Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



    "మీ కధలో లోపాలేం లేవు. కానీ పనికివచ్చే సమాచారం కొంత లేదు. ఉదాహరణకు శశికాంత్ కధ అబద్ధం కాదనడానికి-అతడు ఊళ్ళోలేనట్లు సృష్టించబడిన సాక్ష్యాలున్నాయి-" అంది శారద.
    "అవును-ఆ ఎలిబీ అతడు కాగితాల కోసం కాదనీ, హత్యచేయటం కోసం తనే సృష్టించుకున్నాడనీ పోలీసులు అంటున్నారు-" అన్నాడు వెంకన్న.
    శారద నిట్టూర్చి-"అదీ నిజమే! అయితే అతడు చెప్పేదేమిటంటే-తనను పిలిచి పోస్టు డేటెడ్ చెక్కు ఇచ్చిన వ్యక్తి తెలివిగా తననిహత్యలో ఇరికించాడని! ఆ వ్యక్తి శశికాంత్ కి నాలుగైదు కత్తులు చూపించి-వాటిలో ఒకటి ఎంచుకొమ్మన్నాడట. అప్పుడు తను చాలా కత్తులు తాకాననీ-ఆ విధంగా తన వేలిముద్రలు కత్తిమీదకు వెళ్ళివుంటాయనీ అతడంటున్నాడు. తనవద్ద వున్న కత్తి ఉపయోగించనే లేదుకదా!" అంది.
    "దానికేముందీ? అతడివద్ద రెండు కత్తులుండి వుండవచ్చు-"    
    "మీరు కూడా పోలీసులకు వలెనే ఆలోచిస్తున్నారు-" అంది శారద దీనంగా.
    "నువ్వలా కంగారుపడకు. హతుడి కత్తిమీది వేలిముద్రలు శశికాంత్ ని హంతకుడిని చేయవు. నేనోసారి అతణ్ణి కలుసుకొని మాట్లాడితేకానీ ఏ విషయమూ చెప్పలేను. ఇంతకీ నువ్వు నాకేమైనా ఫీజు ఇచ్చుకో గలవా?" అన్నాడు వెంకన్న.
    శారద పర్సు తెరిచింది. పది వందరూపాయల నోట్లు వెంకన్నకు అందించి-"ప్రస్తుతానికి ఇంతే ఇచ్చుకోగలను-" అంది.
    వెంకన్న ఆశ్చర్యంగా - "ఎక్కడిది నీకీ డబ్బు?" అన్నాడు.
    "నా చేతికి ఉన్న బంగారు గాజులు తాకట్టు పెట్టాను. ఇంటిలో వాళ్ళకి అనుమానం రాకుండా అలాంటివే నకిలీవి కొన్నాను-" అందామె.
    వెంకన్నా వెయ్యి రూపాయలూ ఆమెకు తిరిగిచ్చేసి మరో పదిరూపాయల నోటు కూడా ఆమెకు అందించి-"ఈ పదిరూపాయలూ పరిహారం చెల్లించి ఆ వెయ్యరూపాయలూ వెనక్కిచ్చి నీ గాజు తెచ్చుకో, చాలా కేసుల్లో అవసరానికి మించే నాకు దొరుకుతోంది. శశికాంత్ విడుదలయ్యేక డబ్బు అతడి దగ్గర్నుంచి తీసుకుంటాను. ఇలా గాజులు తాకట్టు పెట్టి నా ఫీజు తీసుకురావటం నాకు అవమానం-" అన్నాడు.
    శారద గంభీరంగా-"దీన జనోద్దరణ కోసమే మీరు ఇక్కడ బల్లకట్టి ప్రాక్టీసు పెట్టినట్లయితే త్వరలోనే మీరూ వాళ్ళలో ఒకరు కావాల్సొస్తుంది-" అంది.
    "దీన జనోద్దరణ నా ధ్యేయంకాదు. అలాగని సాయం పేరుతో వాళ్ళను దోపిడీ చెయ్యటం నావల్లకాదు-" అన్నాడు వెంకన్న.
    అప్పుడే అతడి బల్లమీద ఫోన్ మ్రోగింది.
    "డియర్! నేను వంటింటిలోంచి మాట్లాడుతున్నాను. మీరు నాకు చాలా నచ్చారు. ఒక్కసారి లోపలకు వస్తే మంచి బహుమతి ఇస్తాను-" అంది పద్మావతీదేవి.
    వెంకన్న ఫోన్ క్రెడిల్ చేసి-"నువ్వింక వెళ్ళొచ్చు-" అన్నాడు. శారద అతడికి నమస్కరించి వెళ్ళిపోగానే వెంకన్న లేచాడు.
    "బహుమతి అంటే ముద్దే కదూ?" అంది సీతమ్మ.
    "నా స్వంత ఫోన్ వినవద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు?" అన్నాడు వెంకన్న కోపంగా. అది నిజమైన కోపం కాదని పదునెనిమిది వత్సరాల ప్రాయపు అసిస్టెంట్సిద్దరకూ తెలుసు. అందుకని వారతడి కోపానికి భయపడినా అది నటన మాత్రమే!    
    "బాస్! నేనెప్పుడూ మీ స్వంత ఫోన్ వినను. ఈ సీతమ్మకు బుద్ధి లేదు. అయినా వెళ్ళేది వంటింటిలోకేనా అని అడగడానికి బదులు-బహుమతి అంటే ఏమిటని అడగడమెందుకూ?" అంది రాజమ్మ.
    "మీరు కేసు గురించి నోట్సు తయారుచేయండి. నేను పదినిమిషాల్లో వస్తాను-" అంటూ లోపలకు వెళ్ళాడు డిటెక్టివ్ వెంకన్న.

                                    3

    మర్నాడుదయం డిటెక్టివ్ వెంకన్న పోలీస్ స్టేషన్లో శశికాంత్ ని కలుసుకొని అతడి కథనమంతా విన్నాక ఇన్ స్పెక్టర్ తో మాట్లాడేడు. అందులో ఒక విచిత్రం బయటపడింది.
    పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం హతుడు మధ్యాహ్నం మూడు గంటలకు చంపబడ్డాడు. శశికాంత్ పొదల మాటున సాయంత్రం నాలుగూ నలభై అయిదు నుంచి గంటసేపున్నానంటున్నాడు. ఆ సమయంలో అతడు రాఘవరావుని చూశానంటున్నాడు. యెలా సాధ్యం?
    "అదంతా కట్టు కథ. మీరు నమ్మకండి-" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "అది సరే-హంతకుడినంత ధైర్యంగా గదిలో బంధించిన ఆ మనిషి ఎవరు? అతడక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకున్నాడు?" అన్నాడు వెంకన్న.
    "అవన్నీ మనకు అనవసరం. దొరకని సాక్ష్యాల గురించి తల బద్దలు కొట్టుకోవటం మీ డిటెక్టివ్ ల పని. దొరికిన సాక్ష్యాలు కేసును తేల్చేస్తున్నప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్పండి!" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    వెంకన్న నవ్వి - "ఎందుకో చెప్పమంటారా?" అన్నాడు. ఇన్ స్పెక్టర్ బదులిచ్చేలోగానే-"మీ కేసు కోర్టులో నిలబడదు. మీ కథలో చాలా లోపాలు వున్నాయి. హత్య మధ్యాహ్నం మూడింటికి జరిగింది. పోలీసులకు ఫోన్ ఆరుంపావుకి వచ్చింది. హంతకుడు గదిలో ఎన్ని గంటలకు బంధింపబడ్డాడు? మూడింటికా ఆరింటికా? మూడింటికే అయితే హంతకుడిని బంధించిన వ్యక్తి ఆరుంపావుదాకా ఎందుకు పోలీసులకు ఫోన్ చెయ్యలేదు? ఆరింటికనుకుందామా అంటే హత్య జరిగేక అంతసేపు హంతకుడక్కడేం చేస్తున్నాడు?" అనడిగాడు వెంకన్న.
    ఇన్ స్పెక్టర్ కొంతసేపు ఆలోచించి-"ఇందులో పెద్ద విశేషమేముంది? హంతకుడు తన వేలిముద్రలు కత్తిమీద ఉండిపోయుంటాయని మళ్ళీ వచ్చివుంటాడు. అతడాయింటిలోకి వెళ్ళటం చూసిన ఏ ఎదురింటాయనో అనుమానించి లోపలకు వెళ్ళి జరిగింది చూసి అతడిని గదిలో బంధించి పోలీసులకు ఫోన్ చేసి ఉంటాడు-" అన్నాడు.
    "చాలా బాగుంది. శశికాంత్ ఆ ఇంటిలోని మనిషేనని మీరు మర్చిపోతున్నారు. అతడా ఇంటిలోకి వెడుతూంటే ఏ ఎదురింటివారూ అనుమానించరు. అనుమానించి అనుసరించినా హత్య జరిగి అప్పటికి మూడు గంటలయింది. ఇంటిలోంచి ఏ కేకా వినబడకుండానే-గదిలో అడుగు పెట్టిన శశికాంత్ ని హంతకుడిగా ఎలా అనుమానించటం జరుగుతుంది?" అన్నాడు వెంకన్న.
    "అయితే ఏం జరిగిందంటారు?" అన్నాడు యిన్ స్పెక్టర్ విసుగ్గా.
    "జరగడానికేముంది? హంతకుడు శశికాంత్ కాదు. అతడు ట్రాప్ చెయ్యబడ్డాడు. కాస్త అనుభవమున్న నేర పరిశోధకులెవ్వరైనా ఈ విషయం గ్రహించగలరు. మీకు అనుభవంలేదని నేననను. కానీ నిర్దోషిని ఉరికంబం మెక్కించే పొరపాటు జరుగకూడదని ఆలోచిస్తే మీరు ఇంత త్వరగా నిర్ణయాలకు రాలేరు. మనకు కేసు తేలిపోవడం కాదు కావలసింది-దోషి పట్టుబడటం!"
    ఇన్ స్పెక్టర్ మాట్లాడలేదు.
    వెంకన్న మళ్ళీ అన్నాడు-"ఈ కేసులో నేను మీకు సాయపడతాను. శశికాంత్ విషయంలో తొందరపడిమీరొక నిర్ణయానికి రాకండి-"
    "థాంక్స్!" అన్నాడు ఇన్ స్పెక్టర్ -"స్పాట్ లో దొరికిన వ్యక్తి హంతకుడు కాదని అనుమానిస్తూ పోతూంటే మా పోలీసులకు ఒక్క కేసు కూడా తేలదు అయితే నేను తొందరపడనని మీకు హామీ ఇస్తున్నాను-"




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.