Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 3


                                                   ఋణభారం

    ఆఫీసు నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్ లాండ్ లెటర్ తెచ్చినా మందు పడేసింది విసురుగా మా ఆవిడ. ఆవిడ విసురు చూడగానే రాసిందెవరో తెల్సినా, 'ఎవరి దగ్గర నించి ఉత్తరం' అన్నా యధాలాపంగా అన్నట్టు.
    'ఇంకెవరు మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాఖీదు పాతిక వేలకి, యిక్కడ డబ్బుల చెట్లున్నాయనుకుంటుందో, పాతర్లున్నాయను కుంటుందో ఆవిడ. అయినా ఆవిడ్ని అని ఏం లాభం, యిచ్చేవాళ్ళుంటే అడిగే వాళ్లదేం పాపం' రుసరుసలాడుతూ లోపలికి వెళ్లిపోయింది సుగుణ.
    కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీశా. పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని, పిల్ల నచ్చింది. పాతిక వేలు అడిగారు కట్నం అయితేనేం, లాంఛనాలయితేనేం! మరో పాతికేనాలేంది పెళ్లికాదు గదా, పాతిక వేలు నీవు సర్దు, మిగతాది ఏదో తంటాలు పడ్తాను. దీని పెళ్లి అయిపోతే నా బాధ్యతలు తీరిపోతాయి, యింక నిన్ను యిబ్బంది పెట్టే ప్రసక్తి వుండదు. ఎలాగో ఏలోనో పెట్టి నాకీ సాయం చేయాలి అని రాసింది.
    మా ఆవిడకే కాదు నాకూ చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడ నుంచి తీసుకొస్తాను. యిప్పటికి మూడుసార్లు మూడు పాతికలు అయ్యాయి. లోను మాత్రం ఎంతకని యిస్తారు ఆఫీసు వాళ్లు, యిచ్చినా ఆ లోన్లు తీర్చడంలోనే నా బతుకు వెళ్లమారేట్టువుంది. ఈసారి యింక నావల్లకాదు అని రాసేయాలి.
    అక్కయ్య నాకోసం తన జీవితం ధారపోసింది, తల్లిలా పెంచింది. తల్లిలా ఏమిటి. తల్లే అయి పెంచింది. కనగానే అమ్మని పోగొట్టుకుని, రెండేళ్లయినా నిండకముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయి అక్కబావ పెంచారు. అక్కకి తనకి పన్నెండేళ్లు తేడా. అక్క తరువాత రెండు కాన్పులయినా పిల్లలు దక్కలేదుట అమ్మకి. ఆఖరుగా తను పుట్టే వేళకి అక్కకి పన్నెండేళ్లు - పన్నెండేళ్ల పిల్ల సాయంతో తండ్రి తనని పెంచుకుంటూ వుంటే ఆ తండ్రీ లేకుండా పదమూడేళ్లకే ఓ స్కూలు మాష్టరుకిచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు. ఆవు వెంట దూడలా అక్కవెంట తాను వెళ్లే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ.
    అంచేత తన బాధ్యత అక్కది బావది అయింది తన బాధ్యతని వాళ్లెన్నడూ పాపం నిర్లక్ష్యం చేయలేదు పెళ్లయిన మూడేళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టేవరకు ఆ యింటి మొదటి బిడ్డ తనే అనుకున్నారు యిద్దరూ. కలోగంజో వాళ్లతో పాటే! వీలున్నంత వరకు చదివించారు. పల్లెలో వున్న రెండెకరాలు తనని ఎం.కామ్ చదివించడానికి సరిపోయింది. బ్యాంక్ పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ల బాధ్యత తీర్చుకున్నారు. తను పెద్దయ్యే వేళకి అక్కకి ముగ్గురాడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఇద్దరు కూతుళ్ళ తరువాత కొడుకు - కొడుక్కి సరిగా చదువబ్బలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మాన్పించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళని తేవద్దూ అంటూ. తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళీడుకొచ్చింది.
    అక్కబావలకయితే మనసులో చాలా వుండేది, కూతురిని తనకిచ్చి చేయాలని. కాని చిన్నప్పటి నుంచి చేతులతో ఎత్తుకుని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరోలా చూడలేదెప్పుడూ!. నా చెల్లెలనే అనుకున్నాడు తప్ప మేనకోడలని అనుకోలేదు. భార్యగా చూడడం నావల్ల కాదని చెపితే కోపమే వచ్చింది. అక్క బావ అలిగారు. వాళ్లిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్లి నా బాధ్యత అని పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్లని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగడం, అప్పుడూ కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు. ఈ లోగా బావగారు రిటైరయ్యారు. ఇంట్లో అరడజను ట్యూషన్లు. పెన్షనుతో ఏదో విధంగా వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతున్నా, రెండో కూతురి పెళ్లికి కట్నం మాట దేముడెరుగు - పెళ్లి ఖర్చులకి ఓ పది వేలన్నా లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడూ అక్కయ్య పాతికవేలడిగితే మరోసారి కాదనలేని స్థితి. యింట్లో సుగుణ సాధింపు- ఎంత పెంచి పెద్ద చేసినా యిలా తన దగ్గర వేలున్నట్టు అక్కయ్య అడగడం తనకీ మనసులో చికాకు అనిపించినా గట్టిగా కాదనలేక, అక్కయ్యను ఆ పరిస్థితిలో ఆదుకునే వారెవరూ లేరని అర్థం చేసుకుని మళ్లీ ప్రావిడెంట్ ఫండ్ లోంచి అప్పు తీసుకున్నాడు - మొత్తానికి కూతుళ్ళిద్దరి పెళ్లి చేసింది.
    ఈలోగా కొడుకు ఇంటర్ రెండుసార్లు తప్పి యింక చదవనని, డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు. ఈసారి సుగుణకే కాదు నాకూ చిరాకు, కోపం వచ్చింది. ఏమిటి అక్కయ్య ఉద్దేశం, తన దగ్గరేం డబ్బు చెట్టుందని అడుగుతుందా. 'యింటి మీద అప్పు తెచ్చుకోమనండి - ఇక్కడెవరూ రాసులు పోసుకు కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి - పంపిస్తే మాత్రం వూరుకోను. పిల్లల స్కూలు ఫీజులు అవీ ఎంతంత అవుతున్నాయో తెలీదా - మీరు తెచ్చిన అప్పులకే నెలకి రెండు వేలు జీతం కట్ అవుతుందని మర్చిపోకండి. సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియజేసింది.
    నిజమే, యింటి మీద అప్పు తీసుకోవచ్చుగా! తనకెందుకు తట్టలేదు ఆలోచన. ఎంత పాత ఇల్లయినా, పెంకుటిల్లు అయినా ఓ పాతిక వేలు ఎందుకివ్వరు అప్పు అనిపించి ఆ మాటే రాసాను. తన అశక్తత తెలియచేస్తూ యింటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంకు ప్రొసీజరు, అప్లికేషన్ ఫారాల్ని పంపి సలహా యిస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మిపారేయి అని ఉచిత సలహా యిచ్చాను.
    అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏం ఉత్తరం లేదు. నెల తరువాతే శుభలేఖ, పెళ్లికి రావాలంటూ ఉత్తరం వచ్చింది.
    పెళ్లి అయిందనిపించినట్టు జరిగింది. అక్క బావ బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కల్గింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తనెత్తనప్పుడు నేనెందుకు కెలకడం డబ్బివ్వనప్పుడు అని వూరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనపడలేదు. కొడుకు చేత జిరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ల జీవితాలకింక ఢోకా లేదనిపించి నిశ్చింత కలిగింది.
    రెండేళ్ళు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగడం, ట్రాన్స్ ఫర్లు... అక్కయ్యని కలవడమే కుదరలేదు. అక్కయ్యకి షుగర్, బి.పి.లు వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నించి ఉత్తరం వస్తే ఈ మాటు పిల్లలకీ సెలవులు వచ్చినప్పుడు వెళ్లాలనుకున్నాను. కాని ఈలోగానే బావగారినించి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగులేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు, అక్కయ్య చూడాలని వుందన్నట్టు అంటుందని రమ్మని రాశారు. రెండు రోజులు సెలవు పెట్టి వెళ్లాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపులకి నోచుకోకపోయినందుకు బాధపడ్తూ బయలుదేరాను. కర్మకాండ పూర్తి అయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవరు చేతికిచ్చి చదువు అన్నారు. ఏమిటి? 'చదువు నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపేలోగానే ఆస్పత్రి పాలయింది. పిలిచి మాట్లాడాలనుకుంది' ఉత్తరం విప్పాను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS