Previous Page Next Page 
వ్యూహం పేజి 3


    "నీకేం చెప్పినా, ప్రైవేట్ క్లాసు లాగానే వుంటుందిరా... తిక్కల సచ్చినోడా... ఇప్పుడు కాదు... నేను చచ్చాగ్గానీ, నేనెందుకు చెపుతున్నానో నీకు అర్థం అయ్యి చావదు..." కోపంగా అంది లక్ష్మీదేవి.

 

    "అమ్మా... కాస్త ఆ సెంటిమెంట్ ట్రాక్ ఆపుతావా... నాకెలాంటి డ్రీమొచ్చిందో చెబితే నువ్వెంత ఆనందపడతావో- నేను న్యూయార్క్ నుంచి ప్లయిట్ లో దిగుతా... ప్రయిమినిస్టరూ, సి.ఎమ్. గవర్నర్, దిగ్రేట్ అమితాబచ్చన్, రాజేష్ ఖన్నా, టాటాస్, బిర్లాస్... మర్చిపోయాను రేఖ కూడా వచ్చినట్లు గుర్తు. ఆయనతో మాట్లాడుదాం అనేలోపు నువ్వు లేపేసావు."

 

    "పదిగంటలు పడుకున్నావు కదా- పెద్దకలే వచ్చింది.... నేనూ, మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని తేవటం... నువ్వు బలాదూర్ గా తిరగటం- లేకపోతే కుంభకర్ణుడిలా నిద్రపోవటం సిగ్గెయ్యటం లేదురా? నీ ఈడువాళ్ళు చూడ్రా హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన కరణంగారి కొడుకూ, కూతురూ చూడ్రా, ఇద్దరికీ బ్యాంకులో ఉద్యోగాలొచ్చాయట."

 

    "ఎందుకు రావూ... పరీక్షలు పాసయ్యారు కాబట్టి... టెస్టులు రాసారు... వాళ్ళ నాన్న లంచాలిచ్చాడు. నాకు బి.కామ్. పోయింది కదా..... బి.కామ్. పోయినోళ్ళని బ్యాంకుల్లో తీసుకోరమ్మా...."

 

    "మళ్ళీ కట్టి చదవమని నెత్తీ నోరూ బాదుకుంటే.... వినవు కదా..."

 

    "మళ్ళీ కట్టాలి. మళ్ళీ చదవాలి. మళ్ళీ పరీక్షలు రాయాలి. నీకో సీక్రెట్ చెప్పనా... అందరూ చక్కగా పరీక్షలు రాసే పాసుకారమ్మా... దానికి వేరే మార్గాలున్నాయి. ప్రస్తుత విద్యావ్యవస్థ పూర్తిగా పుచ్చి పోయిందమ్మా... నువ్వు కానీ, నేను కానీ, మహాపండితుడు, కీర్తిశేషుడు సర్వేపల్లిగారు వచ్చినా బాగుచెయ్యలేరు...."

 

    ఒబెరాయ్ హోటల్స్ ఓనర్ మోహన్ సింగ్ ఓబెరాయ్ ఏం చదివాడు? కోట్లు సంపాదించే మార్వాడీలు మొదటితరం వాళ్ళు ఏం చదివారు? సామ్ ఛీరో హోండా ఏం చదివాడు? ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చదివాడు? ఆలపాటి రామచంద్రరావు ఏం చదివాడు? దేసు వెంకట సుబ్బారావు ఏ కాలేజీకి వెళ్ళాడు? పైకి వెళ్లటానికీ, సంపాదించటానికీ చదువు అక్కర్లేదని వాళ్ళని చూసి నేర్చుకోకపోతే ఎలా? పాసయితే మటుకి జోడి బి.కాం. ఏం సంపాదించి పెడుతుంది? దిక్కుమాలిన బ్యాంకు ఉద్యోగాలు ఏం ఉద్దరిష్టాయి... బ్రతకలేక బడిపంతులు చేసే నీకు ఇవన్నీ తెలీవులే-" సీరియస్ గా అన్నాడు శక్తి!

 

    "నిజమే... వాళ్ళు నీలాగే తప్పటం మూలంగా పైకి రాలేదు. చదువుకునే అవకాశం, చదివించేవాళ్ళు లేక వాళ్ళు చదువుకోలేక పోయారు. చదువు, డిగ్రీలు లేవని కృంగిపోకుండా రాత్రింబవళ్ళు శ్రమించి పైకొచ్చారు. లేనప్పుడు ఎలాగూ తప్పదు. కాని నిన్ను చదివించటానికి మేం బతికే ఉన్నాం గదా? మా బాధలేవో మేం పడుతున్నాం గదా... చదువుకోటానికేం మాయరోగం- అదేమంటే నాకు చదువురాదు నాన్నగారు అంటూ తప్పించుకుంటావ్- కాళ్ళు ఇరగ్గొడితే ఎందుకు రాదు- పైగా ఉపన్యాసాలొకటి... చెయ్యాలంటే గవర్నమెంట్ ఉద్యోగమే చెయ్యాలా... స్వంతంగా ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా...." మళ్ళీ అందావిడ.    

 

    "చూసుకోవచ్చుగా... ఎంత ఈజీగా చెప్పేసావమ్మా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ లాగా- చూడమ్మా... ఏది చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో మన చేతుల్లో ఏమీలేదు. అంతా అదృష్టం... అదృష్టం నేరుగా బాటా బూట్లేసుకొని నడిచొచ్చి, నా మంచమ్మీద కూర్చున్నవాడు, నన్నెవరూ పట్టలేరు... చూడు అలాగే చూస్తూ వుండు... నేనెంత ఎత్తుకు ఎదిగిపోతానో..." గోడ కొక్కానికి తగిలించిన బనీను వేసుకుంటూ అన్నాడు శక్తి.

 

    "తెలివైన వాడెవడూ అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోడురా... తన ప్రయత్నం తాను చేస్తాడు... సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది.

 

    "ఉద్యమేనహి సిద్ధ్యాంతి, కార్యాణిన మనోరధైః
    నహిసుప్తస్య సింహస్య, ప్రవిశంతి ముఖేమృగాః - అంటే అర్థం తెలుసా? కేవలం అనుకోవటం వల్ల పనులు జరగవు. ప్రస్తుతం చేయాలి. ఎంత గొప్ప సింహమైనా దానికి ఆకలివేస్తే వేటకు వెళ్ళి వేటాడాలి తప్ప మృగాలు దాని నోటి దగ్గరకు రావని అర్థం...."

 

    "ప్రైవేట్ క్లాసు ఆపు" అంటూ గోడ గడియారం వైపు చూసాడు.

 

    "అయ్యబాబోయ్... ఆరయిపోయిందే" అనుకుంటూ నుయ్యి దగ్గరకు వెళ్ళాడు ముఖం కడుక్కోటానికి.

 

    ఐదు నిమిషాల తర్వాత లోనికొచ్చి గబగబా తయారయిపోయాడు.

 

    "ఎటు... లైబ్రరీకా- సిన్మాహాలు దగ్గరకా?"

 

    తల్లి మాటకు జవాబు చెప్పాలా అన్నట్లు చూశాడు శక్తి.

 

    "నీకసలు బాధ్యత తెలీకుండా పోతుందిరా.... నువ్వు మీ నాన్నను కానీ, చెల్లెల్ని కానీ, నన్ను కానీ, పోషించనక్కరలేదురా.... నీ మటుకు నువ్వయినా బ్రతికే దారి చూసుకో... నాన్నగారు కిరాణా షాపులో చూస్తానన్నారు కదా... వెళ్ళి రేపట్నుంచి చేరు.... మా నాయన కదా..." కాఫీ గ్లాసుతో వచ్చి అందావిడ.

 

    "ఆ మాటకు అంతెత్తున లేచాడు శక్తి.

 

    "కిరాణా కొట్టులో చేరాలా? అంతకంటే మరేం దొరకలేదా? సిన్మాహాల్లో సైకిల్ స్టాండ్ ఉంది అక్కడ నిలబడమంటావా? నువ్వు ఎలిమెంట్రీ స్కూల్ టీచర్ వి- మీనాన్న రిటైరైన మున్సిపాలిటీ గుమాస్తా అంచేత మీ బుద్ధులు అలాగే ఉంటాయి. ఇంకెపుడూ నాకలాంటి సలహాలు ఇవ్వకు... నేను గొప్పోడిని అవుతానని నాకు తెలుసు. ఎప్పుడు అవుతానో నాకు తెలీదు కాబట్టి మీ దగ్గరిలా వెర్రి వెధవలా ఉంటున్నాను... మరోసారి చెబుతున్నాను. ఈసారి ఇలాంటి వెర్రి మొర్రి సలహాలు ఇచ్చావంటే చూడు.... ఏం చేస్తానో... ఇల్లొదిలి పోతాను...." ఖాళీగ్లాసు ఆవిడ చేతిలో పెట్టి విసురుగా ఇంట్లోంచి బైటకు వెళ్ళాడు.

 

    కొడుకు జవాబుకి బిక్కచచ్చి పోయిందావిడ.

 

    లక్ష్మీదేవికి అపుడో విషయం జ్ఞాపకం వచ్చింది.

 

    "ఒరేయ్- శక్తీ"

 

    ఆ పిలుపుకు ఏమిటన్నట్లు తలత్రిప్పి చూసాడు శక్తి.

 

    "శారద ఇంకా ట్యూషన్ నుంచి రాలేదు... చీకటి పడుతోంది. దగ్గరుండి తీసుకురా..."

 

    "ఇంతసేపూ ట్యూషనేనా... ఏం చదువుతుందది- నీ బాధ, నాన్న బాధ పడలేక చదువుతుందది- చూడు- అలా చదివీ... చదివీ మొద్దయి పోతుంది."

 

    "చెల్లెకి శాపనార్థాలు పెట్టే అన్నయ్యను నిన్నే చూసానురా వెధవ సచ్చినోడా- వెళ్లు... వెళ్ళి దాన్ని తీసుకురా" లోలోపల నవ్వుకుంటూ అంది లక్ష్మీదేవి.

 

    తలూపుకుంటూ బైటకు వెళ్ళాడు శక్తి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS