Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 6


    "లేదు. కానీ దాని నకలు బ్రహ్మచారీ దగ్గర ఉంది. అలాగే గుడికట్ల గ్రంధం. ప్రాచీనకాలపు రాజులు కొందరు తాము భద్రపరచిన ధనరాశుల గురించి వివరాలు రాసుకుని ఉంచిన గ్రంధం అది. దాని నకలూ, ఇంకొన్ని ప్రాచీన తామ్రపత్రగ్రంధాలు కూడా బ్రహ్మచారీ దగ్గర ఉన్నాయి. నేను చెప్పడం కంటే బ్రహ్మచారీ మాటల్లోనే ఇవన్నీ వింటే బాగుంటుంది."
    "అంటే.........అయన ఇక్కడికి వస్తారా?" అన్నాడు.
    "అయన రాడు. మనమే అయన దగ్గరికి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఇది వినండి. " అని సదానంద్ హ్యాండ్ బ్యాగులో నుంచి ఒక టేప్ రికార్డరుతీసి ఆన్ చేశాడు.
    టేపు తిరుగుతుంటే బ్రహ్మచారీ గొంతు వినబడటం మొదలెట్టింది. శబరినాధుడు శాస్త్రం గురించి, గుడికట్ల గ్రంధం గురించి, ఈ నిధుల అన్వేషణలో ఆకలిదప్పులని హరింపచేసే అతిబల, మహాబల అనే మూలికల గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి బ్రహ్మచారీ మంచినీళ్ళు త్రాగేసినట్లు గడగడ చెబుతుంటే మనసు కేంద్రీకరించి విన్నాడు ఎడిటర్.
    కొద్దిసేపటి తర్వాత టేపు ఆగిపోయింది.
    అప్పుడు సదానంద్ అన్నాడు. "ఈ టేపులో ఉన్న విషయాలు బ్రహ్మచారీకి తెలిసిన విషయాలతో పోల్చి చూస్తే సముద్రంలో కాకిరెట్ట లాంటివి. ఆయనతో మాట్లాడుతుంటే రోజులు నిమిషాల్లా గడిచిపోతాయి. అన్ని విశేషాలు చెబుతాడు కానీ అవి ఉత్త మాటలు కావు. అవన్నీ కూడా మీరు పరీక్ష చేసి నిర్ధారణ చేసుకోగల నిజాలు."
    "ఆ సంగతి మీకు ఎలా తెలుసు?"
    సదానంద్ ఒక్క క్షణం ఆగి అన్నాడు. "బ్రహ్మచారీ చెప్పిన విధంగానే చింతిర్యాల్ కోటలో పెన్నిధి దొరికింది కాబట్టి."
    "ఎవరికి దొరికింది నిధి? మీకా?"
    "నాకు దొరికితే ఇంక లేనిదేముంది?'
    "అసలు జరిగిందేమిటో చెప్పండి."
    "కోదాడకి అరవై కిలోమీటర్ల దూరంలో అడవులమధ్య చింతర్యాల్ కోట వుంది. ఒకవైపు కొండ, రెండోవైపు కోన. కొనలో లోతుగా కృష్టానది నీలంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు కోట ముట్టడి జరిగితే ఆత్మరక్షణ కోసం పారిపోవడానికి వీలుగా అంతఃపురం నుంచి నదీ తీరం దాకా ఒక రహస్య సొరంగ మార్గం త్రవ్వించారు. నదిలో రెండు పడవలు ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండేవి. పారిపోతున్న రాజుకి డబ్బు అవసరం కూడా ఉంటుంది. ఖజానా అంతా తన వెంట తీసుకు వెళ్ళలేరు కాబట్టి నాలుగు కావిడి పెట్టెల నిండా వున్న గడ్డపలుగులంతేసి పొడుగున్న మేలిమి బంగారు కణికేలు నింపిపెట్టి, వాటిని సొరంగం చివరలో భద్రపరిచి ఉంచేవారు. అవసరమైనప్పుడు వాటిని పడవల్లోకి ఎక్కించి వాటితో సహా పారిపోవడమేనన్న మాట!"
    "ఆ కోట తాలూకు చివరి రాజు చనిపోయాక ఆ కోట రంగసాని అనే ఉంపుడుకత్తేకి సంక్రమించిందంటారు. ఆ తర్వాత ఏమయిందో చరిత్రపుటల్లోకి సరిగ్గా ఎక్కలేదు. ఆ నిధి గుప్తంగా అలాగే ఉండిపోయింది.
    దాని రహస్యం బ్రహ్మచారీ కనిపెట్టగలిగాడు. అది నాతొ చెప్పాడు ఇద్దరం చాలా శ్రమపడి , కోతుల గుంపులని తప్పించుకుంటూ అక్కడ తిరిగే ఎలుగుబంట్ల వాతపదకుండా అరణ్యమార్గాన చింతిర్యాల్ కోట చేరుకున్నాం. అక్కడ అంతఃపురం నుంచి సొరంగమార్గం పూడిపోయింది. అతికష్టం మీద చుట్టూ తిరిగివచ్చి సొరంగం తాలూకు రెండో ద్వారం చేరుకున్నాం.
    కానీ సొరంగంలో ఒక ఎలుగోడ్డు నివాసం ఏర్పరుచుకున్నట్లు సూచనగా దుంగలూ, ఆకులూ అలములూ పేర్చివున్నాయి.
    అయినా తెగించి ఇంకొద్దిగా ముందుకు సాగాము.
    మా కళ్ళు చీకటికి అలవాటుపడ్డాక, అక్కడ కటకటాలు కనపడ్డాయి. వాటికి పురాతనమైన తాళంకప్పు ఒకటి వేళ్లాడుతోంది.
    ఆ తాళం తెరిచి లోపలికి వెళ్ళడం ఎంత ప్రయత్నించినా మాకు సాధ్యం కాలేదు.
    పైగా ఏ క్షణంలో నైనా ఎలుగ్గొడ్డు తిరిగి వచ్చేస్తుందన్న భయం ఒకటి వుంది. పైగా కొండచిలువ బారిన పడింది ఈ సందర్భంగానే.
    అందుకని మళ్ళీ ఒకవారం రోజుల తర్వాత ఇంకొక ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకుని అప్పటికి తిరిగి వచ్చేశాము."
    "తర్వాత?"
    "తర్వాత వారం రోజులు తిరగక ముందే ఆర్కియాలజీ దిపార్టుమెంట్ వారు అదే స్థలంలో అన్వేషణ జరిపి ఆ నాలుగు కావిడిపెట్టెల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ కొన్ని కోట్లు ఉంటుందని అంచనా. ఆ సంచలన వార్తా 1985 వ సంవత్సరంలో కొన్ని ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది కూడా!"
    "అలాంటి నిధులు కనీసం ఒక వంద ఉన్నాయని చెబుతారు బ్రహ్మచారీ. అతను చెప్పిన దానికి తిరుగు వుండదు. వాటిల్లో ముఖ్యమైన నిధి ఒకటి వుంది. అది ఉత్త నిధి కాదు పెన్నిధి. నేను ఇప్పుడు ఆస్తి అంతా పోగొట్టుకున్న వాడిని. నా అంతట నేను అడ్వెంచర్ చేసే స్థోమత నాకు ఇప్పుడు లేదు. పైగా ఇది చూశారా! అని లేచి టేబుల్ పక్కకి నడిచి ప్యాంటుని మొకాలిదాకా లాగి చూపించాడు సదానంద్. నరాలని తోడేసేటంత నొప్పి కలిగించే నారికురుపు అతని కాలిమీద సన్నటి వానపాములా పెరిగి వుంది. "అడవుల్లో నీళ్ళు తాగి తాగి వచ్చింది ఈ కురుపు. దానికితోడు మన్యంలో దోమకాటుకి మలేరియా వచ్చింది. జీవచ్చవంలా ఉన్నాను నేను. కాలు కదిపే పరిస్థితిలో కూడా లేదు. అందుకని ఇక పైన ఈ అన్వేషణ భారాన్ని మీరు తీసుకోవాలి. మీరు ఎదుర్కొనే అనుభవాలే నరాలు తెగుపోయెంత సస్పెన్స్ సీరియల్ అవుతాయి" అన్నాడు సదానంద్.
    ఎడిటర్ నిటారుగా కుర్చీలో కూర్చున్నాడు.
    కాసేపు ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతలో సెట్ కి సిద్దమై వున్న పేజీలు  ఫైనల్ చెకప్ కోసం వచ్చాయి. ఒకవైపు వాటిని 'డమ్మీ' లో ఓకె మార్కు వేస్తూనే ఆలోచిస్తున్నాడు. తీవ్రంగా అలోచిస్తునాడు.
    అంతసీపూ పరీక్షించి రిజల్టుకోసం ఎదురుచూస్తున్న విద్యర్ధిలా కూర్చున్నాడు సదానంద్. నిమిషనిమిషానికి అతని ముఖంలో రంగులు మారుతున్నాయి. చివరికి ఎడిటర్ ఏమంటాడో అన్న భయం అతని ముఖంలో ప్రస్పుటమవుతుంది. ఆఖరి పేజీ మార్క్ చేస్తూ "ఓకె" అన్నాడు ఎడిటరు. సబ్ ఎడిటర్ , ఆర్టిస్టు వెళ్ళిపోయారు.
    కర్చీఫ్ తో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ కళ్ళజోడు తీసి తీక్షణంగా సదానంద్ కళ్ళలోకి చూశాడు.
    సదానంద్ కొంచెం అసౌకర్యంగా కదిలాడు.
    "నిజంగానే బంగారం దొరికింది మనకు. అంటే బంగారం లాంటి సబ్జక్ట్ మేటర్ దొరికింది. ఎస్, తప్పకుండా దీన్ని ఫాలో అప్ చేస్తాం."
    సదానంద్ మోహంలో సంతోషం కనబడింది.
    "కానీ ఇది సీరియల్ గా రావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు." అన్నాడు ఎడిటరు.
    "దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఇది మీకు సీరియల్ గా పనికి వస్తుందనిపిస్తేనే మీరు ఈ అడ్వెంచర్ ని స్పాన్సరు చేస్తారు. అది నాకు తెలుసు. ఇకపోతే రెండో కారణం........." అని ఆగి, "ఈ మాత్రం ఊహించలేరా?" అన్నట్లు నవ్వాడు ఎడిటరు వైపు చూస్తూ.
    ఎడిటర్ ది పాదరసం లాంటి మైండు. అతనికి సదానంద్ చెప్పకుండా వదిలేసింది క్షణంలో అర్ధమయిపోయింది. చిరునవ్వు నవ్వి తల పంకించాడు.
    "అవును! అది కరక్టే!" అని "ఉదయార్కర్ పేరు విన్నారా మీరు" అన్నాడు ఎడిటరు.
    "విన్నాను!"
    "మంచి రైటరు అతను. అతను ఈ సబ్జెక్ట్ బాగా  డీల్ చెయ్యగలడని నాకు నమ్మకం ఉంది. అతనికి ఈ అసైన్మెంట్ ఇద్దామనుకుంటున్నాను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS