Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3


    రామునిది ఒకే పత్ని, ఒకే మాట, ఒకే బాణం!

    సీతారాములది ఆదర్శ దాంపత్యం, "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా" అంటుంది సీత. సీతారాములు అన్యులు కారు - అనన్యులు. రామాయణంలో వారు సుఖించిన జాడలేదు. అయినా అందరూ సీతారాముల వంటి దాంపత్యాన్నే కోరుకుంటారు.

    స్త్రీకైనా పురుషునికైనా అనుకూల దాంపత్యం ఒక వరం. కలసి ఉన్న దంపతులు కష్టాలను లెక్కచేయరు. ఆనందం సంపదలో లేదు! అనన్యత్వంలో ఉంది!! సుఖ దుఃఖాలు సాపేక్షములు. కలసి నవ్వడంలో ఎంత ఆనందం ఉందో - కలసి ఏడవడంలోనూ అంత ఆనందం ఉంది!

    అద్వైతం సుఖదుఃఖయో, రనుగతం సర్వా స్వవస్థాసు య
    ద్విశ్రామో హృదయస్య యాత్ర, జరపా యస్మిన్న హార్యోరసః
    కాలే నావరణాత్యయా త్పరిణతే యత్స్నేహ సారేస్థితం.
    భద్రం తత్ర సుమానుషస్య కథమప్యే కం హి తత్ప్రార్థ్యతే.

    భవభూతి ఉత్తరరామచరిత నాటకం 1 -32

    అనుకూలదాంపత్యం వివరిస్తున్నాడు:-

    సుఖ, దుఃఖాలకు అద్వైతం అంటే ఒకళ్లవలెనే అనుభవించడం. అన్ని దశల్లోనూ కలసిసాగడం. హృదయానికి విశ్రాంతి, మనశ్శాంతి. వార్ధక్యం వచ్చినా అదే వలపు, అదే ప్రేమ. కాలం నడుస్తుంటే ప్రేమ పడుతుంది. స్నేహం స్థిరంగా ఉంటుంది. ఆ జీవితం భద్రతమం. అలాంటి దాంపత్యం ఆశించని వాడు ఎవడు?

    ఏవం వర్ష సహస్రాణాం శతంవాహం త్వయాసహ
    వ్యతిక్రమం నవేత్స్యామి స్వర్గోపి నహి మే మతః

    వనవాసం గురించి సీత రామునితో అంటున్నది:-

    అలా అడవుల్లో నీతో కూడి వందల, వేల సంవత్సరాలుఉంటాను. స్వర్గం కూడా నాకు అక్కరలేదు. నీవు లేక ఉండలేను.

    నాకు పన్నెండేళ్లు, కమలకు ఏడేళ్లున్నప్పుడు 1939లో మాకు పెళ్లి అయింది. మా కష్టాలను నా ఆత్మకథ 'జీవనయానం' లో వివరించాను. ఆ గ్రంథాన్ని కష్టాల్లో/కల్లోలాల్లో/కన్నీళ్లలో కలసిసాగుతున్న కమలకు అంకితం ఇచ్చాను.

    హిందూ వివాహం తప్ప అన్య మతాల వివాహాలు కాంట్రాక్టులు మాత్రమే. హిందూ వివాహం పవిత్ర బంధం. దాన్ని మృత్యువు సహితం విడదీయలేదు. అది ఏడేడు జన్మల బంధం. నూరేళ్ల పంట!

    ఎంతటి సమాజంలో నైనా కుటుంబానిదే అగ్రస్థానం. కుటుంబమే సమాజానికి మూల కారణం. వేదం సుఖమయ, శాంతిమయ కుటుంబానికి బాటలు పరచింది. ఒక్క స్త్రీ మాత్రమే కాదు సంసార రథానికి స్త్రీపురుషులు రెండు చక్రాలు.

    అనుకూల దాంపత్యం సమాజానికి మూల స్తంభం.

    5. సత్యవాది

    సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మం ప్రతిష్ఠితం.

    ఈ లోకంలో సత్యమే భగవంతుడు. సత్యం మీదనే ధర్మం ఆధారపడి ఉంది.

    సత్యం అంటే నిజం చెప్పడం మాత్రమే కాదు. కాని సమాజ జీవితం చాల వరకు నిజం మీదనే ఆధారపడి ఉంది. ప్రభుత్వ, న్యాయ యంత్రాంగం సాంతం నిజం చెప్పించడానికే ఏర్పడింది. దురదృష్టం ఏమంటే ఈ యంత్రాంగం సాంతం అబద్ధం మీదనే ఆధారపడి ఉంది! కార్య నిర్వహణ నిజం చెప్పదు. న్యాయం నిజం చెప్పదు. శాసనం నిజం చెప్పదు. వీరు నిజం చెప్పించడానికి ఏర్పడ్డారు!

    ఒక హత్య జరిగింది. ఒక దోపిడీ జరిగింది. ఒక ఎన్నిక జరిగింది. ఒక న్యాయ విచారణ జరిగింది. వీటి అన్నింటిలో అబద్ధాల సాక్ష్యాలే! ఎవడూ నిజం చెప్పడు. ఈ సమాజం అసత్యాల మీద ఆధారపడి ఉంది.

    మన రాజ్యాంగమే అబద్ధంగా ఉంది!

    రాజ్యాంగంలో భారత్ Sovereign Democratic Republic - Socialist Secular అని ఉంది.

    మనం ఎంత వరకూ సావరిన్, ఎంతవరకు సెక్యులర్, ఎంతవరకు సోషలిస్టో గ్రహించండి.

    ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాల్లో ఇసుమంత నిజం లేదు.

    నిజం చెప్పమనండి ఈ వ్యవస్థ పేక మేడలా కూలుతుంది.

    నిజానికి ఈ సమాజంలో విలువ లేదు. ఒకహంతకుడు హత్య చేశాననీ, ఒక దొంగ దొంగిలించానని నిజం చెప్పినా న్యాయ వ్యవస్థ అంగీకరించదు. అతడు సాక్ష్యాధారాలతో నిరూపించాలి!

    ఒక ఆదర్శ సమాజాన్ని అవలోకిద్దాం. అందరూ నిజం చెప్పారను కొండి. ఈ వ్యవస్థ సాంతం వృథా అవుతుంది. వ్యర్థం అవుతుంది. పోలీసు వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు పని ఉండదు. రాజకీయులూ నిజం చెపుతారు! నిజాయితీ గల వారే ఎన్నిక అవుతారు! ఇది ఆదర్శం! ఒక స్వప్నం!!

    ఒక్క 'నిజం' అనే పదం ఈ వ్యవస్థలో చేరితే ఎంత నిజాయితీ, నిష్కల్మషము, స్వచ్చము, మానవీయ మైన సమాజం వెలుగొందుతుంది?

    అయితే అంతా అబద్ధం చెపుతున్నారా? అట్లయితే నిత్య జీవితం సాగేనా? సరుకులు కొనేప్పుడు అమ్మేప్పుడు కేవలం నిజం మీద ఆధారపడుతున్నారు. కాగితం పత్రం లేకుండా మాట మీద కోట్ల వ్యాపారం జరుగుతున్నది. చెక్కులు, రశీదులు, హుండీలు కోట్ల కొలదివి అడ్వాన్సుగా ఇస్తున్నాం. ఎక్కడో తప్ప అబద్ధం మోసం జరగడం లేదు.

    చిన్న వ్యాపారులతో, కూరగాయలు, పాలవాడు, ఆటోవానితో బేరం కుదిరించు కుంటున్నాం. ఉభయ పక్షాలూ మాటకు కట్టుబడుతున్నాయి.

    సామాన్యుడు సాధారణంగా అబద్ధం ఆడడం లేదు. అందు వలననే జీవితం సాగిపోతున్నది.

    జీవితం ఎలా సాగుతున్నది? సత్య వాదుల వలన!

    6. అలుబ్ధుడు

    లుబ్ధులు పీనాసివారు. అలుబ్దులు పీనాసులు కానివారు.

    ఇది ద్రవ్యం - వ్యయానికి సంబంధించిన విషయం. ధనం ద్రవ్యం అవుతుంది. ద్రవ్యానిది ద్రవ స్వభావం. ద్రవ్యానికి స్థిరత్వం లేదు. నిలకడ లేదు. ఒకచోట ఉండదు. మారుతుంటుంది. దాన్ని కదలకుండా కట్టిపెట్టే వారు లుబ్ధులు. అంటే వారు ద్రవ్య ప్రకృతికి విరుద్ధం అయిన పని చేస్తున్నారు. ధనం చెలామణిలో ఉండాలి. అందువల్ల అది ప్రజకు ఉపకరిస్తుంది. ఉత్పత్తి దారుడు మరింత ఉత్పత్తి చేయడానికి ఉపకరిస్తుంది. ఉత్పత్తి వల్ల సంపద పెరుగుతుంది. వినియోగదారులు పెరుగుతారు. దాచి పెట్టడం వల్ల ఇవన్నీ నిలిచి పోతాయి.

    'చీమలు పెట్టిన పుట్టలు
    పాముల కెరయైనయట్లు పామరుడుదగన్
    హేమంబు కూడబెట్టిన
    భూమీశుల పాలజేరు భువిలో సుమతీ'.

    లుబ్ధులు గడ్డి వామునకు కాపు ఉన్న కుక్క వంటివారు. ఆ కుక్క తాను తినదు, ఇతరులను తిననీయదు. Drunkards and Gamblers are better than hoarders అంటారు బట్రెండ్ రసెల్. తాగుబోతు, జూదరి తనకు నష్టం కలిగించుకుంటున్నాడు. సమాజానికి నష్టం కలిగించడం లేదు! కాని సొమ్ము దాచి పెట్టే వాడు సమాజానికి నష్టం కలిగిస్తున్నాడు!

    అలుబ్ధుడు డబ్బు దాచడు. తనకోసమే తన వారి కోసమే కర్చు చేస్తాడు. దానధర్మాలు చేస్తాడని కాదు. ఏదోరకంగా కర్చుచేస్తాడు.

    పెట్టుబడి పెట్టడం - బ్యాంకుల్లో దాచడం కూడా సమాజానికి ఉపకరిస్తుంది. సంపద, వినిమయం పెరుగుతుంది. అది కళ్యాణ కారకం అవుతుంది.

    అట్లా లుబ్ధుడు సమాజానికి అపకారం చేస్తున్నాడు. అలుబ్ధుడు అపకారం చేయకున్నాడు. అందువల్ల జీవన గమనానికి ఉపయోగపడుతున్నాడు.

    7. దానశీలురు

    ఈశావాస్య.మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ |
    త్యే త్యక్తేన భుంజీధా మాగ్నధః కశ్చచిద్ధనం ||        ఈశోపనిషత్తు - 1

    ఈ జగత్తులోని చరాచరమంతా ఈశ్వరమే. అతడు త్యజించిందే అనుభవించాలి. అన్యుల ధనానికి ఆశించకు.

    ఈ శ్లోకం సమస్త విశ్వాన్ని దర్శింపచేస్తున్నది. ఈ రెండు పాదాలను అంతే అన్య శాస్త్రాలు కాదు - ఆచరిస్తే లోకం నాకం అవుతుంది.

    ఈ లోకంలోని ధనద్రవ్యాలు - ఆస్తి పాస్తులు - పదవులు అధికారాలు - రాజ్యం రాచరికం అంతా భగవానునిదే. అతడే దీనినంతటినీ సృష్టించాడు. ఇవి ఎవరివీ కావు. ఈశ్వరునివి. ఈశ్వరుడు కరుణామయుడు. దయదలచాడు. ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇచ్చాడు. రక్షించమన్నాడు. అవి తనవి. తన పక్షాన ధర్మకర్తృత్వం నిర్వహించమన్నాడు. అతడు కర్త కాడు ధర్మకర్త మాత్రమే!   

    ధర్మ - అర్థ - కామములు పురుషార్ధాలు. ఇవి సామాజికములు. మోక్షం తురీయ పురుషార్థం. ఇది వ్యక్తి గతం. దీనికి ఇతరులతో ప్రమేయం లేదు. ఇతరులకు భాగస్వామ్యం లేదు.

    అర్థ కామములు లౌకికములు. ఈ రెండూ ధర్మంతో కూడినపుడు న్యాయపువి అవుతాయి. 'రాజానుమతో ధర్మం' రాజు అనుమతించిందే ధర్మం. ఆయాకాలాల్లో రాచరికం విధించిన నియమాలకు లోబడి ఆర్జించింది న్యాయ అర్థం అవుతుంది. అలాంటిదే కామం. కామం అంటే స్త్రీ విషయికం మాత్రం కాదు. కోరిక కామం అవుతుంది. అది ధర్మాన్ని అనుసరించేప్పుడే న్యాయమైన కోరిక అవుతుంది.

    ప్రకృతి స్వభావం ఇవ్వడం. ఒక్క గింజ వేయండి. చెట్టు ఎంతో ఇస్తుంది. ఇస్తూనే ఉంటుంది. ఇది దానత్వం. ఇది వృక్షపు దానశీలత్వం.

    దానం దైవ స్వరూపం. ఈశ్వరుడు ఒకనికి ధనం ఇచ్చాడు. కొంతమంది నిర్ధనులను సృష్టించాడు. సంపన్నుని ధనం స్వంత వినియోగానికి కాదు. ఇతర దీనుల, దరిద్రుల, అనాథల, అన్నార్తులకు ఇవ్వడానికి. ఆ సంపన్నుని ధనం ఇలాంటి వారందరికీ చెందాల్సి ఉంది. అలా పెట్టక తానే అనుభవించిన వాడు దొంగతనం చేసిన వాడవుతాడు.

    దానశీలునికి ఆత్మానందం కలుగుతుంది. ఆకలి గొన్నవానికి అన్నం పెట్టండి. ముందు కూర్చుని వడ్డించండి. అతడు తింటున్నప్పుడు, తిని తేన్చినపుడు దాతకు కలిగే ఆనందం చేసిన దానాన్ని మించుతుంది. పురాణ పురుషులగు దానశీలురకు నమస్కరింతాం.

    బలిచక్రవర్తి

    ప్రహ్లాదుని మనుమడు బలి. అతడు సమస్త విశ్వాన్ని జయించాడు. అతడు నర్మదా నదికి ఉత్తరాన అశ్వమేధం చేస్తున్నాడు. అతని గురువు శుక్రాచార్యులు. అతడు యజ్ఞం చేయిస్తున్నాడు.

    ఆ యజ్ఞానికి వామనమూర్తి వచ్చాడు. అతడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. అతని ప్రకాశానికి బలి, శుక్రుడు నిస్తేజులైనారు. వామనుడు బలి దగ్గరకు వచ్చాడు. బ్రాహ్మణ కుమారా! నీవు అడుగు పెట్టినావు. ఈ యజ్ఞం పావనం అయింది. నేను పావనుడను అయినాను. నీకు కావలసింది అడుగు. కాదనక లేదనక ఇస్తాను :- 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS