Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 4


    "అక్బార్ తెచ్చిండట కద!" అసలు విషయం బయట పెట్టాడు తాసిల్దారు.

 

    బయలుదేరేప్పుడు అనుకున్నారు వీరయ్యగారు, పిలిచింది ఇందుకోసమేనని. అయినా ఆ ప్రశ్నకు కాస్త తికమకపడ్డారు. "తెల్వక తెచ్చిండుండి."

 

    "తెల్వక తెచ్చినాడు! యెవ్వడు తెచ్చినోడు?"

 

    నీళ్ళు నమిలారు వీరయ్యగారు. "నా మేనల్లుడు-అక్క కొడుకు."

 

    "అందుకే బతికిపోయిండు. లేకుంటే పీనిగెల బిందలోకి పోయెటోడు. ఎందుకు తెచ్చిండు?"

 

    "పట్నం నుంచి వస్తాండె, తెచ్చిండు. చెప్పినగద తెల్వక తెచ్చిండని."

 

    "పట్నం ఎందుకు పాయె అసల్" అడిగాడు, పట్నం పోవడం కూడా నేరమేనన్నట్లు.

 

    "పోలేదుండి. ఆడనే ఉండి చదువుకునె. చదువు అయిపోయింది. వచ్చిండు."

 

    "చదువుభీ చదివినాడు.అయితే ఖతర్నాక్* ఏం చదివిండు?"

 

    "నాకు తెలుస్తాదుండి ఆ చదువులేందో! ఏమో ఖానూన్ చదివిండట. ఏదో అంటరు లెలెబి."

 

    "ఏందేంది? ఖానూన్ చదివినాడు! ఖానూన్! ఆంగ్రేజొస్తదా?"

 

    "అంత చదివె. రాకుండుంటాది. తెలుస్తాదుండి నా బొంద."

 

    "సర్లె ఎన్నొద్దులుంటడు?"

 

    "యాడికి పోతడు"

 

    "ఏమీ? యాడికి పోడా? ఈడనే ఉంచుకుంటవా? ఖానూన్ చదివినోడు ఖతర్నాక్. మీదికెల్లి అక్బార్ చదువుతడు. పామున్నడు పాము. నెత్తికెక్కించుకుంటమా? నైజాన్తా జాగీర్ల ఉండెతంద్కు వీల్లేద్."

 

    "అట్లంటె ఎట్ల? అయ్య, అమ్మ చచ్చిరి. అల్లుడు కాడుండి. నాకు కొడుకులున్నరు గన్కనా. బిడ్డనిచ్చి ఇంట్ల ఉంచుకుంటా, బుద్ధిమంతుడు సర్కార్!"

 

    "ఏందేంది అక్బార్ చదివిటోన్కి బిడ్డనిస్తావు? నవాబుసాబ్ ఇజాజత్1 కావలె. లగ్గానికి2 ఖానూన్ కా బచ్చా. యహాఁరహనా నహిఁ అచ్ఛా. వీల్లేదు. ఒప్పుకోను భేజ్ దేవ్!"

 

    "ఖానూన్ చదివితే మాత్రం సర్కార్ కంటె ఎక్కువ తెలుస్తాదుండి! మా రఘు అసువంటోడు కాడు నా జిమ్మేదారీ3. నన్ను నమ్మరా?"

 

    "ఏందేంది? పేరు భీ ఎట్లనో ఉన్నది. యల్లయ్య కాదు మల్లయ్య కాదు. కమీనిస్టున్నట్టున్నాడు. బఢాదేవ్" గట్టిగా అరచాడు తాసిల్దారు. తరువాత మాట్లాడలేదు. వీరయ్యగారు మౌనం వహించారు.

 

    "పేరులో ఏమున్నది సర్కార్" నసిగారు వీరయ్యగారు. "నా జిమ్మేదారి అంటున్న గద. ఇంత జాయిదాదున్నది4 పారిపోతనా? వాడేమన్న చేస్తే నా తల తీయించుండి."

 

    "అచ్ఛా! కుక్కిన పేనోలె పడుండాలె. నఖ్రాల్ గిఖ్రాల్ చెయొద్దు. అక్బార్ గిక్బార్ చదువొద్దు. ఖానూన్ జతాయించిండా ఇడ్చెడ్డిలేదు. మీ జిమ్మెదారి మీద ఉంచుతున్నం. ఖైర్. నజ్రానా యెంతిస్తవు!"
__________________________________________________________

*ప్రమాదం. 1.అనుమతి. 2.పెండ్లికి 3.బాధ్యత. 4.ఆస్తి

 

    "నైజాన్తా, తీన్ సౌ. చలో అబ్ నిక్లో1. పొద్గాల పైకం పంపాలె. ఇక పొండి."

 

    వీరయ్యగారు ఇంకేదో చెపుదామనుకుంటుండగానే ఆడదాని కేకలు వినిపించాయి. మరుక్షణంలో ఇద్దరు మనుషులు ఒక అమ్మాయిని లోనికి లాక్కొచ్చి తాసిల్దారు కాళ్ళమీద పడేశారు. ఏడుస్తూ కేకలు వేస్తున్న పిల్ల లేచి గుమ్మంవైపు పరుగెత్తింది. మళ్ళీ ఆ తెచ్చిన ఇద్దరు పట్టుకొని లాక్కొచ్చారు.

 

    వీరయ్యగారు చూడలేకపోయారు. ముఖం తిప్పుకొని బయటికి నడిచి పోయారు.

 

    ఆ పిల్ల మల్లి. వడ్డెర పీరయ్య కూతురు. మంచి వయసులో వుంది. మిసమిసలాడే యవ్వనం, రంగు నలుపే. అయినా నీలమణిలా వుంది. తలారి శివయ్యకు ఎన్నడో కన్ను పడ్డది దానిమీద. వడ్డెర గూడెంలో కన్ను కొట్టాడు. మల్లి తలవంచుకొంది. ఆ రాత్రి అయ్యతో చెప్పింది. పీరయ్య మల్లమ్మను తప్పించేశాడు. మరో వూరికి పంపాడు. అందమైన ఆడది గూడెంలో ఉండరాదు. అది తాసిల్దారు ఇంటికి చేరాల్సిందే. తన కూతురికి ఆ గతి పట్టరాదనుకున్నాడు వీరయ్య. తల్లి ప్రసవిస్తే చూడ్డానికి వచ్చింది మల్లమ్మ. అదీ చాటుగానే. అయినా కనిపెట్టాడు శివయ్య. ఆ రాత్రి ఇంటిమీద దాడిచేశాడు. తనకు అందకుంటే తాసిల్దారుకు సమర్పించాలనుకున్నాడు. లాక్కొని వచ్చాడు. పారిపోతుంటే పట్టుకున్నాడు.

 

    మల్లమ్మ గింజుకుంటున్నది. వదిలించుకోడానికి శత ప్రయత్నం చేస్తున్నది. గట్టిగా పట్టుకున్నాడు శివడు. 'సర్కార్ దీన్ని దాచిపెట్టిండు పీరిగాడు. పట్టుకొస్తాంటె మీదపడి కొడ్తాండు. చుక్క సర్కార్ చుక్క ఇది! సర్కార్ కొలువులుండాలె. గూడెంల వుండి ఏం చేస్తదని తెచ్చిన, బాంచను."

 

    ఇంతలో పీరయ్య ఉరికివచ్చి తాసిల్దార్ కాళ్ళమీద పడ్డాడు. "దొరా! నీ బాంచను, కాల్మొక్త, చర్మం ఒలిచి చెప్పులు కుడ్త. నా బిడ్డ నిడువుండి." అని కన్నీరు కార్చుతూ బ్రతిమిలాడాడు.

 

    "అబె భంచత్ లే. ఏందిబే నఖ్రాల్చేస్తున్నవు. నీ చెప్పులు ఎవనికి కావాలెబె. చల్ బాహర్ మాధర్ ఛోద్" అని గట్టిగా తన్నాడు డొక్కలో తాసిల్దారు. గజం దూరాన పడి విలవిల లాడాడు పీరయ్య. మల్లమ్మ గుండె వక్కలైంది. తండ్రిమీద పడి రక్షించాలనుకుంది. ఉరికింది. ఇద్దరు రెండు రెక్కలు పట్టుకొని ఉన్నారు. ఆ ఊపుకు కుడిచేయి పుటుక్కుమంది. ఎముక తొలగింది. "హో" అని ఏడ్చి పడిపోయింది. పీరయ్య లేచాడు. కూతురువైపు సాగాడు. ఇద్దరు మనుషులు అతన్ని లాక్కెళ్ళి బయట పారేశారు. తలుపులు వేశారు.

 

    తాసిల్దారు దివాణంలోకి అనేకమంది అంగనలు అలా వచ్చినవారే. అలాంటి వారిని చాలామందిని 'నిఖా' కట్టుకున్నాడతను. ఒక వీధి సాంతం అతని పెళ్ళాలే వున్నారు. దాని పేరే తాసిల్దారు వీధిగా మారిపోయింది. వారిని మహమ్మదీయులుగా మార్చి వారి సంతానం పెంచి ఇస్లాంకు సేవ చేస్తున్నాడు అన్వర్ బేగ్ తాసిల్దార్. సేవ సంగతి ఎలా వున్నా ఆడది అంటే పడిచస్తాడతను.

 

    ఒకసారి ఈ జాగీరు ప్రక్కనున్న మరో పిల్లజాగీర్దారు "ఖాన్ సాహెబ్" ఈ జాగీరు నుంచి ఒక అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆమెమీద పూర్వం నుంచె కన్నువుంది తాసిల్దార్ కు. దాంతో ఆ "ఖాన్ సాహెబ్"తోనే యుద్ధానికి దిగాడు తాసిల్దార్. గుర్రాలమీద గుండాలతో ఆ వూరి మీద దాడిచేశాడు. ఖాన్ సాహెబ్ తక్కువవాడా! పఠాను రక్తం ప్రవహిస్తూంది అతని నరాల్లో. అతడూ కత్తి పట్టాడు. ఇద్దరూ గుర్రాలమీద ఉండే పోట్లాడుతున్నారు. ఇద్దరిలో ఎవరూ ఓడినట్లు కనిపించలేదు. ఎవరూ గెలిచినట్లు కనిపించలేదు. సంధి జరిగింది. అమ్మాయిని రెండు ముక్కలు చేసి చెరొక ముక్క తీసుకోవాలనుకున్నారు. అంతపనీ చేశారు. ఇద్దరూ గెలిచామనుకున్నారు.
_________________________________________________________

1.ఉదయం

 

    పాపం అమాయికను, అబలను బలిగొన్నారు! అందుకోసమే యే ఆడదాన్ని పట్టినా కిక్కురుమనరు అక్కడి జనం. మరి పీరయ్య మాత్రం ఏం చేయగలడు? అతనికి బలం లేదు. శక్తి లేదు. అధికారం లేదు. శక్తి ఉన్నంతవరకు ఏడ్చాడు గుమ్మం ముందు పడి, లేచి వెళ్ళిపోయాడు.


                                     *  *  *  *


    ఆ రాత్రి వీరయ్యగారికి నిద్ర పట్టలేదు. అన్నం తిన్నాననిపించి లేచారు. చుట్ట కాల్చుకున్నంతసేపూ ఏవేవో ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలను తరిమివేయాలనుకొన్నారు. మంచంలో మేను వాల్చారు. నిద్రపోవడానికి ప్రయత్నించారు. కాని మల్లి కళ్ళలో ఆడసాగింది. మల్లమ్మ పాపం పసిపిల్ల! ఎలా లాక్కొచ్చారామెను! తప్పించుకొనడానికి ఎంత గింజుకుంది? ఏమైందో దాని గతి? ఏమౌతుంది? అలాంటి అందరికీ పట్టిన గతే పట్టి ఉంటుంది. కాని అందరినీ తాను చూడలేదు. తాను చూచింది మల్లమ్మనే! పాపం ఆ పిల్ల! ఇప్పటికి పాడైపోయి వుంటుంది. మల్లమ్మతో జానకి కనిపించింది వారికి. గుండెలో అగ్గివాన కురిసింది. అలా కాకూడదు. కాదు. కారాదు. అనుకున్నారేగాని ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు వచ్చాయి. ఆ ఆలోచనను బలవంతంగా పక్కకు నెట్టారు. పత్రికంటే తాసిల్దారుకు అంత భయం ఎందుకు? ఏముంటుంది అందులో? అది చదువుతే తాసిల్దారు ఓడిపోతాడా? ఆరిపోతాడా? ఎందుకంత భయం? అందులో ఏముంటుందో చూడాలనుకున్నారు. లేచారు. చిరిగిన పత్రికలన్నీ తెచ్చారు. లాంతరు దగ్గరపెట్టి కూర్చారు. చదవడానికి ప్రయత్నించారు. ఏవో యుద్ధ వార్తలు.ఎక్కడో బాంబులు పడ్డాయి. ఎవరో గెలుస్తున్నారు. ఎవరో ఓడుతున్నారు. ఏమీ అర్థం కాలేదు. ముక్కలు అక్కడే పారేసి పండుకున్నారు. రఘుతో పత్రిక చదవడం మాన్పించాలా? అతను చేస్తున్న దానిలో తప్పుందా? ఏమేమిటో ఇలాంటి ఆలోచనలు మెదడును చీల్చసాగేయి!   

 
    జానకి కూడా ఆ రాత్రి నిద్రపోలేదు ఆమె కళ్ళలో బావ చేరాడు. పొంగిన చెంప, చేతిలో పెట్టె, చిరిగిన పత్రిక! బావ తనను పలుకరించలేదు; మరిచిపోయాడా! మారిపోయాడా! తాను చెరుకు తింటున్నది. బావ వచ్చి లాక్కున్నాడు. తాను పెద్దగా ఏడ్చింది. అత్తమ్మ వచ్చి బావను బాదింది. అయినా ఏడవలేదు. అత్తమ్మ వెళ్ళిపోయిం తరువాత తనను బాదాడు. ఈ తడవ తాను అత్తమ్మను పిలవలేదు. ఇద్దరూ కొట్టుకున్నారు. రాకకుకున్నారు. ఆ బావేనా యీ బావ! ఎంత మారిపోయాడు. తనకోసం ఏం తెచ్చాడో పట్నం నుంచి! చీరలు, జాకెట్లు, రిబ్బన్లు, గాజులు.

 

    రంగు రంగుల చీరలు ఆమె మనసులో రెపరెపలాడేయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS