Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 2


    నా కళ్ళు తిరిగాయి.
    ఒక్కక్షణం నేనే లోకంలో వున్నానో అర్ధం కాలేదు. ఇది కలా? భ్రమా? ఇది నా స్వదేశమేనా?
    వాళ్లు కొన్ని వందలమంది ఆడవాళ్ళు, మొగవాళ్ళు. ఈ పృథ్విలో నా స్నేహితులకు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరేమోననిపించింది. స్త్రీ పురుషులు కట్టలు గట్టుకు వచ్చి కరచాలనం చేసిపోతున్నారు. వాళ్లందర్నీ నాకు పరిచయం చేసి వేస్తున్నారు. అనేకవందల 'హౌడుయుడూ'లు.
    పాశ్చాత్య దేశపు సంగీతం వినవస్తోంది. అందరూ యెక్కడికక్కడ విడిపోయారు. ఇద్దరిద్దరు కలసి నాట్యం చేస్తున్నారు. అందరూ కలిసి ఓ గుంపుగా ఆ చుట్టూ తిరుగుతున్నారు ముఖాల్లో ఆనందం, సౌఖ్యం, మైమరపు ఒలకపోస్తున్నారు. కొంతమంది కూర్చొని తిలకిస్తూ మైమరచిపోదామా? అయితే యెలాగ... అని అవస్థపడుతున్నాను
    నన్నెవరో సోఫాలో కూర్చోబెట్టినట్లయింది. నన్నిక్కడికి వీళ్లు ఎందుకు తీసుకువచ్చారు? అతికష్టంమీద కన్నీళ్ళనాపుకోసాగాను.
    హఠాత్తుగా భుజంమీద బరువైన చెయ్యి పడేసరికి తలత్రిప్పి చూశాను. రాంబాబు!
    "రా" అన్నాడు.
    "ఎక్కడికి?"
    "నీకో మంచి అందమైన అమ్మాయిని పరిచయం చేస్తాను. నీ నిష్టా గిష్టా పటాపంచలైపోవాలి. నువ్వు డాన్సు నేర్చుకోవోయ్. ఆ పిల్ల నేర్పిస్తుంది."
    "రాంబాబూ! నీకేమైనా మతిపోయిందా?"
    అతను నిర్లక్ష్యంగా నవ్వి చెయ్యిపట్టుకుని లాగాడు. ఇంతలో భుజంపైన ఒక మెత్తని చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి చూశాను.
    నేనామెవంక తదేకంగా చూసి గుర్తుపట్టగలిగాను.
    ఆమె ఆరునెలల క్రితం ఒక స్నేహితుడితో నా దగ్గరకు వైద్యంకోసం వచ్చింది. కాని ఆ స్వరూపం వేరు. ఆ అలంకారం వేరు. ఈమె యిప్పుడే దివినుండి దిగివచ్చిన ఊర్వశిలా వుంది. నా కళ్ళకు మైకంగమ్మింది.
    "మీరు కులాసాగా వున్నారా?" అన్నాను తెప్పరిల్లి. "ఆహా.... మిష్టర్ రాంబాబూ! డాక్టర్ ని నాకు కాసేపు వదిలేయండి" అంది ఊర్వశి ప్రియ.
    రాంబాబు నవ్వి 'ఆల్ రైట్' అంటూ చలాకీగా వెళ్లిపోయి మూకలో కలిశాడు.
    ఊర్వశి తన పెద్దకళ్ళను ఎత్తి నావంక వోరగా చూసి "డాక్టర్! వైన్ తాగుతారా?" అంది.
    "ఛీ!" అన్నాను.
    "మీకు డాన్సు వచ్చునా?"
    "రాదు" అన్నాను కటువుగా.
    "డాక్టర్! మనం కాసేపు అలా పోయి సింగ్ సాంగ్ ఆడదాం రండి."
    "రాను" అన్నాను మొండిగా.
    "డాక్టర్! అలా అయితే నాకు కోపం వస్తుంది మీమీద."
    "ఫర్వాలేదు" అన్నాను మూర్ఖంగా.
    "ఓహో" అని తల ఎగురవేసి, నవ్వి చెంపమీద చిన్న దెబ్బకొట్టి వెళ్లి పోయింది "డాక్టర్ కు మందులివ్వడం మినహా ఏమీ రాదు" అంటూ.
    అబ్బ! దుర్వాసన. వీళ్ళంతా మస్తుగా తాగేస్తున్నారు. నా వళ్ళు తూలింది. ఇదంతా నేనే తాగినట్లు చేతిరుమాలు ముఖానికి అడ్డం పెట్టుకుని నా దుస్థితిని, యీ రాత్రిని తలుచుకొని దురపిల్లసాగాను.
    కొంతసేపు గడిచాక మ్యూజిక్ ఆగిపోయింది. బిలబిలమంటూ మనుషులు వచ్చేసి నా చుట్టూ వున్న సోఫాలలో చతికిలబడి కిలకిలమని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోసాగారు. ఒకరిమీద ఒకరు పడిపోతున్నారు. "గోల్డెన్ ట్రీ, గోల్డెన్ ఈగిల్, నాకు స్కాచ్ విస్కీ కావాలి, భాయ్! ఒక పెగ్గు బిస్కెట్ బ్రాందీ. రకరకాల అరుపులు, కేకలు, సంక్షోభం నేను అమెరికా చూశాను.
    "డాక్టర్! నువ్వు యిక్కడా?" అంటూ వీరప్రతాప్, రాంబాబు మొదలైన వాళ్ళంతా వచ్చేసి నా ప్రక్కన కూలబడి "నువ్విలా వంటరిగా వుండటం మాకేం బాగాలేదు" నాయి కుదపసాగారు.
    ఆ సమయంలో వాళ్ళవంక ఉరిమి చూసి "నన్ను పోనిస్తాహరా, పోనియ్యరా" అని గట్టిగా అరుద్డామనుకున్నాను. కాని ఈ ఎనలేని మొహమాటం! వాళ్ళకు కోపం కలిగితే! యువకులంతా నన్ను చూసి నవ్వితే!
    "మనం యిక్కడినుంచి వెళితే?" అని ప్రాధేయపడ్డాను.
    "నాన్సెన్స్, నువ్వు చికెన్ బిరియానీ తినాలి! ఓ ఔన్స్ పుచ్చుకోవాలి."   

    ఈ అపవిత్రమైన స్థలం, ఈ దారుణమైన మాటలు! నేనెలా రక్షింపబడేది?
    వాళ్ళచేతులు పుచ్చుకొని "ఇవి కాళ్లు అనుకోండి. మీరుమాత్రం ఏమైనా చేసుకోండి. డబ్బు నేనే ఇస్తాను. నన్నుమట్టుకు చంపకండి."
    వాళ్ళు ఒక్క క్షణం తెల్లబోయి చూశారు.
    "బేవకూఫ్" అన్నాడు సాయిబు.
    "మఫ్."
    "అన్ కల్చర్డ్ బ్రూట్"
    వారు చెప్పి చెప్పి విసిగిపోయారు, తిట్టిపోశారు. ఇహ లాభం లేదనుకొని వాళ్ళ మానాన వారు త్రాగి, తందనాలాడారు. పేక ఆడారు. ఒకళ్ళమీద ఒకళ్ళు విట్సు వేసుకున్నారు. నన్ను వారు యిందాక తిట్టిన తిట్లు యెవరైనా విన్నారేమోనని సిగ్గుతో కుచించుకుపోతున్నాను. యిలా తలత్రిప్పి చూసేసరికి నావంక చూస్తున్న ఓ స్త్రీ చటుక్కున ముసిముసిగా నవ్వుకొంటూ తల త్రిప్పుకొంది. నా గుండె ఆగిపోయింది. లేడీడాక్టర్ వసుంధర!    
    నా మతి చెడిపోయింది. కళ్ళు మూసుకుని బలహీనంగా వెనక్కు వాలాను. ఎప్పుడు ఎలా స్నేహితులతో కారులోకి వచ్చిపడ్డానో నాకే తెలియదు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS