కాదనలేకపోయారు. కృష్ణమూర్తి తన పెళ్ళి విషయంలోనూ తల్లిదండ్రుల కోరికని తోసిపుచ్చాడు. నలభైఏళ్ళు వచ్చేవరకు ఏవో పరిశోధనలు చేస్తూ, థీసీస్ రాస్తూ తన విజ్ఞానశాస్త్ర వ్యాసంగంలో మునిగిపోయి ఆఖరికి ఇంగ్లండులో వుండగా తోటి రీసెర్చ్ స్కాలర్ ని-ఓ మహారాష్ట్ర యువతిని-నలభై రెండేళ్ళకి పెళ్ళి చేసుకున్నాడు. బొంబాయిలోయూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. దేశ విదేశాలలో డాక్టరేట్ లు సంపాదించి ఆ బొంబాయి ఉద్యోగంలో స్థిరపడిపోయాడు!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS