Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 3


    
    అర్ధరాత్రి తూలుతున్న కారు... పెట్రోలు వాసన సారాయంలా తల త్రిప్పుతోంది. ఇంటిదగ్గర దిగవిడచబడ్డాక "అరే... చిరంజీవి... రేపు కనిపిస్తాం" అంటున్న మనుషుల సవ్వడితో కారు వెళ్ళిపోయింది.  
    తీసుకువెళ్లిన రూపాయలన్నీ అయిపోయాయి. ఈ మదనష్టపు మనిషి మెల్లిగా లోపలకు నడిచి ఉసూరుమంటూ నేలమీద కూలబడిపోయాడు. కళ్ళనిండా నీరు నిండాయి. ఒళ్లంతా అసహ్యంతో రోమాంచితమైంది. 
    ఏదో పెనుగాలి, ప్రళయం ఆకాశమూ, భూమీ కలుసుకునే చోటుకు వలయంలో మధ్యస్తంగా దాపురించి అర్ధనగ్నంగా ఆడి అలసి, సొలసి, ఒక ఆర్తనాదం చేసి వికృతంగా తెగిపడి మృత్యుగహ్వరంలా తెరుచుకుంది. 
    హృదయకుహరంలో యెవరో భోరున ఏడ్చారు. 'చిరంజీవి! నువ్వు వెంటనే చచ్చిపో ఈ లోకంలో వెగటు నువ్వు భరించలేవు' అంది ఆ ఏడుపు లోని కొంత ఏడుపు.  
    "కాదు నిన్ను కన్నతల్లీ తండ్రీ యీ వెగటు భరించి మరీ చచ్చారు. నీకెందుకు వెరుపు?" అంది ఏడుపు నీడ.
    సంఘర్షణ సమిసినట్టుంది.
    ఈ లోకంలో కొందరు అడుగడుక్కీ అసహ్యించుకుంటూ బ్రతుకుతారు. కానీ వాళ్లూ బ్రతుకుతూనే వుంటారు.
    కలియుగంలోకూడా మాయ జరుగుతోంది. అభేద్యమైన ఆశ్చర్యమూ, అటువంటిదే దారుణమా అప్పుడప్పుడూ అక్కడక్కడా సాక్షాత్కరించి జన్మాంత రాలలోకీ, దేశాంతరాలలోకీ త్రోసివేస్తాయి.    

                                                  * * *
    మరునాడు మధ్యాహ్నం పేషెంట్సునంతా పంపివేశాక, దుస్తులు మార్చుకుని భోజనానికి కూర్చోబోతుంటే ఓ కుర్రాడు వచ్చి ఇట్లా కబురు చెప్పాడు.
    "మిమ్మల్ని అనసూయక్క పిల్చుకురమ్మంది సార్"
    "ఎవరు? ఎక్కడికి?" అన్నాను బిత్తరవోయి.
    "అనసూయక్క వాళ్ళయింటికి వాళ్ళ యింట్లో జబ్బుగా వుందిట."
    "అనసూయ! వాళ్ళకు నేనెప్పుడూ వైద్యం చేసినట్లు లేదే!"
    "ఏమో! నాకంతా తెలియదు సార్! డాక్టర్ చిరంజీవిగారంటే మీరేగా! పిల్చుకురమ్మంది. పదండి."    

    నాకేం చేయాలో పాలుపోక తటపటాయిస్తూ నిలబడ్డాను.ల 'రండి సార్, రండి' అని ఆ కుర్రవాడు తొందరపెట్టసాగాడు.
    ఎవరీ అనసూయ! ముక్కూ మొహం తెలియని డాక్టరు దగ్గరకు, ఏమీ మర్యాద లేకుండా అపరాహ్నంవేళ ఆ కుర్రవాడిచేత కబురు చేస్తుందేం?
    "నేనింకా భోజనం చెయ్యలేదోయ్" అన్నాను.
    "నేనిక్కడే కూర్చుంటాను. మీరు పోయి భోంచేసి రండిసార్" అని కుర్రవాడు నిర్భయంగా అక్కడున్న బెంచీమీద కూలబడి గోడలకు తగిలించివున్న మనిషి శరీరంలోని భాగాలు వ్యక్తంచేసే పటాలకేసి ఆసక్తితో తిలకిస్తూ నా ఉనికిని మరిచిపోయాడు.

    నా వంటమనిషి ఒట్టి పెంకిఘటం. ఆరు నూరైనా నూరు ఆరయినా పన్నెండు గంటలు దాటాక ఇహ వుండకుండా చక్కాపోతుంది తన మానాన తను ఇంత తిని నేను అన్నం వడ్డించుకొని తింటూ చిరాకు పడసాగాను ఈ అజ్ఞాతపు అనసూయమీద నేనిప్పుడు రానని మొరాయిస్తే?
    అటువంటి ఆలోచనలు నేను ఊరికినే ఆలోచిస్తూ వుంటాను. భోజనం ముగించాక దుస్తులు వేసుకొని 'పదరా అబ్బాయి' అని బయల్దేరాను. నా మందులపెట్టె కుర్రాడి చేతికిచ్చాను. ఈ డాక్టర్ ఏ వేళ్ళప్పుడు వచ్చి పిలిచినా రావడం వాళ్ల సుకృతం అని భావిస్తారు చాలామంది. అందుకే నెలకో యేడెనిమిది వందలు రాబట్టగలుగుతున్నాను.
    వైశాఖ మాసపుటెండ తీక్షణంగా వుంది. పొడగరిని కావడంవల్ల రిక్షాటాప్ వేస్తే నెత్తికి తగులుతుందని ఎప్పుడూ దింపివేయమంటాను. అందువల్ల చెమటలు క్రమ్మి ముఖమంతా కందిపోతున్నా అలాగే కూర్చున్నాను. హఠాత్తుగా నిన్నరాత్రి దృశ్యాలన్నీ తలపుకు వచ్చి మెదడును కలచివేయసాగాయి. రాత్రంతా నిద్రలేదు. ఊర్వశిప్రియ యెందుకో గుర్తుకు వచ్చిందిప్పుడు. 'ఛీ' అనుకున్నాను. అనసూయట యీ పిలువంపిన ఆమె పేరు. ఆహా! ఎంత పవిత్ర స్మరణీయమైన నామం!  
    కొంతసేపు గడిచాక బడిచావడి దాటి రిక్షా కుర్రవాడి మార్గదర్శకత్వం క్రింద ఓ గొందిలో ప్రవేశించింది. మహారాష్ట్రులు ముమ్మరంగా వున్న సందు. అన్నీ బీదవాళ్ల ఇళ్ళే ఇంచుమించు. ఓ పెంకుటింటి ముందాగింది.   
    కుర్రవాడి వెనుకనే నేనూ గుమ్మందాటి లోపలకు అడుగుపెడదామంటే ద్వారబంధానికి తలకొట్టుకుంది. ఇది నాకలవాటే. అయినా ఎప్పటికప్పుడు క్రొత్త. 
    "మా యింటి గుమ్మాలు చాలా పొట్టివి."  
    అటుకేసి తిరిగిచూసేసరికి గోడవారగా చిరునవ్వుతో ఓ యిరవైయేళ్ళయినా నిండినట్లు కనపడని స్త్రీ నిలబడి సాదరంగా తిలకిస్తోంది. నేను సిగ్గుపడి వెంటనే చకితుడ్నయాను.    

    వాడిపోయిన ఆ వదనమండలం, కృశించివున్న శరీరం పేదరికాన్ని గాక, ఏదో కర్తవ్యపు మమతలో నిర్లక్ష్యం చేయబడినట్లు తేటతెల్లం చేస్తున్న మాసివున్న దుస్తులు... నిష్కల్మషమైన చిరునవ్వు...! 
    ఈమె... ఈమె!
    సిగ్గువిడిచి చూశాను మళ్లీ మళ్లీ చకితుడ్నయాను.
    అవును ఆమె యీమే! 
    పారవశ్య విలీనుడినయాను. ఈమె ఆమే!
    "దెబ్బ తగిలిందా?" అని పరమర్స చేస్తోంది ఆదరపూర్వకంగా.
    ఈమెను నేను తరచు సందర్శిస్తూ వుంటాను. గత రెండు మూడునెలల నుంచీ యీమె దర్శనభాగ్యం ఆ కృపామయునితో బాటు ఎప్పుడూ లభిస్తూనే వుంది. ఆమె రాకకోసం దేవాలయం ప్రాంగణంలో నా కళ్ళు వెదుకుతాయి. రాగానే అవి ఆర్ద్రమౌతాయి. ఆ పెదాలపై అపూర్వమైన పవిత్రతతో కూడిన ప్రతిభావంతమైన చిరునవ్వు నేను తలవొగ్గాను. సామీప్యంకోసం తహతహ లాడాను. ఎంతటి అదృష్టవంతుడామె భర్త? ఆమెకు ఆమెలాంటి పెళ్లికాని ఓ సహోదరి వుండరాదూ? నేను యెప్పటికీ దురదృష్టవంతుడినేనా?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS