"చూడు పావనీ.. దాంపత్య జీవితంలో స్త్రీ కోరుకునేది వేరు, పురుషులు కోరేది వేరు. ఎవరో అదృష్టవంతులకి మాత్రం యిద్దరి భావాలు కలబోసుకునే అవకాశం వుంటుంది. అలా లేనప్పుడు రెండే మార్గాలు - ఎవరి దోవ వారిది - లేదా రెండోవారి త్రోవలో పయనించడం.
"అవును.. అలా తన మనసుని దారి మళ్లించుకుని భర్త దారే వెళ్లడం ఎప్పుడూ ఆడవాళ్ల వంతే - సర్దుకోవాల్సింది ఎప్పుడూ భార్యలే' నిష్టూరంగా అంది.
"అలా అక్కరలేదని యీ తరం వాళ్ళు నిరూపిస్తున్నారనుకో.. కాని దానివల్ల వాళ్లు యింకా సమస్యల్లో యిరుక్కుంటూనే వున్నారు. ఏదో ఒక కాపురం... సర్దుకుపోవడం నయం అని వంటరి బతుకు బతకలేని వాళ్లు యీనాడూ అనుకుంటూనే వున్నారనుకో...
"ఆంటీ ... ఏం చెయ్యాలో తోచక.. అక్కడనించి కాస్త ప్రశాంతత కోరుకుంటూ ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మీరు సరైన ఆలోచన, సరైన నిర్ణయం సూచించగలరని మీతో మాట్లాడడానికే వచ్చాను. అమ్మా, నాన్న పోయాక యింకేం వుందిక్కడ అని రాలేదు నాలుగేళ్లయి - పాపం అన్నయ్య రమ్మన్నాడుగాని అందరితో యీ విషయం చెప్పుకోలేను. చెప్పినా సర్దుకో అన్న పాటే వినిపిస్తారు. నాకు మీ మీద నమ్మకం వుంది. మీరు చెప్పండి నేనేం చెయ్యాలో...
"అతన్ని యింట్లోంచి పొమ్మన్నానన్నావు. ఎక్కడుంటున్నాడు.. ఏం గొడవ పెట్టడం లేదు గదా"
"ఎక్కడో స్నేహితుడింట్లో వున్నాడట - బయటికి వెళ్లిం తర్వాత గాని ఆయనకి జ్ఞానోదయం అవలేదు. ఒకటే సంధి రాయబారాలు పంపిస్తున్నాడు స్నేహితుల ద్వారా - వాళ్ళంతా వచ్చి బాధపడిపోయారు. భార్య భర్తల మధ్య గొడవలు సహజం - యీ మాత్రానికే విడిపోవడం ఏమిటి అంటూ నన్ను ఊదరగొడ్తున్నారు. నా శ్రేయోభిలాషులంటూ వచ్చి యిద్దరిని సమాధాన పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదంతా ఓ పెద్ద న్యూసెన్స్ లా అనిపించి భరించలేక కొన్నాళ్ళు మనశ్శాంతితో వుండాలని ఇండియా వచ్చాను. నన్నేం చెయ్యమంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి. ఇంకా డైవర్స్ కి అప్లై చేయలేదు. ఇక్కడికొచ్చి వెళ్లాక ఓ నిర్ణయం తీసుకుందామని ఆగాను' - నావైపు చూసింది చెప్పమన్నట్టు.
"పావనీ, నీ వైపునించి నీవు అతన్ని మార్చడానికి ఎప్పుడన్నా ప్రయత్నించావా? మంచిగా చెప్పి చూశావా...? కాస్త నీవు తగ్గివుంటే అతనూ తగ్గి మారేవాడేమో...నీవు అతన్ని లెక్కచెయ్యకపోవడంతో మరింత రెచ్చిపోయాడేమో....
"ఆంటీ, రెండేళ్ళు అన్నీ సహించి భరించాను - ఏ రెండు మూడు నెలలు కాస్త తిన్నగా వున్నాడేమో.. తరువాత పొరవిడిచేసిన పాములా తయారయి నిజరూపం చూపించడం మొదలుపెట్టాడు. డబ్బుకోసం గొడవ, ఏ పనిచేసినా తప్పులెంచడం. తనమాటే నెగ్గాలి, తనన్నదే కరక్ట్ - నాకేం తెలీదు. జవాబిస్తే పొగరు, వూరుకుంటే నిర్లక్ష్యం, ఏది కొన్నా దుబారా, సంపాదిస్తున్నానని పొగరు. ఆడదాన్నయి వుండీ వంట రాదు. మగాళ్లతో అంతలా పూసుకుతిరిగి మాట్లాడనవసరం లేదు. అందరి ఆడవాళ్లు నాలా వుండరు. మాటలో మృదుత్వం లేదు - చేతల్లో లేకితనం డబ్బు కౌపీనం, జీతం అంతా తన చేతిలో పెట్టాలనే కౌపీనం - వంట్లో బాగులేకపోయినా ఓ సానుభూతి మాటలేదు. అన్నింటికి మూలం - భార్య పట్ల ప్రేమ అనురాగం లోపించడం... అలాంటి భర్తతో రెండేళ్ళు కాపురం చేశాను సర్దుకుంటూ' గొంతు రుద్ధమయింది.
ఎవరిని లెక్కచెయ్యకుండా, తన స్వంత నిర్ణయాలు మంచయినా, చెడయినా తీసుకుని దాని పర్యవసానం తను భరించగలిగే మనస్థైర్యం వున్న పావనిని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. చదువు విషయం, అమెరికా వెళ్లడం, పెళ్లి చేసుకోననే నిర్ణయం.. అన్నింటిలో ఎవరి మాట వినకుండా తనకు మంచిదని తోచింది చేసే పావని ఈనాడు యీ పెళ్లి వలన పాపం ఎంత బేల అయిపోయింది! అలాంటి అమ్మాయికి తనలాంటి వాళ్ళివ్వ గలిగిన సలహా ఏముంటుంది. సర్దుకు బతుకు అని చెప్పడం ఎంతవరకు న్యాయం! అలా అని పిల్లని పెట్టుకుని వంటరిగా యింకా ఎంతో వున్న జీవితాన్ని యీదగలదా! ఇన్ని ఏళ్లు వచ్చి, ఒక పిల్ల పుట్టి యీ వయసులో యింకో పెళ్ళి చేసుకోడం అంత సులువా! చేసుకున్నా పిల్లని స్వంత తండ్రిలా చూసుకోగలడా! మళ్లీ యింకో వలయంలో చిక్కుకోవడం అవదా. పావని ముందు రెండే మార్గాలు పిల్లకోసం, తోడుకోసం అతనితో కాంప్రమైజ్ అవడం కొన్ని షరతులతో - లేదంటే విడిపోవడం. ఏది చెప్పాలి తనలాంటి వారు.. తనపై యింత నమ్మకం, గౌరవం వుంచిన ఆమెకు ఏం జవాబు చెప్పాలి.
ఇద్దరి మధ్య వయసులో తల్లి కూతుర్లకుండాల్సినంత తేడా వుంది. చిత్రంగా యిద్దరి మధ్య యింత అనుబంధం ఏర్పడడం మాకే ఆశ్చర్యంగా వుంటుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా పావనిని ముందు చూశాను. మా పక్క అపార్టుమెంట్ కొనుక్కొని వచ్చారు ఆ కుటుంబం. కొద్ది రోజుల్లోనే మా రెండు కుటుంబాలు దగ్గరయ్యాం - వంటలు, పిండి వంటలు యిచ్చిపుచ్చుకోడాలు, కలిసి బజారుకెళ్లడం, సెలవులొస్తే కల్సి పేకాడడం, పిల్లలిద్దరూ ఆంటీ అంటూ చనువుగా వచ్చి పుస్తకాలు తీసుకువెళ్లడం, పావని తల్లి కూతురు మాట విననప్పుడల్లా నా దగ్గరకొచ్చి కంప్లయింట్ చేస్తే యిద్దరికి సంధి కుదర్చడం, పావనికి నచ్చచెప్పడం, పావని ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ అయి అమెరికా వెడతానంటే పెళ్లి చేసుకుని వెళ్లమని తల్లి తండ్రి బలవంతం చేస్తే పావని మొండికేస్తే, అమెరికా పంపమని తల్లి నిరాహారదీక్ష, యిద్దరికి నచ్చచెప్పి పెద్దవాళ్ళు మీరూ మొండికేస్తే ఏదన్నా అఘాయిత్యం చేస్తుందేమోనని నచ్చచెప్పి వీసాకి పంపడం - సెలవులకి వచ్చినప్పుడల్లా ఆ తల్లిదండ్రులు పెళ్లని పోరు, పావని నచ్చినవాడు దొరకలేదని ఇద్దరు వాదించుకోడం. తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిపోవడం - కూతుర్ని జీవితంలో స్థిరపడమని తల్లి ఏడుపు, పావని చేత ఎలాగో ఊ అనిపించడం తల్లి పోడంతో పదేళ్లు పావనికి నాకు మధ్య వయసు తేడా మాయమయి స్నేహితుల్లా మాట్లాడుకుంటూ పావని ప్రతి చిన్న విషయం తనకు చెప్పి సలహాలాడగడం.. పావని ఆఖరికి పెళ్లి చేసుకుందన్న కబురు తర్వాత... మూడు నాలుగేళ్లు ఏ కబురు లేదు. ఆఖరికి ఇలా పావని రావడం యిప్పుడేం చెప్పాలి?
* * * * *
నెల రోజుల తరువాత ఒక పెద్ద ఇ-మెయిల్ పంపింది పావని -
"మనసుని చంపుకుని, వ్యక్తిత్వాన్ని పాడె ఎక్కించేసి, ఆత్మాభిమానానికి చితిపేర్చేసి, అభిమానానికి తిలోదకాలిచ్చేసి కర్మకాండ పూర్తిచేసి - ఆత్మలేని శరీరంతో రాజీకి వచ్చేసాను. శ్రేయోభిలాషులందరి సూచనలతో కాపురానికి ఓ అగ్రిమెంటు రాసుకున్నాను. రాయించుకున్నాను. షరతులతో గిరి గీసుకున్నాం. మనసులు కలవవు - మనుషులం కల్సి బతుకుతాం. ఓ కప్పు కింద కాపురం. వండుతాను, పెడతాను, సగం జీతం ఆయనకివ్వాలి - ఇల్లు ఆయన నడుపుతారు - నా దారికి అడ్డురారు. ఆయన దారికి నేనడ్డు రారాదు! పాప యిద్దరిది! ఎవరెంత ప్రేమ వంతులేసుకు యిచ్చేది కాలం తేల్చాలి! పెద్దయ్యాక పాప తూచుకుని తేల్చుకుంటుందేమో!
ఆంటీ, ప్రతిదానికి ఓ నేచ్యురేట్ పాయింట్ వుంటుంది. ఆ స్థితికి వచ్చానిప్పుడు, నాకు ప్రశాంతత కావాలి - నాకింకా దేనికోసం పోరాడి, సాధించాలన్న తపన లేదు. హాయిగా నా పాపతో ఆడుకుంటూ దాని ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ ప్రశాంతంగా బతకాలని ఉంది. వాదనలొద్దు, దెబ్బలాటలు వద్దు. ఏదో ఉద్యోగం చేసుకుంటూ (ఉద్యోగమూ వద్దు వదులుకోవాలనే వుంది. కాని ఉద్యోగం లేకుండా ఈ మనిషి ముందు ప్రతి రూపాయికి చేయి చాపాలన్న ఆలోచన భయం అనిపించి ఉద్యోగం వదలలేను)యింత వండి పడేసి, పాపతోటే లోకంగా బతకాలన్న నిర్ణయానికి వచ్చాను. మీరంతా అన్నట్టు ఏదో ఒక మొగుడు యింట్లో మనిషి తోడు అవసరం. పాపకి ఓ తండ్రిగా అతన్ని భరించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ సమాంతరరేఖలు కలవవు. కలవని రైలు పట్టాల మీద రైలు వెళుతూనే వుంటుంది. ఈ జీవితమూ అలానే సాగిపోతుంది. ఆయనకి కావాల్సిన డబ్బు యిచ్చేసి, మిగతా సగం నాకు పాపకి. శ్రేయోభిలాషులందరికీ ఈ నిర్ణయం సంతోషానిచ్చింది. మీకూ ఆనందమేనా. - మీ పావని.
ఆనందమో, బాధో.. పావని పట్ల సానుభూతితో పావని లాంటి అమ్మాయి ఎంత సంఘర్షణకి లోనయి ఇలాంటి నిర్ణయం తీసుకుందోనన్న ఆలోచన మనసుని కలిచివేసింది కాసేపు.
కానీ, సమాంతర రేఖలైన రైలు పట్టాలు కూడా ఒక పాయింట్ లో కలవక తప్పదు రైలు ప్రయాణించాలంటే.. కలుస్తూ, విడిపోతూ, మళ్లీ కలవడం రైలు పట్టాల నైజంలాగా కొన్నాళ్లు ప్రయాణం సాగితే మనిషిలో ఆవేశాలు, కావేశాలు, ద్వేషాలు తగ్గుమొహం పట్టవచ్చు.. మనసులు కల్సినా, కలవకపోయినా సర్దుబాటు అలవాటయిపోయి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవచ్చు. మనిషి ఆశాజీవి!.. ఆశ మనిషిని బతికిస్తుంది. పావని జీవితంలో ఆటుపోట్లు సర్దుకుంటాయని నా నమ్మకం.
(పత్రిక - దీపావళి - 2006)
* * * * *