Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 4


    "ఎడిటర్ జీ! గుర్తుంచుకో ! ఇది ఉత్త బెదిరింపుకాదు. హెచ్చరిక!"
    మౌత్ పీస్ మీద కర్చీఫ్ వేసి మాట్లాడుతున్నట్లు అస్పష్టంగా ఉంది మాట.
    లైన్ కట్ అయిపొయింది.
    ఎడిటరు పెదిమలు బిగుసుకున్నాయి. చెయిర్లో నిటారుగా కూర్చుని కొద్దిక్షణాలు ఆలోచింది , బజర్ నొక్కాడు.
    వెంటనే వచ్చాడు పీయే.
    "చూడండి! నన్ను ఏదో చేసేస్తామని మరో బెదిరింపు. దీన్ని థెటేనింగ్స్ ఫైల్లో నోట్ చేసి ఉంచండి."
    అ తర్వాత "ఇతనికి............ఇతని పేరేమిటి?" అని అడ్రసు చూసి, "సదానంద్ ! ఎస్........ఈ సదానంద్ ని ఒకసారి అర్జంటుగా రమ్మని కబురుపెట్టండి" అన్నాడు ఎడిటరు.


                                  2

    సదానంద్ లోపలికి వచ్చి విష్ చేశాడు.
    "కూర్చోండి" అన్నాడు ఎడిటరు.
    "మీకు ఇందులో నమ్మకం కలుగుతుందని నాకు మొదటి నుంచి నమ్మకం వుంది." అన్నాడు సదానంద్. అతని మోహంలో తృప్తి కనబడుతోంది.
    "నాకు అప్పుడే నమ్మకం కుదిరిందని మీరెందుకనుకుంటున్నారు! నో! నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు. బట్ అట్ ద సేమే టైం, ఐ వాంట్ టూ నో నాట్ దిసీజ్ అల్ అబౌట్! చెప్పండి!" అన్నాడు ఎడిటరు. అంతేగానీ అతను తనకు వచ్చిన టెలిఫోన్ బెదిరింపు గురించి చెప్పలేదు.
    "ఇరవై ఏళ్ళ క్రితం జరిగింది ఇది!" అన్నాడు సదానంద్, అప్రయత్నంగా తన ఫుల్ స్లీవ్స్ షర్టు చేతులు పైకి లాక్కుంటూ ఏదైనా సీరియస్ గా చెప్పేటప్పుడు షర్టు చేతులు పైకి మడవడం అతనికి అలవాటు.
    అతని చేతుల వైపు చూసిన ఎడిటర్ ఉలిక్కిపడ్డాడు.
    సదానంద్ చేతుల మీది చర్మం పాము చర్మంలా పొలుసులు పొలుసులుగా ఉంది. పాము పొడల్లాంటి పొదలు అతని చేతిమీద స్పష్టంగా కనబడుతున్నాయి.
    ఎడిటర్ తన చేతులను చూస్తూ ఉండడం గమనించాడు సదానంద్ . కంగారుపడ్డాడు.
    దిగులుగా నవ్వి అన్నాడు. "దాదాపు ఇరవయ్యేళ్ళ నుంచి అడవుల్లో తిరుగుతున్నాను కదా! ఒకసారి నేనూ బ్రహ్మచారీ కలిసి శ్రీకాకుళంలో పోతున్నప్పుడు ఒక ప్రమాదకరమైన స్థితిలో పడ్డాం. బ్రహ్మచారీకి చకచకనడవడం అలవాటు. నేను వెనుకబడిపోయాను. 'బ్రహ్మచారి' అని పిలిచాను ఎలుగెత్తి. బ్రహ్మచారీ బదులు పలికాడు 'ఓయ్' అని. అది బ్రహ్మచారీ గొంతు కాదని, అది కొండచిలువ బుస అని నేను గ్రహించలేదు. నేను దగ్గిరకెళ్ళిపోయాను. అప్పటికే నోరు గుహలా తెరిచి బ్రహ్మచారీ మీద పడి అతన్ని చుట్టేసి ఎముకలు విరిచెయ్యడానికి సిద్దంగా ఉంది ఒక కొండచిలువ. నేను ముందూ వెనుక ఆలోచించకుండా పెద్ద బండనేత్తి దానినేత్తి మీద వేశాను. దెబ్బకి తలచితికి పచ్చడి అయిపొయింది. అయితే ఆ కొండచిలువ శాపం నాకు తాకింది. అప్పటినుంచి నా చర్మం ఇలా అయిపొయింది. ఏం చేస్తాం! భర్మ!" అని నిట్టూర్చాడు.
    "ఇదంతా నమ్మదగ్గదేనా?" అన్నట్లు అనుమానంగా చూశాడు ఎడిటర్.
    "ఇంతకీ యిరవై ఏళ్ళ క్రితం ఏం జరిగింది మీకు?'
    "ఆ విషయంలోకే వస్తున్నాను. ఇరవైయేళ్ళ క్రితం నేను గుంతకల్లు నుంచి వజ్రకరూరు మీదగా వెళ్ళే ఒక బస్సు రూటులో కండక్టరుగా పనిచేస్తూ ఉండేవాడిని. వజ్రకరూరు పేరు విన్నారా మీరు?"
    "విన్నాను."
    "అక్కడ వజ్రాలు దొరుకుతాయని తెలుసా?"
    "చెప్పండి!"
    "వజ్రకరూరులో వర్షం పడి వెలిసిన తరువాత చిన్న చిన్న వజ్రాలు నేలమీదే దొరకడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. యిక పౌర్ణమినాడు రాత్రిపూట అయితే గుంపులకొద్ది జనం ఊరి బయటకు వెళ్ళి, అక్కడ ఆరుబయట ప్రదేశంలో వజ్రాలకోసం వేట సాగించడం ఇదివరకు ఆనవాయితీగా వుండేది. వెన్నెల వెలుగులో వజ్రాలని తేలికగా గుర్తుపట్ట వచ్చని వాళ్ళ నమ్మకం.
    చీకటి పడీపడకుండానే చాలామంది జనం ఫ్లాస్కులతో టీ, కాఫీలు తీసుకుని ఊరి బయటకి వెళ్ళేవారు.
    ఆ వెన్నెల వెలుగులో ప్రతి గులకరాయి ఒక అపురూపమైన వజ్రంలా దగద్ధయమానంగా మెరుస్తూ భ్రమ కలిగిస్తుంది.
    "అదిగో వజ్రం!" అని ఎక్స్ యిట్ మెంట్ తో వళ్ళు మరిచిపోయి అరిచేవాడేవరో.
    వెంటనే పదిమంది ఒక్కళ్ళనొకళ్ళు తోసుకుంటూ వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవడానికి పెనుగులాడే వాళ్ళు.
    ఇంతా చేస్తే అది వెన్నెల్లో మెరుస్తున్న చెకుముకి రాయి అయి వుండేది.
    తెల్లారేక ఎవరికి వాళ్ళు తమకి దొరికిన రాళ్ళు పట్టుకుని గుంతకల్లు వెళ్ళేవాళ్ళు. వాటిని అక్కడి వర్తకులకి చూపించేవాళ్ళు.
    ఆ వర్తకులు వాటిని పరిశీలించి అవి ఎందుకు పనికిరాని గులకరాళ్లో, గాజుపెంకులో అని తేల్చేవాళ్ళు.
    చాలా అరుదుగా ఆ రాళ్ళలో ఒకటీ అరా అసలు సిసలయిన వజ్రాలు అయివుండేవి. అయినకాడికి వాటిని అక్కడే అమ్మేసుకునే వాళ్ళు అవి దొరికిన మనుషులు. ఒకసారి ఒక లంబాడీ నాయక్ కి  దొరికింది ఒక అపూరూపమైన వజ్రం. దాని విలువ చాలా లక్షలలో ఉంటుందని అంచనా కట్టారు. ఆ తర్వాత.........."
    "అతను లక్షాధికారి అయిపోయాడా?"
    "లేదు! ఆ వజ్రం చేతులు మారడంలో గల్లంతు అయిందని చివరికి దాని ప్లేస్ లోకి ఒక గాజు ముక్క వచ్చిందని చెప్పుకున్నారు ఆ మధ్య. కానీ చాలా పెద్ద వజ్రం ఆ నాయక్ కి దొరకడం మాత్రం నిజం. అది చాలా మందికి తెలుసు.
    అలాంటి వజ్రమే నాక్కూడా దొరికింది."
    "మీకా?" అన్నాడు ఎడిటర్ అతన్ని ఎగాదిగా చూసి. "మీరూ వజ్రాల వేటకు వెళ్ళారా?"
    సదానంద్ నవ్వాడు. "వెళ్ళలేదు. ఆ వజ్రం నాకు చాలా వింత గొలిపే పరిస్థితిలో దొరొకింది."
    "చెప్పండి."
    "ఆరోజు కూడా పౌర్ణమి. అది మా బస్సుకి ఆఖరు ట్రిప్పు. చాలా డిస్సిపోయి వున్నాను నేను. వజ్రకరూరు సమీపించాం. అక్కడ జనం అంతా వెర్రెత్తినట్టు వజ్రాలకోసం వెదుకుతున్నారు.
    అక్కడ మా బస్సు అపవలసి వచ్చింది."
    "ఎందుకు!"
    సదానంద్ కొంచెం యిబ్బందిగా కదిలి సంకోచంగా అన్నాడు "నేచర్ కాల్! లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది నేను. బస్సు రోడ్డు ప్రక్కన ఆగింది. నేను దిగి ఒక చెట్టు చాటున నిలబడి యూరిన్ పాస్ చేస్తున్నాను. వజ్రాల కోసం వెతుకుతున్న వాళ్ళ గొంతులు ఆ ఆరుబయట ప్రదేశంలో దూరం నుంచి కూడా స్పష్టంగా , ఎగ్జయిటేడ్ గ వినబడుతున్నాయి.
    వాళ్ళ తాపత్రయం చూసి నవ్వుకున్నాను నేను. ఫాంట్ బటన్స్ పెట్టుకుంటూ యధాలాపంగా కిందికి చూస్తే -------
    అక్కడ తడిలో మట్టి చెదిరిపోయి ఏదో ధగధగ మెరుస్తూ కనబడింది. 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS