Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 5


    కాస్త తటపటాయించి వంగి దాన్ని అందుకుని పక్కనే ఉన్న నీటిచెలమలో కడిగి జేబులో వేసుకున్నాను.
    నాకు దొరికింది నిజంగా వజ్రమే అని నా మనసు గట్టిగా చెబుతోంది. దాదాపు కోడిగుడ్డంత పెద్దదిగా వుంది ఆ వజ్రం.
    గుంతకల్లు వెళ్ళగానే అక్కడ ఒక సేఠ్ కి చూపించాను దాన్ని.

    ఆయన దాన్ని నానారకాల పరీక్షలు చేసి పెదవి విరిచాడు. "మహా వస్తే పదివేలు  అంతకు మించి దమ్మిడీ రాదు" అన్నాడు.
    పదివేలు! పదివేలా!
    సంతోషంతో నాకు నోటేంబడీ మాట రాలేదు. గుర్తుంచుకోండి! ఇదీ జరిగింది ఎప్పుడు? ఇరవైయేళ్ళ క్రితం! అంటే నా జీతం డెబ్బయి అయిదు రూపాయలు ఉన్న రోజుల్లో!
    అప్పట్లో పదివేలు!
    మారు మాట్లాడకుండా అతను ఇచ్చిన పదివేలు తీసుకుని వచ్చేశాను.
    ఆ తర్వాత తెలిసింది నాకు. వారం రోజులపాటు ఆ వజ్రం గుంతకల్లులోనే పదిచేతులు మారిందని, ఆ వారం రోజుల్లోనే దానిరేటు పదింతలు పెరిగిందనీను.
    చివరికి దాన్ని బాంబే సేటు ఎవరో పాతిక లక్షలకి కొన్నాడని విన్నాను.
    చూడండి జీవితం ఎట్లా వుంటుందో! వజ్రాలకోసం రాత్రంతా వెదికిన వాళ్ళకు దొరకలేదు. నేచర్ కాల్ కోసం బస్సు దిగిన నాకు దొరికింది. అపురూపమైన వజ్రం! దాని ఖరీదు పాతికలక్షలు. నేను పదివేలకు అమ్ముకున్నాను.
    దీన్నే ఇంకొక రకంగా చెప్పాడు నాకు భేతాళుడు."
    "భేతళుడా!" అన్నాడు ఎడిటరు ఆశ్చర్యంగా.
    కసిగా నవ్వాడు సదానంద్. "ఆ ఉన్నాడులెండి ఒకతను దైవజ్ఞరావు. "సాముద్రికం అండ్ జాతకాల స్పెషలిస్టు మరియూ ఊపాసకులు" అని బోర్డు పెట్టుకుని ఉంటాడు. మా ఊళ్ళో. అతనికి భేతాళుడు అవహిస్తాడని చెప్పుకుంటాడు. అతనికి భేతాళుడు ఆవహించడం ఏమో గానీ ఆ రావు నన్ను అవహించాడు. ఏలిన్నాటి శని ఏడేళ్ళంటారు. అతను నన్ను ఏడు రెళ్ళు పద్నాలుగేళ్ళ పాటు పీక్కుతిన్నాడు."
    "చూడు సదానంద్! పూర్వపు రోజుల్లో రాజు చనిపోతే కొత్త రాజు కోసం వెదకుతూ ఏనుగుకి పూలహారం ఇచ్చి వీదుల్లో తిప్పేవారు. అది హారాన్ని ఎవరి మెడలో వేస్తే వాళ్ళు కొత్త రాజయినట్లన్న మాట ఊరి ప్రజలంతా ఏనుగు ఆ హారాన్ని నా మెడలో వేస్తుంది అంటే నా మెడలో వేస్తుందని ఆరాటపడిపోతుంటే దేశాటన చేస్తూ ఆ రాజ్యానికొచ్చి ఈ వింతను చూస్తూ నిలబడ్డ ఎవరో యువకుడి మెడలో ఏనుగు హారాన్ని వెయ్యడం, ఆ అపరిచిత యువకుడు రాజు కావడం అన్నది మనం కధలుగా వింటుంటాం."
    "నీ నా విషయంలో అచ్చంగా అట్లాగే జరిగింది. వజ్రాల కోసం వెదికిన వాళ్ళకు దిక్కులేదు. నువ్వు రోడ్డుపక్కన నిలబడి నీ పన్లో నువ్వుంటే నీకు దొరికింది వజ్రం. అదీ అదృష్టం అంటే! ఏదీ నీ చెయ్యి చూడనివ్వు."
    "ఆహా! మహర్జాతకం! ఏ రేఖల ప్రకారం ఏ చక్రవర్తి పాతిపెట్టిన ఖజానానో దొరికి తీరాలి. నీకు యోగం ఉంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి అంతే! మొదలెట్టు" అన్నాడు.
    నేను నమ్మేసి అతని వెంట తిరగటం మొదలెట్టాను. నిదులేవీ దొరకలేదు గానీ ఈ పదివేలూ ఖర్చయిపోయాయి. పైగా పిత్రార్జితం రెండెకరాలు కరిగిపోయాయి."
    సదానంద్ వైపు పరిశీలనగా చూశాడు సో! ఇదీ ఒక జూదం లాంటిదే అన్నమాట! జూదంలో పేకాటలో, రేసేస్ లో కూడా అంతే! బిగినర్స్ లక్ అంటారు. మొదట్లో కొద్దో గొప్పో డబ్బు గెలుస్తారు. ఇంక ఆకర్షణలో పడిపోతారు. వచ్చింది పోతుంది. వచ్చిన దానికి పదింతలు కూడా వదులుతుంది కాలం గడిచేకొద్ది.
    అతని విషయంలోనూ అదే జరిగినట్లుంది. పదివేలు దొరికితే పాతికవేలు పోగొట్టుకుని ఉంటాడు. అయినా ఇతనికి బుద్దిలేదా? ఇంకా నిధిగిది అంటాడేమిటి?
    ఎడిటర్ ఆలోచనలు చదివేసినట్లు అన్నాడు సదానంద్. "అంత డబ్బు నష్టపోయాక నాకు బుద్ది వచ్చింది. ఇంక చచ్చినా నిధుల జోలికి పోకూదడనుకున్నాను. కొండచిలువ పుణ్యమా అంటూ పైగా జబ్బు మనిషయిపోయా. ఓపికలేదు. నాకు బ్రహ్మచారీ పరిచయం కాకున్నా బాగుండేది."
    "బ్రహ్మచారీ ఎవరు?"
    "బ్రహ్మచారీ అంటే ఒక విజ్ఞాన సర్వస్వం. అతను రావులాంటి మొనగాడు కాదు. అతనికి దమ్మిడీ డబ్బు అక్కరలేదు. ఇచ్చినా పుచ్చుకోడు కూడా! అతనొక నిత్య సత్యాన్వేషి. అతనికి తెలియని సబ్జక్టు లేదు."
    సదానంద్ పొగడ్తలు విని అసహనంగా చూశాడు ఎడిటరు. ఇతనొక మానియాక్! అందులో సందేహం లేదు. నిధుల పిచ్చిలో నిలువునా పడ్డాడు.
    "బ్రహ్మచారీ దగ్గర శబరినాధుడి శాస్త్రమూ, గుదికట్ల గ్రంధమూ ఉన్నాయి" అన్నాడు సదానంద్.
    "అవేమిటి."
    "మన ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయాలు నిర్మించడానికి , విగ్రహాలు చెక్కడానికి కొన్ని నిర్దేశిక సూత్రాలు ఉన్నాయి. వాటిని ఎవరూ సాధారణంగా అధికమించరు. ఒకవేళ ఎక్కడన్నా ఈ సూత్రాలను అధికమించి శిల్పాలు చెక్కి వుంటే అక్కడొక నిధి నిక్షిప్తమై ఉందని సంకేతం. ఆ వివరాలన్నీ తన శాస్త్రంలో పొందుపరిచాడు శబరినాధుడు."
    "ఆ గ్రంధం మీ దగ్గర ఉందా?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS