Previous Page Next Page 
వ్యూహం పేజి 2


    "స్పెషల్ ఫ్లయిట్ వచ్చేసింది సార్... ఆయన దారిలో ఉన్నారు సర్..."

 

    వెంటనే ఆ వార్త రాష్ట్రపతికి తెలియచేసారు ముఖ్యమంత్రి. రాష్ట్రపతి చిరునవ్వు నవ్వారు.

 

    ఐదు నిమిషాల తర్వాత-

 

    నిజాం ప్యాలెస్ గ్రౌండ్స్ ముందు యాభై మెర్సిడస్ బెంజ్ కార్లు ఆగాయి. అందులోని సిల్వర్ కలర్ కారు దగ్గరకు ఇరవైమంది స్పెషల్ సెక్యూరిటీ గార్డులు పరిగెత్తారు.

 

    ఓ ఐ.జీ. కార్ డోర్ తెరిచాడు.

 

    అందులోంచి-

 

    దిగిన యువకునికి పాతికేళ్ళుంటాయి. మనిషి దృఢంగా, బలంగా, పొడవుగా వున్నాడు.

 

    తామరపువ్వుల్లాంటి మెరిసే కళ్ళు... విశాలమైన నుదురు...

 

    నేవీ బ్లూరంగు సూట్ లో ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా వున్నాడా యువకుడు.

 

    లక్షలాది యువకుల ఆశలకు, ఆకాంక్షలకు, నిదర్శనంలా ఉన్నాడా యువకుడు.

 

    దారికి అటూ ఇటూ ఉన్న పోలీసులు భయభక్తులతో సెల్యూట్ చేస్తున్నారు.

 

    మధ్యలో ఠీవిగా పెద్ద పెద్ద అంగలతో నడుస్తున్నాడతను.

 

    గవర్నర్, ముఖ్యమంత్రి ఎదురొచ్చారు.

 

    వారిని చూసి చిర్నవ్వు నవ్వాడా యువకుడు.

 

    "రండి..." స్వాగతం పలికారు వాళ్లు.

 

    రెండు చేతులతో నమస్కరిస్తూ వేదికను ఎక్కిన ఆ యువకుడు రాష్ట్రపతికి ముందుగా నమస్కరించి-

 

    ఆ తర్వాత-

 

    వేదిక మీద నున్న అందరివైపు చూస్తూ నమస్కారం పెట్టాడు.

 

    ఆ యువకుని చూడగానే అమితాబచ్చన్ ప్రత్యేకంగా లేచొచ్చి కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు.

 

    కార్యక్రమం మొదలయ్యింది.

 

    "భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ యువ పారిశ్రామికవేత్తలకు అవార్డు ఇస్తున్న విషయం మీకు తెలుసు. ఈ ఏడాది అతి తక్కువ సమయంలో భారత పారిశ్రామిక రంగంలో పెను మార్పులకు పరోక్షంగా కారకుడయి, మనదేశ ఆర్థిక రంగంలో అనూహ్య పరిణామాలకు, తద్వారా అభివృద్ధికి ఎంతో కృషిచేసిన యువ పారిశ్రామికవేత్త శ్రీ శక్తిధర్ గారికి ఉత్తమ పారిశ్రామిక రత్న అవార్డును ఇప్పుడు రాష్ట్రపతి ప్రధానం చేస్తారు. ప్రతి ఏటా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ ఫంక్షన్ ఈ ఏడాది శ్రీ శక్తిధర్ సాధించిన విజయానికి ఆయనున్న హైద్రాబాద్ కే రాష్ట్రపతి వచ్చి ఈ అవార్డును స్వయంగా అందించటం విశేషం."

 

    రాష్ట్రపతి లేచి నిలబడ్డారు.

 

    శక్తిధర్ లేచి రాష్ట్రపతివేపు నడిచాడు. నైజాంగ్రౌండ్స్ చప్పట్ల హోరుతో మునిగిపోయింది. ప్రక్కనున్న అధికారి అందించిన బంగారు పతకాన్ని అందుకొని శక్తిధర్ మెడలో వేసి ప్రత్యేకంగా తయారుచేసిన మెమెంటోను చేతికి అందించారు.

 

    శక్తిధర్ రాష్ట్రపతితో కరచాలనం చేసి-

 

    "థాంక్యూ సార్" అన్నాడు.

 

    "మీలాంటి యువ పారిశ్రామికవేత్తలే దేశాన్ని ముందుకు నడిపించాలి... మీ వంతు కృషి చేయండి... చేస్తారనే నా నమ్మకం..." అంటూ రాష్ట్రపతి వెనక్కు వెళ్ళిపోయి తన ఉచితాసనం మీద కూర్చున్నారు.

 

    శక్తిధర్!

 

    భూగోళం మీద కుడికాలు వేసి నిలబడిన విశ్వవిజేతలా ఉన్నాడు. తన అపారమయిన స్వశక్తితో ప్రపంచాన్ని మార్చటానికి సిద్ధంగా వున్న మానవ నేతలా వున్నాడు. లక్షల చేతుల చప్పట్లతో నిజాం ప్యాలెస్ గ్రౌండ్స్ దద్ధరిల్లి పోయింది. చిరునవ్వుతో మైకు ముందుకు నడిచాడతను.

 

    భారతదేశపు ఆశాజ్యోతిలా వస్తున్న శక్తిధర్ ను చూసి ఆదిత్య, బిర్లా, రతన్ టాటా చిర్నవ్వు నవ్వారు.

 

    ప్రేక్షకుల్లో వి.ఐ.పీ. వరసల్లో కూర్చొన్న రేఖ, పక్కనున్న ఎం.పీ. రాజేష్ ఖన్నా వేపు చూసి నవ్వింది. శక్తిధర్ మాట్లాడటానికి సిద్ధంగా వున్నాడు.   

 

    తను సాధించిన విజయానికి, పొందిన అత్యుత్తమమైన అవార్డుకి ఊహించని సంతోషంతో పొంగిపోతున్నాడు శక్తిధర్.

 

    స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.

 

    విద్యుద్దీపాల వెలుగులో లక్షలాది జనం అతని మాటల కోసం ఎదురు చూస్తున్నారు.

 

    శక్తిధర్ కళ్ళల్లో కన్నీళ్ళు!

 

    ఆ కన్నీళ్ళు శక్తిధర్ సాధించిన సక్సెస్ కు వాకిళ్ళు! మేధస్సుకు పరవళ్ళు! సంతోషపు దుఃఖంవల్ల అతని గొంతు గద్గదమై పోయింది.

 

    అతనేం మాట్లాడలేక పోతున్నాడు. గొంతులోంచి ఒక్క ముక్క పెగిలి రావటం లేదు.

 

    అంతలో ఏదో ఉలికిపాటు...

 

    "ఓరేయ్... శక్తీ... శక్తీ...." పిర్రమీద చుర్రుమనటంతో ముసుగుతీసాడు శక్తి. ఒక్కక్షణం ఏమీ అర్థంకాని పరిస్థితి. తను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?

 

    అతనెదురుగా ఎవరు నిలబడ్డారో, ఏమిటో కూడా అర్థం కావటం లేదు. గబుక్కున గట్టిగా కళ్ళు నులుముకున్నాడు.

 

    "ఏమిట్రా శక్తీ... పట్టపగలు ఏమిటా నిద్ర. నేను స్కూలుకు వెళ్ళినప్పుడు ముసుగేసిన వాడివి... ఇప్పటి వరకూ ఏమిట్రా నిద్ర... ఇపుడు టైం ఎంతయ్యిందో తెలుసా...."

 

    తల్లి లక్ష్మీదేవి కూరగాయాల సంచిని వంటింట్లో పెడుతూ అంది పెద్దగా.

 

    "ఏంటమ్మా... మంచి కలను పాడు చేసావు. నువ్వెప్పుడూ ఇంతే. పడుకోనివ్వవు.... కూర్చోనివ్వవు. ఎంత మంచి కలొచ్చిందో తెల్సా?" విసుక్కుంటూ అన్నాడు శక్తి.

 

    "తినటం... తీరుబడిగా కలలు కనటం... పిచ్చి సచ్చినోడా... ఎన్నిసార్లు తిట్టినా సిగ్గులేదు కదరా... నీకు చెప్పినా ఆ మొండి చెట్టుకు చెప్పినా ఒకటే" డబ్బాలోంచి చేటలోకి బియ్యం తీస్తూ అందావిడ.

 

    "మొదలుపెట్టావా... స్కూల్లో పాఠాలు చెప్పావు కదా... మళ్ళీ ఇక్కడ ప్రయివేట్ క్లాసులెందుకమ్మా... అలిసిపోతావు" అన్నాడు శక్తి ఒకింత అసహనంగా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS