Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



    వెంకన్న ఇన్ స్పెక్టర్ తో కరచాలనం చేసి అక్కణ్ణించి బయల్దేరాడు. అతడు తిన్నగా రాఘవరావుండే వీధికి వెళ్ళాడు. ఆ వీధిలో రాఘవరావింటికి ఎదురుగానూ, పక్కగానూ ఉండేవాళ్ళను చాలా ప్రశ్నలు వేశాడు. అతడికి పనికొచ్చే సమాచారం ఓ పదేళ్ళ కుర్రాడినుంచి లభించింది.
    నల్లపాంటు, తెల్లషర్టు వేసుకొని-కుచ్చుటోపీతో ఉన్న వ్యక్తి ఒకడు సుమారు ఆరుగంటల ప్రాంతంలో రాఘవరావు ఇంట్లోంచి బయటకు రావటం ఆ కుర్రాడు చూశాడుట. మనిషికి గుబురు గెడ్డం, మీసాలున్నవట, ఆ వ్యక్తిని అంతకుముందెన్నడూ తాను చూడలేదుట. ఆ వ్యక్తి సందు మొనలో రిక్షా ఎక్కాడుట.
    వెంకన్న ఆ కుర్రాడిని మెచ్చుకొని అయిదు రూపాయలు బహుమతిగా యిచ్చి మళ్ళీ ఆ వ్యక్తి కనబడితే తనకు చెప్పమన్నాడు. తర్వాత అతడు సందు మొగలోకి వెళ్ళాడు. రిక్షావాళ్ళు చాలామంది ఉన్నారక్కడ.
    వెంకన్న తన జేబులోంచి పదిరూపాయల నోటుతీసి "ఈ డబ్బు మీదే అవుతుంది-నాక్కావలసిన సమాచారం అందిస్తే!" అన్నాడు.
    వాళ్ళందరూ చాలా కుతూహలపడ్డారు.
    "నల్లపాంటు, తెల్లషర్టు, కుచ్చుటోపీ, గుబురుగెడ్డం, మీసాలు-ఇవన్నీ ఉన్న వ్యక్తిని మీలో ఎవరైనా నన్ను సాయంత్రం ఆరుగంటల ప్రాంతాల రిక్షా ఎక్కించుకోవటం జరిగిందా?" అన్నాడు వెంకన్న.
    అక్కడున్న వారిలో ఒకడు చటుక్కున-"ఆ ఛాన్సు-అదిగో ఆ గంగన్నగాడికే వచ్చిందండి-" అన్నాడు.
    "ఏమో-నాకేం తెలియదు-" అన్నాడు గంగన్న.
    తనకు సమాచారమిచ్చిన రిక్షావాడివంక చూస్తూ-"గంగన్న చేత నిజం చెప్పిస్తే ఈ పదిరూపాయలూ నీవి. ఆపైన గంగన్న నిజం చెప్పాడంటే అతడికీ మంచి బహుమతి ఉంటుంది-" అన్నాడు వెంకన్న.
    ఆ మనిషిని తను రిక్షా ఎక్కించుకున్నట్లు గంగన్నకు ఒప్పుకోక తప్పలేదు. తర్వాత గంగన్న వెంకన్నను చాటుగా తీసుకువెళ్ళి-"తన గురించి ఎవరికీ చెప్పొద్దని ఆ బాబు నాకు ఇరవై రూపాయలిచ్చాడు. ఆయన్ను నేను అన్నపూర్ణా హోటలు దగ్గర దిగవిడిచాను-" అన్నాడు.
    వెంకన్న అన్నపూర్ణా హోటలుకు వెళ్ళాడు.
    అటువంటి వ్యక్తి తమ హోటల్లో బసచేసినట్లు మేనేజరు ఒప్పుకున్నాడు. రూం నెంబరు పదకొండులో అతడుంటున్నాడు. అయితే రాత్రి పదిగంటలకు అతడు బయటకు వెళ్ళాడు. ఇంకా రాలేదు.
    వెంకన్న తానొకసారి అతడి గదిని చూడాలన్నాడు.
    అన్నపూర్ణా హోటలు ప్రొప్రయిటరు చాలా పర్యాయాలు వెంకన్నవల్ల ప్రయోజనం పొంది ఉన్నాడు. అందుకని ఆ హోటల్లో అతడికి ప్రత్యేకమైన గౌరవముంది.
    మేనేజరు, వెంకన్న గదిలోకి వెళ్ళారు.
    గదిలో ఆ వ్యక్తికి సంబంధించిణ సామానేమీ లేదు.
    మంచినీళ్ళు తాగినట్లు సూచనగా ఒక గాజు గ్లాసు ఉన్నది. అయితే వెంకన్నను ముఖ్యంగా ఆకర్షించిన వస్తువొకటుంది.
    అది క్రోటన్సు ఆకు!
    సగానికి మడతపెట్టబడి విరిగి ఉన్న ఆ ఆకు ఇంకా పూర్తిగా వడిలిపోలేదు. వెంకన్న చటుక్కున వంగి అది తీసుకొని-"మీ హోటల్లో క్రోటన్సు మొక్క లున్నాయా?" అనడిగాడు.
    "లేకేం-చాలా వున్నాయి సార్!" అన్నాడు మేనేజర్.
    వెంకన్న ఒక్కక్షణం నిరుత్సాహ పడ్డాడు. తర్వాత నెమ్మదిగా-"ఖరీదు ఇచ్చేస్తాను. ఈ గదిలోని గ్లాసు, కూజా నేను తీసుకువెడితే మీకు అభ్యంతరమా?" అన్నాడు.
    "అయ్యో-తీసుకువెళ్ళండి సార్! ఖరీదు ప్రసక్తి వద్దు-" అన్నాడు మేనేజరు వినయంగా.
    "ఈ క్రోటన్సు ఆకు కూడా నేను తీసుకువెడతాను. మీకు అభ్యంతరం లేదుకదా!" అన్నాడు వెంకన్న.
    "మీరు నాతో వేళాకోళమాడుతున్నారు. ఆకు ముక్కదేముంది సార్-అది తీసుకువెళ్ళడానికి అనుమతి అడగాలా?" అన్నాడు మేనేజరు.
    వెంకన్న తనలో తను నవ్వుకుంటూ-"ఈ ఆకు ఓ హంతకుడిని పట్టిచ్చే ఆధారం. ఆ హంతకుడు మీ కస్టమర్. కస్టమర్సుకి కష్టం కలిగించే పనులు ఏ హోటల్ వాళ్ళూ చేయరుకదా-" అనుకున్నాడు.
    "ఇంతకూ విశేషమేమిటి సార్ - ఈ గదిలో చేరిన వ్యక్తి నేరస్థుడా?" అన్నాడు మేనేజర్.
    "బహుశా నేరస్థుడే అయుండవచ్చును.  అతడు తిరిగి గనుక వస్తే నేనిలా వచ్చి వెళ్ళినట్లు అతడికి చెప్పకండి. కొత్త కూజా, కొత్త గ్లాసు ఇక్కడుంచండి. ఎందుకైనా మంచిది-ఇలాంటిదే ఓ క్రోటన్సు ఆకు ఒకటి ఇదేవిధంగా మడిచి ఇక్కడ పారేయించండి. అతడు రాగానే ఫోను చేసి నాకు తెలియబర్చండి-"అని-"ఇంతకూ అతడు రూం ఎన్ని రోజులకి బుక్ చేసుకున్నాడు?" అనడిగాడు వెంకన్న.
    "నాలుగు రోజులకు-...." అన్నాడు మేనేజర్.
    వెంకన్న తృప్తిగా తలాడించి వెళ్ళిపోయాడు.
    
                                    4

    మర్నాడే పేపర్లో మొదటి పేజీలోనే ఈ హత్యావార్త వచ్చింది.
    అందులో-పోలీసులు శశికాంత్ ని అరెస్టు చేసినట్లూ వచ్చింది. డిటెక్టివ్ వెంకన్న ఈ కేసును పరిశోధిస్తున్నట్లూ వచ్చింది. డిటెక్టివ్ వెంకన్న అభిప్రాయాల గురించి ప్రత్యేకంగా ఓ పేరా వ్రాయబడింది. అందులో ఈ హత్య కేసులో ముఖ్యాధారం ఓ క్రోటన్సు ఆకు అనీ దాని' గురించి వెంకన్న అన్వేషిస్తున్నాడనీ వ్రాశారు.
    వెంకన్న ఆ వార్త చదువుకుని తనలో తాను నవ్వుకున్నాడు. హంతకుడీ వార్త చదువుతాడా? చదివినా అతడికి క్రోటన్సు ఆకు గురించి గుర్తుంటుందా? ఉంటే దాని గురించి మళ్ళీ హోటలుకు వెడతాడా?
    వెంకన్న తన ఆఫీసులో కూర్చున్నప్పటికీ ఏదో సందేశం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించాడు. అతడు ఎదురుచూసిన సందేశం సుమారు పదిగంటల ప్రాంతంలో వచ్చింది.
    ప్రొఫెసర్ భూషణరావు నుంచి చిన్న పార్సిల్, ఓ కవరు వచ్చాయి.
    ఆ రెండింటినీ తీసుకొని వెంకన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు.
    ఇన్ స్పెక్టర్ వెంకన్నను ముభావంగా పలకరించాడు.
    "డియర్ ఇన్ స్పెక్టర్! శశికాంత్ హంతకుడు కాదనడానికి తిరుగులేని సాక్ష్యం సంపాదించాన్నేను-" అన్నాడు వెంకన్న.
    ఇన్ స్పెక్టర్ కళ్ళు మెరిశాయి-"ఏమిటది?" అన్నాడు.
    "హంతకుడు చాలా తెలివైనవాడు. అతడు ముందు శశికాంత్ ని బుట్టలో వేసుకొని సాయంత్రం ఆరింటికి తాననుకున్న చోటికి వచ్చేలా చేశాడు. అంతకుముందే తను హత్యచేసి శశికాంత్ ని గదిలో ఇరికించి తను ఇంట్లోంచి బయటపడి పోలీసులకు ఫోను చేశాడు. అతడు ఇంట్లోంచి బయటకు వస్తూండగా కొందరు చూశారు. ఆ తర్వాత అతఃడు రిక్షాలో ఓ హోటలుకు వెళ్ళాడు. బహుశా హోటల్నుంఛే పోలీస్ స్టేషన్ కు ఫోనుచేశాడు. హోటల్నించే రాత్రి పారిపోయాడు. అయితే హోటల్లో అతడి గురించి సమాచారం చాలా వుంది. అతడి వేలి ముద్రలు సంపాదించాను. ఇంకా ముఖ్యమైనది-క్రోటన్సు ఆకు...."
    ఇన్ స్పెక్టర్ వెంకన్నను మధ్యలో ఆపి-"అవును-పేపర్లో చూశాను....క్రోటన్సు ఆకు ప్రాముఖ్యత ఏమిటి?" అనడిగాడు.
    "శశికాంత్ కధనం మీకు గుర్తులేదా?" అన్నాడు వెంకన్న-"ఆ ప్రకారం హంతకుడు ఓ క్రోటన్సు ఆకు కోసి మడిచి వాసన చూశాడు. హంతకుడు ఆకును తర్వాత జేబులో వేసుకొని ఉంటాడు. ఆ తర్వాత హోటల్లో పారేశాడు. అది నేను సంపాదించాను....."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.