Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2


    1. గోవులు

    గోవునకు వేదం ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. గోవును పవిత్రంగా భావించింది. గోవును దేవత అన్నది. అంతేగాని గోవధ నిషేధించలేదు. యజ్ఞ యాగాదుల్లో గోవును బలి ఇచ్చిన నిదర్శనాలున్నాయి. నాడు మాంసమే ఆహారం. నిషేధమేల? నేటి గోవిధ నిషేధం కేవలం రాజకీయ నినాదం!

    'గోవు' 'అశ్వం' కూడ ఆ నాటి ఆహారం అయినాయి. ఆకలికి తాళలేక విశ్వామిత్ర మహర్షి కుక్క మాంసం తిన్నాడు. ఇవాళ్టికీ మాంసాహారం తప్పేం కాదు.

    మానవుడు సుఖజీవనం సాగించడానికి భారతదేశంలో జరిగినంత నిరంతర పరిశోధన, పరిశ్రమ మరొక చోట జరగలేదు. ఆహారం విషయంలో జరిగిన పరిశోధనల్లో శాకాహారం శ్రేష్ఠం అని తేలింది. జైన, బౌద్ధ సిద్ధాంతాలు జీవకారుణ్యం బోధించాయి. అప్పుడు మాంసాహారం అధమం అయింది. నేటి మన ఆహారంలోని వ్యంజనాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి. పాశ్చాత్యులు పరిశోధనలు చేసి నాటి ప్రాముఖ్యాన్ని ఇప్పుడు గుర్తించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు! పరిశోధనలు ఎందుకు మనం కలకాలంగా వాడుతున్నాం కదా! అంటే పరిశోధన ఒక వ్యాపారం! ఇవ్వాళ అవునన్న పరిశోధనే రేపు కాదంటుంది! ఏది సత్యం?

    ఇవాళ భారతదేశం శాకాహారం మీద విశ్వాసం ఉన్న దేశం. పాశ్చాత్యులు ఇప్పుడు శాకాహారపు విశిష్టతను గుర్తిస్తున్నారు! కాని ఇంకా గొడ్డుమాంసం Beef, పంది మాంసం pork తిని బ్రతుకున్నారు. ఈ తెలుపు రంగు మేధావులు యజ్ఞంలో పశుబలి 'ఆర్యుల ఆటవిక జీవనం' అంటున్నారు. వేదం 5000 సంవత్సరాలదని పాశ్చాత్య విద్వాంసులు అంగీకరిస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితపు పశుబలి ఆటవికం కంటే అధ్వాన్నం కదా! వేయేళ్ల చరిత్ర గల ఆధునిక యురొపు 400 ఏళ్ల చరిత్ర గల అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు పదుల వేల ఏళ్ల నాగరికతను ఏర్పరచిన వేదాన్ని ఆటవిక జీవనం అంటున్నాయండీ! ఇది గ్రుడ్లు వచ్చి తల్లిని వెక్కిరించడం లాంటిది. ఇది అధికారమదం. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించింది! మిగతావీ అస్తమించాలి!! ఇది ప్రకృతి శాసనం. తప్పదు. ఇంతలో ఈ మిడిసి పాటేల?

    "కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
    వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై" ఇది నిత్య సత్యం.

    ఆవు పాలను గురించి వేదం బహుధా ప్రశంసించింది. ఏనాడైనా పాడి ఆహారానికి తప్పనిసరి. ఎంతో ఆధునికం అనుకుంటున్న ఈ కాలంలోనూ పాడి తప్పని సరి. పాడికి గోవు అవసరం. పాడి జీవనాధారం.

    భారత వ్యవసాయానికి ఈ నాటికీ పశువే పట్టుగొమ్మ.

    యజ్ఞానికి నేయి అవసరం. ఆహారానికి సహితం ఘృతం తప్పని సరి. "ఘృతంవినా భోజనమప్రశస్తం"

    ఇన్నింటి వల్ల గోవు సామాజిక జీవితానికి అవసరం అని అర్థం అయింది.

    2. విప్రులు

    నేను భారతం రాస్తూ 'విప్రులు' అంటే మేధావులు అన్నాను. ధర్మరాజు అడవులకు వెళ్తుంటాడు. అతని వెంట విప్రులు తప్ప అన్యులు వెళ్లరు? రాజ్యం చేతులు మారినపుడల్లా వ్రేటు పడేది మేధావుల మీదనే! అది ఈ నాటికీ సత్యమే! నేను వంది, మాగధ మేధావులను గురించి చెప్పడం లేదు. వారు ఎవరినైనా స్తుతిస్తారు. "సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః" నిత్యం స్తుతించే వారు కొల్లలు! సత్యం చెప్పేవారు అరుదు!! ఏ ప్రభుత్వమూ 'సత్యం' సహించదు. దానికి పొగడ్తలు కావాలి! ధర్మరాజు పోషించిన మేధావులను దుర్యోధనుడు సహించడు. అందుకే వారు ధర్మరాజు వెంటవెళ్లారు. ఓట్ల వ్యాపారంలో అధికారం ఆర్జించిన వారూ అంతే!

    వేద వ్యాఖ్యలో సాయణాచార్యులు కూడ విప్రులను 'విద్వాంసులు' - 'పండితులు' అన్నారు.

    విప్రులు - బ్రాహ్మణులు. అనంతర కాలంలో 'కులం' అయింది. కులం కావడం తప్పని సరి. వృత్తులు వంశపరంపరగా వచ్చాయి. అందువల్ల కొందరు 'మేధావులు' కాని వారూ విప్రులు అవుతారు. కాలక్రమాన ప్రతి సంస్థా స్వప్రయోజన పరుల చేతుల్లో పడుతుంది. అప్పుడవి ఆత్మను కోల్పోయిన నిర్జీవ ప్రతిమలు అవుతాయి! విచిత్రం ఏమంటే సమాజం ఈ నిర్జీవ ప్రతిమలనే గుర్తిస్తుంది! ఇవ్వాళటి కులాలు అన్నీ అర్థం కోల్పోయిన ఆర్భాటాలే! పూర్వం కులాలున్నాయి. నేటి కుల రాజకీయాల్లేవు. ఓట్ల చదరంగంలో కులం 'పావు' అవుతున్నది.

    "ప్రజల పేరుమీద ప్రభుతలు సాగును
    ప్రజలె సర్వమంచు ప్రళయ ఘోష
    ప్రజలు పావులయ్య ప్రభువుల 'చెస్సు' లో
    విశ్వజనుల వాణి వినరరంగ" అన్నాను 1960 లో.

    విప్రులు - మేధావులు, విద్వాంసులు సమాజానికి వెన్నెముక వంటివారు. వారి నిత్య పరిశ్రమ వల్లనే సామాజిక ప్రగతి సాధ్యం. మేధావి నిర్భయంగా తన అభిప్రాయం వెల్లడించ గల వాతావరణం ఉండాలని 'వేదం' ఆ నాడు గుర్తించింది. సత్యానికి జరామరణాలుండవు. ఏ సమాజానికైనా మేధావుల స్వేచ్చ అవసరం. "గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, బ్రాహ్మణాస్సంతు నిర్భయాః" ఇవి వేదం చేసిన నినాదాలు.

    మధ్యయుగాల్లో క్రైస్తవ మతాచార్యులు ప్రభుత్వాలను నడిపించారు. అత్యాచారాలు చేశారు. స్వర్గాన్ని వీథిలో వేలంవేసి విక్రయించారు. ప్రగతికి అడ్డుగోడలు కట్టారు. తమను వ్యతిరేకించిన వాళ్లందరినీ శిక్షించారు. వారి దౌర్జన్యాలు సహించ లేక క్రైస్తవుల్లో ఒక వర్గం తిరుగుబాటు చేసింది. మతాన్ని రాజకీయం నుంచి విడగొట్టారు. వారు 'ప్రొటెస్టెంట్లు' అయినారు.

    భారతచరిత్ర వ్రాసిన వారు క్రైస్తవులు. భారత బ్రాహ్మణులను వారు మధ్య యుగపు క్రైస్తవ మతాచార్యులు అనుకున్నారు. బ్రాహ్మణులను మతపు గుత్తాధికారులుగా వర్ణించారు. బ్రాహ్మణులు క్రైస్తవమతాచార్యుల వంటి అత్యాచారాలు చేశారని చెప్పి ప్రజలను నమ్మించారు.

    వాస్తవం అందుకు పూర్తిగా విరుద్ధం. భారత ఇతిహాసం సాంస్కృతిక ఇతిహాసం. దాన్ని రాజకీయం చేయడమే ద్రోహం. కులమతాలపేర భారత సమాజాన్ని చిన్నాభిన్నం చేయాలనే కుట్రతో ఆంగ్లపాలకులు భారత చరిత్రను వంచించారు. మేధావులతో వప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి అర్ధశతాబ్దం దాటినా పాఠ్యాంశాల్లో, విశ్వవిద్యాలయాలలో అదే విషచరిత్ర బోధింప బడుతున్నది!

    క్రైస్తవ సామ్రాజ్యంలో రాజనీతి నుంచి మతాన్ని విడదీయడానికి తిరుగుబాటు అవసరం అయింది. సనాతన కాలంనుండీ భారత సమాజంలో ధర్మం వేరుగానూ రాజకీయం వేరుగానూ వర్ధిల్లాయి.

    ధర్మం సమాజాన్ని నిర్మించింది. జీవితాన్ని ఏర్పరచింది. భారత రాజులూ కేవలం పాలించారు. They have just adminstered. భారత ప్రభువులు ఏనాడూ శాసించలేదు! ధర్మానికీ,రాజకీయానికీ స్పర్ధ వచ్చినప్పుడు ధర్మానిదే పైచేయి అయింది. రాజకీయం ధర్మం ముందు లొంగింది.

    రాముడు ధర్మంకోసం రాజ్యం వదులుకున్నాడు.

    విశ్వామిత్రుడు ధర్మబలం సాధించ దలచాడు. రాజ్యం వదులుకున్నాడు.

    ఇలాంటి ఉదాహరణలు అనేకం. బ్రాహ్మణం ధర్మం అనుకుంటే రాజకీయం క్షాత్రం అయింది. "బ్రాహ్మణో ముఖమాసీత్ - బాహూ రాజన్యః కృతః." క్షాత్రం, బ్రాహ్మణం పోటీలు పడలేదు. ఒకదాని సరసన ఒకటి వర్ధిల్లాయి. ఒకరి హద్దులను ఒకరు అతిక్రమించలేదు.

    చాణక్యుడు తన బుద్ధి బలంతో భారత సామ్రాజ్యం స్థాపించాడు. చంద్రగుప్తునికి రాజ్యం ఇచ్చాడు. తాను సన్యసించాడు.

    విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. తాను పదవి కోరలేదు. హరిహర బుక్కరాయలకు పట్టం కట్టాడు.

    ఇది భారత సంప్రదాయం. ఇంగ్లీషు వానికి ఇది తెలియక కాదు. మనను శాశ్వతంగా సాంస్కృతిక బానిసలను చేయటానికి పన్నిన కుట్ర అది. భారతీయ మేధావులు అది గుర్తించాలి. ప్రభుత్వాలు జడపదార్థాలు. అవి కదలవు. వాటికి పదవి తప్ప సంస్కృతి అర్థంకాదు!

    సమాజానికి మెదడు మేధావి. అతని ఆవశ్యకత తెలియ పరచింది శ్లోకం.

    3. వేదం

    సమాజానికి సర్వస్వం వేదం. పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చభవ్యం. సర్వమూ వేదమే - జరిగిందీ - జరుగనున్నదీ వేదమే. వర్తమానం ఉండదు. అది క్షణంలో భూతకాలం అవుతుంది. మరుక్షణంలో భవిష్యత్తు అవుతుంది!

    "ప్రత్యక్షే ణానుమిత్యా వా యస్తూపాయో న లభ్యతే
    ఏతం విదన్తి వేదేన తస్మా ద్వేదస్య వేదతా "

    ప్రత్యక్షము, అనుమానంతో ఉపాయం దొరకదు. అప్పుడు వేదం ఉపాయం చూపుతుంది. అదే వేదపు వేదత్వం.

    ప్రత్యక్షం, అనుమానం రెండు ప్రమాణాలు - కొలతలు. ప్రత్యక్షం అంటే కంటికి కనిపించేది. అగ్ని మన ముందు మండు తున్నది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అగ్ని కంటికి కనిపించడం లేదు. దూరంగా పొగ కనిపిస్తున్నది. కాబట్టి అక్కడ అగ్ని ఉన్నదని అనుమానం. ఇది అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల వలన అవగతం కాలేదు. అప్పుడు వేదం అవగతం చేయిస్తుంది.అర్థం చేయించడమే వేదపు వేదత్వం.

    తర్కానికి మూడు ప్రమాణాలు 1. ప్రత్యక్షం 2. అనుమానం 3. శాబ్ధం అంటే వేదం, ఉపనిషత్తు, పురాణాది శబ్దరూపాలు.

    శ్రుతి స్సనాతనీ సాధ్వీ సర్వమానోత్తమోత్తమా |
    అతీన్ద్రి యార్థ విజ్ఞానే మానం సశ్రుతి రేవహి ||

    శ్రుత్యేక గమ్యే సూక్ష్మార్థే సతర్కః కిం కరిష్యతి |
    మానాను గ్రాహకస్తర్కో నస్వతంత్రః కదాచన ||

    వేదం సనాతనం, సాధ్వి. కొలమానాల్లో ఉత్తమం. ఇంద్రియాలకు అందని విజ్ఞానానికి వేదమే కొలమానం. వేదానికి మాత్రమే గోచరమయ్యే సూక్ష్మార్థం ఉంటుంది. దానికి తర్కం ఎలా ఉపకరిస్తుంది? తర్కం ఇతర ప్రమాణాల మీద ఆధారపడింది. తర్కం స్వయంగా ప్రమాణం కాదుకదా!

    "శాస్త్రయోనిత్వాత్" వేదం శాస్త్రం మాత్రం కాదు. సకల శాస్త్రాలకూ జన్మనిచ్చింది. అన్నీ వేదం నుంచే ఆవిర్భవించాయి.

    వేదం వల్లనే జీవితం నిలిచి ఉంది.

    4. పతివ్రతలు

    సతి పరమ శివుని ప్రథమ భార్య. ఆమె దక్షయజ్ఞంలో దహనం అయ్యింది. అందుకే సహగమనానికి 'సతి' అని పేరు వచ్చింది.

    సతి అంటే పతివ్రత. పతిని నమ్ముకున్న స్త్రీ పతివ్రత. సమాజం అధిక భాగం సంతానం మీద ఆధారపడి ఉంది. సంతానమే సమాజపు నిరంతర జీవనం. సంతానం తల్లి మీద స్త్రీ మీద ఆధారపడి ఉంది. కావున స్త్రీయే సమాజం. స్త్రీ ఎంత సౌశీల్యవతి అవుతే సమాజం అంత సుశీలం అవుతుంది. ఇంటికి వచ్చన కోడలును వేదం 'సామ్రాజ్జీభవ' అంటుంది. తన కుటుంబానికి ఆమె మహారాణి.

    AIDS నుంచి రక్షణకు ఒక పురుషుడు ఒక స్త్రీ అనే నినాదం ప్రచారం చేస్తున్నారు. ఇది లైంగిక సంబంధం వరకే పరిమితం అంటున్నారు!

    త్రేతాయుగం లోనే వాల్మీకి మహర్షి ఏకపత్మీత్వాన్ని ఆవిష్కరించాడు. శ్రీమద్రామాయణం ద్వారా ప్రచారం చేశారు. ఏకపతిత్వం, పత్నీత్వం ఒక్క లైంగిక సంబంధానికే కాదు. సకల మానసిక మానవ సంబంధాలకు అవసరం. బహు భార్యత్వం, లైంగిక స్వేచ్చ ప్రమాదకరం అని హెచ్చరించారు. బహుభార్యల కారణంగా దశరథుడు, రావణుడు నశించారు. వాలి స్త్రీ లోలుడై నశించాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS