Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 3


    తన బావ! బాగా పెద్దవాడైపోయి ఉంటాడు! పట్నంలో పెద్ద చదువులు చదివి వస్తున్నాడు! తనను గుర్తిస్తాడా! తన బావ! గుర్తించడూ! ఎలా పలకరిస్తాడో? ఏమంటాడో, ఏం తెచ్చాడో తనకోసం?

 

    ఇలాంటి భావాలు ఇంకెన్నో ఆమె మనసులో మసలాయి. ముసిరాయి. ఎంతో ఆవేశంతో, ఎంతో ఉద్వేగంతో, ఎంతో మమతతో, ఎంతో వలపుతో బయట అడుగుపెట్టింది జానకి. పయ్యదతో ఒడలంతా కప్పుకొని చెంబు మెట్లమీద పెట్టి బావను చూచింది.

 

    బావ! తన బావ స్థాణువులా మొదటి మెట్టుమీద అడుగు పెట్టాడు. ఏదో గంభీరంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు.

 

    మనసులో పెరిగిన తోటమీద పిడుగు పడ్డది. పొంగిన బావ ఎడమ చెంప చూచింది. "ఏమయ్యింది?" తనకు తెలియకుండానే పెదవులు పలికాయి.

 

    వస్తున్న ఇద్దరు మనుష్యుల్లో ఎవరూ ఆమె ప్రశ్నను వినలేదు.

 

    రఘు ఇంట్లో అడుగుపెట్టి, పెట్టె, చిరిగినా పేపరు ముక్కలు బల్లమీద పెట్టి కుర్చీలో కూలబడ్డాడు.

 

    జానకి కన్నీటితో లోపలికి వెళ్ళి తలుపు చాటున నుంచుంది.

 

    వీరయ్యగారు లోపలికి వచ్చారు. బల్లమీద కూర్చుంటున్నప్పుడు చిరిగినా పేపరు ముక్కలు కనిపించాయి. విషయమంతా అర్థమయింది. "అయితే నువ్వు తెచ్చినావు పత్రిక! జమాల్ సాబేకాదు కొట్టింది. మంది సొమ్ము తిని మస్తీ ఎక్కింది. గాడ్దికొడుక్కు. మొన్నటి దనక జమేదారుగుండె - ఇయ్యాళ అమీనాయె. ఇగ నెత్తికెక్కక ఏమైతడు లమ్డికొడుకు. నజ్రాన ముట్టంగనే అమీన్ను చేసే నవాబు సాబు. పట్నంల కూర్చున్నోన్కి ప్రజల కష్టాలేమి తెలుస్తయి? పత్రిక తెచ్చిండయ్యా, ఎర్కలేక తెచ్చిండు. తేవద్దని చెప్పాలె. బజార్ల పట్కకొడ్తాడు. కారటేస్తె సరిపోకపోయినాది. నువ్వు మాత్రం! ఏం తగలపడ్డదని తెచ్చినవు ఆ పత్రికల?" ఇంకేమేమో అనేస్తున్నారు వీరయ్యగారు.

 

    విషయం తెలుసుకున్న జానకి దుఃఖం పొంగింది. తన బావ! చెంప దెబ్బ తిన్నాడు! దెబ్బ ఆమెకు తగిలినట్లయింది. మంచంలోపడి ఎక్కెక్కి ఏడ్చింది. రఘు కుర్చీలోంచి లేచాడు. కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు.

 

    వీరయ్యగారి కోపం చల్లారలేదు. "నిన్నటిదనక పొగాకుకాడకు, బియ్యానికి తిరిగినోడు ఇయ్యాళ నా అల్లుణ్నే కొడ్తడులే. సరే చూస్తారే పియ్యాల్టికి నీ కాళ్ళు పట్టుకోవాలె గాడ్దికొడుకు ఏమనుకుంటున్నడో".

 

    "మామయ్యా ఉద్రేకం పనికిరాదు. వ్యక్తిని అని ఏమి ప్రయోజనం వ్యవస్థ అటువంటిది."

 

    ఆ పదాలు కొత్తగా వినిపించాయి వీరయ్యగారికి. వింతగా చూచారు రఘువైపు.

 

    "అవును మావయ్యా! గాంధీజీ దక్షిణాఫ్రికా పోయిండు.అక్కడ రాజ్యం తెల్లదొరలది. నల్లవారందరు కూలీలకింద లెక్క. గాంధీజీ ఫస్టుక్లాసు టిక్కెట్టు తీసుకొని ఫస్టుక్లాసులో ఎక్కిండు. ఆ దేశంలో తెల్లవారు తప్ప నల్లవారు ఆ క్లాసులో ఎక్కకూడదు. ఒక తెల్లవాడు గాంధీజీని చూచిండు. దిగమన్నడు. గాంధీజీ దిగనన్నడు. తెల్లవాడు పోలీసువాణ్ణి పిలిచిండు. పోలీసువాడు గాంధీజీని గుంజి కిందపడేసిండు.అప్పుడు గాంధీజీ 'ఇది జాతి విచక్షణ అనే వ్యాధికి ఒక లక్షణం మాత్రమే. కొట్టినవాణ్ణి కోర్టుకి ఎక్కించి ప్రయోజనం లేదు. ఈ వ్యాధిని నిర్మూలించటానికి ప్రయత్నించాలె' అనుకున్నాడు. కాబట్టి అమీనును అంటే ఏం ప్రయోజనం?"

 

    రఘు చెప్పిందాంట్లో ఏ కొద్దిగానో అర్థం అయింది వీరయ్యగారికి. అయినా తన అల్లుడు ఏదో గొప్ప విషయం చెప్పాడనుకున్నాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారే కాని వివరణ అడగలేదు.

 

    దుఃఖాన్ని గుండెలో దాచుకొని చెవులు రిక్కబొడుచుకొని వింటున్న జానకి ఏదో మనసు తేలిక అయినట్లు అనిపించింది. బావ విషయంలో ఏదో చెప్పరాని గౌరవం పొంగింది. తాను తన జీవితంలో పగలు సాధించుకోవడాలు చూచింది కాని దెబ్బతిన్న వాని నుంచి ఇలాంటి మాటలు వినలేదు. అదేదో కొత్తగా కనిపించిందామెకు. వింతగా కనిపించింది. ఆమె లేచింది. ముఖం కడుక్కుంది. అలా అన్న బావను చూడాలనిపించింది ఆమెకు. ప్రమిద వెలిగించింది. తీసికెళ్ళి ఇంటి ముందరి గూట్లో పెట్టింది. లోపలికి వెళ్ళింది. లాంతరు తెచ్చింది. బల్లపీట మీద పెట్టింది. భారమైన అడుగులు వేసుకుంటూ గుమ్మం దాటింది.

 

    బావ పిలుస్తాడని ఆశించింది.

 

    అతడు పిలువలేదు.

 

    తాసిల్దారు నుండి పిలుపు వచ్చింది వీరయ్యగారికి. వారు తలగుడ్డ చుట్టుకొని, కిర్రుచెప్పులు వేసుకొని బాణకర్రతో బయలుదేరారు. వీరయ్యగారి ముఖానికి బుర్ర మీసాలు ఒక అందం. వాస్తవంగా నిమ్మకాయలు నిలుస్తాయి వాటిమీద. అయినా వారి ముఖం భయంకరంగా ఉండదు. విశాలమైన వారి వదనంలో ఔదార్యం ఉట్టిపడుతుంటుంది. వారు ఆ గ్రామానికి మోతుబరిరైతు. పేదాబిక్కిని ఒక కంట చూస్తుంటారు. అందుకే వారంటే అందరికీ ఆదరం. వారు వీధి వెంట వెళ్తుంటే దండాలు పెట్టేవారు. ఆదరంగా పక్కకు తప్పుకునే వారు అనేకం. అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూగాని వారు సాగరు. అందుకే తాసిల్దారు ఇంటికి చేరేవరకు ఆలస్యం అయింది.

 

    తాసిల్దారు పేరు మహ్మద్ అన్వర్ బేగ్. అతడంటే ఆ జాగీరు ప్రజలందరికీ హడల్. అతని పేరు వింటే పిట్టలు సైతం నీళ్ళు తాగటం మానేస్తాయి. అతని ఆకారాన్ని చూస్తే వాస్తవంగానే హడలు పుడుతుంది. నల్లని బొగ్గులాంటి రంగు అతనిది. మహాయంత్రంలా ఉంటాడతను. అతనిది బానంత బొర్ర. అందుకే అతనిని బొర్ర తాసిల్దార్ అంటారు. పేరు ఎవరికీ తెలీదు. మనిషి బాగా పొడవరి. అయితే, బాగా లావుండటాన పొట్టిగా ఉన్నట్లు కనిపిస్తాడు. తల భుజాలకు తగిలినట్లుంటుంది. మెడ కనిపించదు. ముఖం గుండ్రంగా ఉంటుంది. కండలా ఉంటుంది. ముక్కు తప్ప కండ్లూ చెవులూ కనిపించవు. తల బట్టతల. ఆలోచన రానప్పుడల్లా అరచేత్తో తల రుద్దుకోవడం అతని అలవాటు. అతడు కట్టుకునేది పెద్ద గళ్ళలుంగీ. వేసుకునేది వదులైన తెల్లని జుబ్బా. కూర్చునేది బల్లపీటమీద. బల్లపీటమీద పరుపు దాని మీద తెల్లని గుడ్డ పరచి ఉంటాయి. అనుకోవడానికి తెల్లని బానీసులుంటాయి.

 

    అతడు మంత్రికుడని జనపు నమ్మకం. అతనికి ఎదురు చెప్పిన వాడు జీవించలేడనుకుంటారు. అలాంటివాడు తెల్లవారేవరకు రక్తం కక్కుతూ చస్తాడని వదంతులున్నాయి. అతని దగ్గిర వశీకరణ మంత్రం ఉన్నదని జనపు నమ్మకం. అది దండ కడియంలో ఉంటుందనీ, దాన్ని కదుపుతే ఎంతటి వాడైనా లొంగిపోతాడని అనుకుంటారు జనం. వారు అనుకోవడానికి ఆధారాలు ఉన్నాయి. పట్నంలో ఉంటాడేకాని పల్లెత్తు మాటనడు జాగీర్దారు. తాసిల్దారు చెప్పిన వాటన్నింటికీ తల ఊపుతాడు. తాసిల్దార్ తన మామకు మందు పెట్టి చంపాడు. బాణామతి చేశాడనుకున్నారు జనం. మామ పర్షియావాడు. నైజాం నవాబుకే మతాచార్యుడు. ఆ చావుతో ఒక కల్లోలం లేచింది. విచారించడానికి అధికారులను పంపింది నైజాం ప్రభుత్వం. వచ్చిన వారంతా అతని ఇంట్లో కుక్కల్లా పడి ఉన్నారేగాని కిక్కురు మనలేదు. అడవికి వేటకు వెళ్ళి వచ్చారు. హైద్రాబాదు రైలెక్కారు.

 

    అతనిది లంకంత ఇల్లు. ఇంటి ముందు సముద్రమంత ముంగిలి. అదే అతని ఆఫీసు. అతడు సర్వతంత్ర స్వతంత్రుడు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ, అక్కణ్ణుంచే నడిపిస్తాడు. అతడే ప్రత్యక్ష జాగీర్దారు. అతని సర్వీసు మొత్తంలోనూ ఆఫీసు గడప తొక్కలేదు. అతనికి చదువురాదు. ఆ విషయం చాలామందికి తెలీదు. జాగ్రత్తగా చదివించుకునిగాని సంతకాలు పెట్టడు. వ్యవహార దక్షుడని అతనికి పేరు. అందుకు కారణం అతడు గట్టిగా అరవగలడు. ఎదుటివాణ్ణి హడలగొట్టగలడు. అతనిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. అతని జీతం హలీ1. యాభై రూపాయలు! అవి అతని తాంబూలపు ఖర్చులకు సయితం చాలవు.

 

    అతని ముందు అంతా నుంచోవల్సిందే. ఎవడూ కూర్చోవడానికి వీల్లేదు. అయినా వీరయ్యగారికి కుర్చీ తెప్పించి వేయించాడు. వీరయ్యగారు వంగి సలాం చేశారు. జవాబుగా ఒకసారి సలాం చేశాడు. ఒకసారి చిరునవ్వు నవ్వాడు.

 

    "బైఠీయే వీరయ్య సాబ్."

 

    కూర్చున్నారు. తరువాత మాట్లాళ్ళేదు తాసిల్దార్. మౌనం చూస్తుంటే ఏదో అగ్గికొండ బద్దలు కానున్నట్లున్నది. అరచేత్తో తల రుద్దుకున్నాడు తాసిల్దార్. అంటే ఏదో మునిగిందన్నమాట. వీరయ్యగారి గుండెలో గుబులు ప్రవేశించింది.

 

    "ఏమో పిలిచిన్రంట"

 

    "మేమ్ పిల్చినామ్? పిలిపించుకుంటున్నరు. మోతబర్ రైతులే ఇట్ల చేస్తే సర్కారెట్ల నడుస్తది?"

 

    "సర్కారుకు ఎన్నడన్న ఎదురు చెప్పినమా? చెప్పినక జాగీర్ల ఉంటమా? చెప్పింది ఎట్ల తెలుస్తది?"

 

    "ఈడికే మంది చేతులుంటలేరు. పోరలు దునక బట్టిరి. ముంద్గాలనే చెప్పిన రేల్గాడి2 జాగీర్ల నుంచి పోనియెద్దని, నవాబు ఇంటెనా? షికార్ కు వచ్చెటంద్కు పనికొస్తదన్నడు. ఆ రేల్గాడితోనె తెల్విపారుకున్నరు మందంటె..."

 

    "సర్కార్! మా నాయన వచ్చిండు జాగీర్ కు. అప్పుడంత చిట్టడివే కద! భూములున్నాయుండి. ఊరిబయట కొట్టుకొచ్చిన వాసంతోనే ఇల్లు కట్టె మా నాయన. చెట్లు కొట్టి పొలం చేసుకొంటిమి. అడవిలనే పులివాతపడి చచ్చె మా నాయన. ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడన్న ఎదురు చెప్పినమా? మాసూళ్ళు కట్తుంటిమి. మామూళ్ళు కట్తుంటిమి. మళ్ళీ యిప్పుడే మొచ్చిందో ఎళ్ళబెట్టక పోతిరి. యెట్ల తెలుస్తది?"
__________________________________________________________

1. నైజాం. 2. రైలు బంజి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS